You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు.
మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘‘జులై 2న జరిగిన ఘటనతో తీవ్రంగా బాధపడ్డాను. ఈ బాధను భరించే శక్తిని దేవుడు ఇవ్వాలి. ప్రభుత్వం, పాలనావ్యవస్థపై నమ్మకం ఉంచండి. ఈ గందరగోళం సృష్టించిన వారిని వదిలిపెట్టరన్న నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలు, గాయపడ్డవారికి వారి జీవితాంతం సాయంగా ఉండాలని కమిటీ సభ్యులకు నా లాయర్ల ద్వారా కోరాను’ అని భోలే బాబా చెప్పారు’’
ఏమిటీ ‘హాథ్‌రస్ తొక్కిసలాట’?
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో జులై 2న నిర్వహించిన సత్సంగ్‌కు పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
సత్సంగ్‌లో ప్రవచనాలు బోధించిన ‘భోలే బాబా’ పాద ధూళి కోసం భక్తులు ఒక్కసారిగా వెళ్లినప్పుడు తొక్కిసలాట జరిగింది.
ఆ తొక్కిసలాటలో 121 మంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
మృతులలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.
ఘటన జరిగిన తరువాత భోలే బాబా ఇంతవరకు కనిపించలేదు.
పోలీసులు ఈ ఘటనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు చేర్చకపోవడం చర్చనీయమైంది.
ఇంతకీ భోలే బాబా ఎవరు?
భోలే బాబా అసలు పేరు సూరజ్‌పాల్ జాటవ్. ఆయన్ను నారాయణ్ సాకార్ హరి అని కూడా పిలుస్తారు.
ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్ అయిన సూరజ్‌పాల్ జాటవ్ ఉద్యోగాన్ని వదిలేసి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారని ‘బీబీసీ’ కోసం రాసిన కథనంలో దినేశ్ శాక్య వెల్లడించారు.
ఎటా జిల్లా నుంచి విడిపోయిన కాస్‌గంజ్ జిల్లాలోని పటియాలి ప్రాంతానికి చెందిన బహదూర్‌పూర్ భోలే బాబా స్వగ్రామం.
ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తొలుత ఆయన లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎల్ఐయూ)లో పనిచేశారు.
వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట ఆయన సస్పెండ్ అయ్యారు. తర్వాత ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు.
అంతకుముందు, సూరజ్‌పాల్ పలు పోలీసు స్టేషన్లలో, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లలో పనిచేశారు.
వేధింపుల కేసులో సూరజ్‌పాల్ ఎటా జైలులో శిక్ష కూడా అనుభవించారని ఇటావా పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ చెప్పారు.
డిస్మిస్ అయిన తర్వాత, సూరజ్‌పాల్ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఆయనకు మళ్లీ ఉద్యోగం వచ్చింది. కానీ, 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకున్నారు సూరజ్‌పాల్.
పదవీ విరమణ తర్వాత సూరజ్‌పాల్ స్వగ్రామం నాగ్లా బహదూర్‌పూర్ చేరుకున్నారు. అక్కడే కొన్ని రోజులు గడిపారు.
భగవంతుడితో మాట్లాడతానని తన ఊరి ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. తనకు తాను భోలే బాబాగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు.
కొద్దికాలంలోనే ఆయనకు అనుచరులు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డారు. వాళ్లు ఆయన్ను అనేక పేర్లతో పిలుచుకునే వారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు వేలసంఖ్యలో ప్రజలు వచ్చేవారు.
ఆయనెప్పుడూ తెల్లటి వస్త్రాలలోనే కనిపిస్తారు. పైజామా కుర్తా, ప్యాంట్ -షర్ట్, సూట్‌లలో కనిపిస్తుండేవారు.
ఇంటర్నెట్‌లో ఆయన అంత పాపులర్ కాదు. సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు అంతగా లేరు.
తన ఫేస్‌బుక్ పేజీలో అంత ఎక్కువ లైక్‌లు లేవు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన లక్షల మంది భక్తులను పోగు చేసుకున్నారు. ఆయన ప్రతి సత్సంగ్‌లో వేల మంది భక్తులు కనిపిస్తుంటారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)