You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హాథ్‌రస్ తొక్కిసలాట: ‘ఓట్ బ్యాంక్ రాజకీయాలతో’ ఎఫ్ఐఆర్‌లో భోలే బాబా పేరు చేర్చలేదా?
హాథ్‌రస్ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరు మహిళలు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఆరుగురు 'భోలే బాబా' సత్సంగ్ నిర్వహించిన కమిటీలోని సభ్యులు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్‌రస్ సమీపంలో జులై 2న నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, కార్యక్రమ నిర్వాహకుడైన దేవప్రకాశ్ మధుకర్ గురించి సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు.
అయితే, ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా 'భోలే బాబా' అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి ప్రస్తావన లేకపోవడం చర్చనీయమైంది. అంతేకాదు పోలీసులు ఆయనను ఇప్పటికీ ప్రశ్నించలేదు.
'బాబా' పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు
విలేకరుల సమావేశంలో అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్‌ను జర్నలిస్టులు ఇదే ప్రశ్న అడిగారు.
సత్సంగ్‌లో ప్రవచానాలు చెప్పే 'భోలే బాబా' పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదని, ఆయనను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని అడిగారు.
తొక్కిసలాట జరగడంతో నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయారని మాథుర్ చెప్పారు. కార్యక్రమం బాధ్యత నిర్వాహకులపై ఉందని, అందుకే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం 'బాబా'ను ప్రశ్నించలేదని, విచారణలో మరెవరి పాత్రైనా ఉందని తెలిస్తే, వారిని కూడా విచారిస్తామని మాథుర్ తెలిపారు.
'బాబా' పాత్ర ఉందా లేదా అనే విషయం గురించి ఇపుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఐజీ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు ప్రస్తావించలేదని, కార్యక్రమం నిర్వహణ బాధ్యత ఆర్గనైజర్లదే కాబట్టి వారి పేరు చేర్చామన్నారు.
హాథ్‌రస్ సంఘటనపై నిర్వాహకులు, సేవాదార్లను తప్పుపట్టిన పోలీసులు 'బాబా' పాత్ర గురించి పెద్దగా వివరించలేదు.
పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేద్ ప్రకాష్ ముద్కర్ నేతృత్వంలోని కమిటీ హాథ్‌రస్‌లో సత్సంగ్‌కు అనుమతి తీసుకుంది. ఘటన తర్వాత ఆయన కుటుంబసభ్యులతో పరారయ్యారు.
పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురూ ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులని, వలంటీర్లుగా పనిచేస్తున్నారని ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు.
అరెస్టయిన వారి వివరాలు..
మెయిన్‌పురికి చెందిన రామ్ లదాయతే, ఫిరోజాబాద్‌కు చెందిన ఉపేంద్ర సింగ్ యాదవ్, హాథ్‌రస్‌కు చెందిన మేఘ్‌సింగ్, మంజు యాదవ్, ముఖేష్ కుమార్, మంజు దేవిలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.
అరెస్టయిన వారు ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారని ఐజీ చెప్పారు.
జనాన్ని తరలించడం, విరాళాలు సేకరించడం, రద్దీని నియంత్రించడం.. భక్తుల కోసం వాహనాల పార్కింగ్, వేదిక వద్ద విద్యుత్, జనరేటర్లు, పరిశుభ్రత బాధ్యతలు సత్సంగ్ కమిటీ చూస్తుందని మాథుర్ అన్నారు.
'బాబా' పాద ధూళిని తీసుకొనే సమయంలో జనాలను అదుపుచేయకుండా వలంటీర్లు అలా వదిలేశారని.. దీంతో మహిళలు, పిల్లలు ఒకరిపై ఒకరు పడిపోయారని, ఆ తర్వాత వలంటీర్లు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.
పోలీసులదీ బాధ్యతే: మాజీ డీజీపీ
హాథ్‌రస్ ఘటనకు మూలం బాబా అని యూపీ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ బీబీసీ ప్రతినిధి అభినవ్ గోయల్‌తో అన్నారు.
"ఎఫ్‌ఐఆర్ అనేది సంఘటనకు సంబంధించిన సమాచారం తెలియజేస్తుంది, దర్యాప్తు సమయంలో అందులో ఇతర పేర్లను కూడా చేర్చొచ్చు. అయితే ఈ ఘటనకు బాబాయే కారణం, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు ప్రస్తావించి ఉండొచ్చు" అని అన్నారు.
"బాబా పేరు తరువాత ఎందుకు చేరుస్తారు? సత్సంగ్ నిర్వహించిన కమిటీ ఎవరిది? అది బాబాది. ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరు ప్రస్తావించకపోతే ఆయన పట్ల ఉదారంగా ఉన్నట్లే అనుకోవాలి. అలా జరగకూడదు" అన్నారు విక్రమ్ సింగ్.
"పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకుముందు కుంభ్, అర్ధకుంభ్, ఎన్నికలు ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తించింది. ఎక్కడా ఇలాంటివి జరగలేదే. మరి ఇదెలా జరిగింది? వారికి సమాచారం ఉన్నా, లేకపోయినా దానికి పోలీసులదే బాధ్యత" అని అన్నారు.
“పోలీసుల వద్ద నిఘా సమాచారం ఉంటుంది, వారికి పరిచయాలూ ఉంటాయి. అక్కడ ఎంతమంది ఉన్నారో పోలీసులకే తెలియాలి. బారికేడింగ్, ట్రాఫిక్, వాచ్ టవర్‌ల మధ్య పోలీసులకు నియంత్రణ ఉండాలి కానీ, ఏమీ లేవు. ప్రమాదానికి నిర్వాహకులు, వలంటీర్లను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదు, ఇందులో పోలీసుల పాత్ర కూడా పెద్దది’’ అన్నారు విక్రమ్ సింగ్.
రాజకీయ ఒత్తిళ్లు?
ఉత్తరప్రదేశ్‌లో 'భోలే బాబా'కు లక్షలాది మంది భక్తులు ఉన్నారని, దళిత వర్గాల్లో ఆయన ప్రభావం ఉందని రాజకీయాలపై అవగాహన ఉన్నవారు అంటున్నారు.
స్థానిక జర్నలిస్ట్ వీఎన్ శర్మ మాట్లాడుతూ "భోలే బాబాది జాటవ్ కమ్యూనిటీ. ఆయన భక్తులలో 80 శాతం మంది ఈ కమ్యూనిటీ వారే. ఇందులో మహిళల సంఖ్య ఎక్కువ. ఇది కాకుండా ఓబీసీ వర్గం వారికి కూడా ఆయనతో అనుబంధం ఉంది" అన్నారు.
‘’ఉత్తరప్రదేశ్‌లోని 20కి పైగా జిల్లాల్లో 'భోలే బాబా' నెట్‌వర్క్ ఉందని, లక్షలాది మంది దళితులు ఆయనను అభిమానిస్తారని చెప్పారు. 'బాబా' తనను తాను విష్ణువు అవతారంగా చెప్పుకొంటారు. భోలే బాబాకి సంబంధించిన 20కి పైగా కార్యక్రమాలు చూశాను. ఒక్కో కార్యక్రమానికి లక్ష మందికిపైగా జనం వచ్చేవారు, వారిలో దళితులే ఎక్కువ’’ అని శర్మ తెలిపారు.
'భోలే బాబా' నెట్‌వర్క్ గురించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బ్రజేష్ శుక్లా మాట్లాడుతూ.. ఆయన అన్ని పార్టీలకూ ఓట్ బ్యాంక్ అని తెలిపారు.
ప్రతిపక్షాలు బాధితుల గురించే మాట్లాడుతున్నాయని.. అయితే దళితులలో 'బాబా' ప్రభావం ఎక్కువగా ఉన్నందున వారి ఓటు బ్యాంకును కోల్పోకూడదన్న వ్యూహంతో ఆయన పేరు ఎవరూ ప్రస్తావించడం లేదని బ్రజేష్ శుక్లా అభిప్రాయపడ్డారు
ఉత్తరప్రదేశ్‌లో దళితుల జనాభా ఇరవై శాతం. కానీ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీకి 'భోలే బాబా' నేరుగా మద్దతు ఇవ్వలేదని వీఎన్ శర్మ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- నుస్రత్ ఫతే అలీ ఖాన్: ఇంతవరకు ఎవరూ వినని 4 ఖవ్వాలీల రిలీజ్ ఎప్పుడంటే
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- ‘మా ముత్తాత విశాఖపట్నానికి తొలి ఎంపీ. కానీ మాకు తినడానికి తిండి లేదు. పనసపళ్లు తిని బతుకుతున్నాం’
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)