ముంబయి మెరైన్ డ్రైవ్ : కిక్కిరిసే రోడ్డు, పక్కనే సముద్రం...టీమిండియా కోసం ప్రమాదకరమైన పరేడ్ ఎలా నిర్వహించారు?

    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మెరైన్ డ్రైవ్‌లో ఇంత మందిని నేనెప్పుడూ చూడలేదు. ముంబయి మారథాన్ రోజు కూడా ఇంతమంది రాలేదు.

చర్చ్‌గేట్ స్టేషన్‌కు వెళ్లే రోడ్డులో మెరైన్ డ్రైవ్‌లోని కిలాచంద్ చౌక్ సమీపంలోని సిగ్నల్ దగ్గర సాయంత్రం 5 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.

అంతేకాదు వాంఖడే స్టేడియం రోడ్డు కూడా జనంతో నిండిపోయింది. అక్కడా అభిమానుల అరుపులు వినిపించాయి. ఈ రెండుచోట్లా జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

స్టేడియంలోని గేట్ నంబర్ 2, 3, 4 ద్వారా అభిమానులను అనుమతించాలి. సాయంత్రం 4 గంటలకు గేట్లు తెరుస్తామని, సాయంత్రం 6 గంటల వరకే లోనికి వెళ్లాలని చెప్పారు.

అయితే మధ్యాహ్నం 2-2:30 గంటల నుంచే ప్రజలు అక్కడ గుమిగూడారు. గేట్లు తెరిచిన అరగంటకే స్టేడియం నిండిపోయిందని లోపలికి చేరుకున్న వాళ్లు చెప్పారు.

అప్పటికే మేం నారిమన్ పాయింట్ చేరుకున్నాం. మెరైన్ డ్రైవ్‌కు దక్షిణం వైపున ఉన్న ఈ ప్రాంతం నుంచే పరేడ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు 2-3 గంటలకే ఇళ్లకు బయలుదేరారు. బస్టాండ్ ముందు క్యూలు కట్టారు.

‘కారు దిగి నడుచుకుంటూ వెళ్లాం’

కెమెరామెన్ శార్దూల్, నేను నారిమన్ పాయింట్ దగ్గర అభిమానులతో ప్రత్యక్షంగా మాట్లాడాం. ఆ సమయంలో పరేడ్ కోసం సన్నాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ బోర్డులు పెట్టారు, చెట్ల కొమ్మలను నరికేశారు.

సాయంత్రం 4:30కి అక్కడి నుంచి బయలుదేరి వాంఖడే వైపు వెళ్లాం. అక్కడి రద్దీ చూసి కారు దిగి, నడవడం మొదలుపెట్టాం. రోజువారీ రైలు ప్రయాణం, రద్దీలో ఎలా ప్రవర్తించాలనే విషయాలపై మాకున్న అవగాహన ఇక్కడ ఉపయోగపడింది.

కిలాచంద్ చౌక్‌కు చేరుకునే సరికి అక్కడ జనం పోటెత్తారు. ఎలాగోలా రోడ్డు దాటుకుని చర్చిగేట్ రోడ్డుకి వచ్చాం. అక్కడి నుంచి మెట్రో స్టేషన్‌కు చేరుకున్నాం. మెట్రోలో సీఎస్‌ఎంటీ నుంచి ప్రెస్‌క్లబ్‌ వెళ్లాం.

ఈ ప్రాంతం వాంఖడే నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ, స్టేడియం నుంచి నినాదాలు, అరుపులు అక్కడ కూడా వినబడ్డాయి. మేం వచ్చేసరికి వీధి అంతా అభిమానులతో కిటకిటలాడింది. మెరైన్‌డ్రైవ్‌ వద్ద రద్దీగా ఉందని, అక్కడికి వెళ్లవద్దంటూ చర్చ్‌గేట్ స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్లు రావడం మొదలయ్యాయి. చాలామంది విని వెనుదిరిగారు. మరోవైపు కార్ల నుంచి జనం వస్తూనే ఉన్నారు.

అంత జనాన్ని చూసి భయమేసింది. మెరైన్ డ్రైవ్ చాలా విశాలమే. కానీ, అంతమందిని ఆపగలదా? అడుగుల దూరంలోనే సముద్రం ఉంది. గత రాత్రి కరి ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని, ఊపిరాడక కిందపడిన 8-9 మందిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని సమాచారం.

పోలీసుల అనుభవం..

ముంబయి వాసులకు రద్దీలో ఎలా వ్యవహరించాలో తెలియడం, పోలీసు వ్యవస్థకున్న అనుభవంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ముంబయిలో ప్రజలను అదుపు చేయడంలో పోలీసులు అలవాటు పడ్డారు.

కొంతమంది వలంటీర్లు, ఇతర సెక్యూరిటీ గార్డులు కూడా మెరైన్ డ్రైవ్‌లో సాయానికి వచ్చారు. వారందరూ నిజంగా అభినందనీయులు. మరోవైపు, అంత రద్దీలో కూడా వారు అంబులెన్స్‌ను బయటకు తీసుకురావడం విశేషం.

అయితే, అక్కడికి వచ్చిన అభిమానులను చాలామంది నెటిజన్లు నిందిస్తున్నారు. కానీ అది సరికాదు. ఎందుకంటే మెరైన్‌డ్రైవ్‌కు చేరుకొనే వరకు అక్కడ రద్దీగా ఉంటుందని అభిమానులకు తెలియదు.

వాంఖడేలో ఉచిత ప్రవేశం ఉండటంతో చాలామంది అక్కడికి వచ్చారు. జట్టుతో కలిసి రోడ్డుపై సంబరాలు చేసుకోవాలనుకున్నారు.

అయితే ఇంతమంది వస్తారని బీసీసీఐ కానీ, ప్రభుత్వం కానీ ఊహించలేదని అర్ధమవుతోంది. లేకుంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండేవారు.

నాకు ఇప్పటికీ ఒక విషయం అర్ధం కాలేదు. ఒక్క రోజులో అలాంటి పరేడ్‌ను ప్రకటించడం కరెక్టేనా? అదీ సాయంత్రం నిర్వహించడం...కేవలం 2.2 కి.మీ దూరం గల రహదారిపై అలాంటి పరేడ్ ఎంతవరకు సేఫ్ ?

నాకింకా గుర్తుంది. 2007లో విమానాశ్రయం నుంచి వాంఖడే వరకు 30 కి.మీ దూరం పరేడ్ జరిపారు. 2011లో రాత్రి వాంఖడే నుంచి టీమ్ హోటల్ వరకు విజయోత్సవ యాత్ర నిర్వహించారు.

అయితే అది సోషల్ మీడియా ఇప్పుడున్నంత స్థితిలో లేదు. అప్పట్లో ప్రజలు ఆగి ఫోటోలు తీసుకునేవారు. రీల్స్ కోసం గుమికూడేవారు కాదు.

మూడోసారి ప్రపంచకప్ వేడుకను నిన్న నేను చూశాను. ఇది అసాధారణంగా, భయానకంగానూ ఉంది.

మరో హాథ్‌రస్ జరగనందుకు సంతోషం: ఎమ్మెల్సీ సత్యజిత్

ఇంతటి జనాన్ని ఒక్కచోటే చేర్చే ప్రమాదకర పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ సత్యజిత్ తాంబే నిర్వాహకులను ప్రశ్నించారు.

ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో స్పందిస్తూ “ముంబయిలో మరో ‘హాథ్‌రస్’ జరగనందుకు దేవునికి ధన్యవాదాలు. హాథ్‌రస్ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఒక రోజు తర్వాత వాంఖడే స్టేడియంలోకి 'ఫస్ట్ కమ్, ఫస్ట్ ఎంట్రీ' ప్రాతిపదికన అడ్మినిస్ట్రేషన్ ఇంత పెద్ద రిస్క్ ఎలా తీసుకుంటుంది? ఇది మన దేశం లేదా క్రికెట్‌పై ప్రేమ కాదు...పిచ్చి. గందరగోళం, రద్దీ కంటే భద్రత, వివేకానికి ప్రాధాన్యత ఇద్దాం" అని తెలిపారు.

తొక్కిసలాట జరగలేదు కానీ..

మరోవైపు మెరైన్ డ్రైవ్ వద్ద తొక్కిసలాటైతే జరగలేదుకానీ, అలాంటి పరిస్థితి ఏర్పడిందని పోలీసులు బీబీసీకి తెలిపారు.

జోన్ 1 డీసీపీ ప్రవీణ్ ముండే బీబీసీతో మాట్లాడుతూ "నారీమన్ పాయింట్ వద్ద ఎక్కడా తొక్కిసలాట జరగలేదు. కానీ అలాంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులను మోహరించారు. వాళ్లు బారికేడింగ్‌తో పాటు ఇతర ఏర్పాట్లు చేశారు." అని తెలిపారు.

అలాగే తోపులాటలో పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. నిన్నటి ఈవెంట్ వద్ద గాయపడిన 11 మంది తమ ఆసుపత్రిలో చికిత్స పొందారని జేజే హాస్పిటల్ డీన్ పల్లవి సప్లే బీబీసీతో తెలిపారు.

'ఆఫీస్ బ్యాగ్ పోయింది'

ఆ పరేడ్‌కి వెళ్లిన రవి సోలంకి అనే వ్యక్తి మాట్లాడుతూ.. "నేను ఆఫీసు నుంచి నేరుగా మెరైన్ డ్రైవ్‌కి వెళ్లాను. ఐదు గంటల నుంచి అక్కడ అభిమానులు వేచి ఉన్నారు. 5-6 గంటల మధ్య భారత జట్టు ఇక్కడికి వస్తుందని మాకు సమాచారం ఉంది. కానీ, ఆ సమయానికి టీమిండియా రాలేదు. రద్దీ పెరుగుతోంది. జనాలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళుతున్నారో తెలియడం లేదు. మేం ఎలా బయటకు వచ్చామో కూడా తెలియదు.’’ అని ఆయన అన్నారు.

జనం ఒక్కసారిగా పోటెత్తారని, తొక్కిసలాటలాంటి ఈ పరిస్థితిలో ఏం జరుగుతోందో ఎవరీ అర్ధం కాలేదని, ఈ హడావుడిలో తన బ్యాగ్ కూడా పోయిందని సోలంకి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)