రిషి సునక్: కన్జర్వేటివ్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, సునక్ హామీలు ప్రజలకు నచ్చలేదా?

బ్రిటన్‌లో రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఆ దేశంలో 650 స్థానాలకు గాను ( ఈ వార్త రాసే సమయానికి) 412 సీట్లను లేబర్ పార్టీ గెలుపొందగా, కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లకు మాత్రమే పరిమితమైంది.

1997 తరువాత లేబర్ పార్టీకి ఇది అతిపెద్ద విజయం. అప్పట్లో టోని బ్లెయిర్ సారథ్యంలో లేబర్ పార్టీ 419 స్థానాలను గెలుచుకుంది.

ఫలితాల తరువాత తన మద్దతుదారులకు క్షమాపణలు చెప్పిన రిషి సునక్, ఈ ఫలితాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.

‘‘పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతును ఇచ్చినందుకు రిచ్‌మండ్, నార్తాలర్టన్ నియోజకవర్గ ప్రజలకు ఈ క్లిష్ట సమయంలో ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా. పదేళ్ల కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు నన్ను, నా కుటుంబాన్ని ఎంతో ప్రేమించారు. మేం ఇక్కడి వాళ్లమే అనే అనుభూతిని కలగజేశారు. ఎంపీగా మీకు సేవలందించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నా ఏజెంట్‌కు, టీమ్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఉత్సాహభరితంగా, సానుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినందుకు నా ప్రత్యర్థులకు శుభాకాంక్షలు.’’ అని రిషి సునక్ చెప్పారు.

‘‘కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి, భారీ విజయంపై శుభాకాంక్షలు తెలిపా. ఇవాళ శాంతియుతంగా అధికారం చేతులు మారుతుంది. అన్ని పార్టీల మధ్య సఖ్యత ఉంది. దీనివల్లే, స్థిరత్వం, భవిష్యత్‌పై మనమందరం నమ్మకంగా ఉండగలుగుతున్నాం.’’ అని చెప్పారు.

‘‘ఈ రోజు బ్రిటిష్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అనేక విషయాలను ఈ పరాజయం ప్రతిబింబిస్తోంది. ఈ అపజయానికి పూర్తి బాధ్యత నాదే. ఎంతో శ్రమించి, అంకితభావంతో పనిచేసినా ఓడిపోయిన కన్జర్వేటివ్ అభ్యర్థులకు నా క్షమాపణలు.’’ అని రిషి చెప్పారు.

తొలి భారత సంతతి ప్రధాని

కన్జర్వేటివ్ నేత రిషి సునక్ భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని. 10 డౌనింగ్‌స్ట్రీట్‌కు చేరుకున్న అతిపిన్నవయస్కుడిగా సునక్ గుర్తింపు పొందారు.

ముగ్గురు తోబుట్టువులలో పెద్దవాడైన సునక్ సౌథాంప్టన్‌లో పెరిగారు. బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన బోర్డింగ్ స్కూల్ వించెస్టర్‌లో చదువుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదివారు. తరువాత అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు.

అక్కడే ఆయనకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయమైంది.

యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ నుంచి 2015లో ఎంపీగా గెలవడానికి ముందు అక్షతా, సునక్ వివాహాం చేసుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ సాచ్స్‌లో బిలియన్ డాలర్ల విలువైన హెడ్జ్ ఫండ్స్‌ను ఆయన నిర్వహించారు.

ఆర్థిక మంత్రిగా..

ప్రధాని బోరిస్ జాన్సన్ 2020లో రిషి సునక్‌ను ఆర్థికమంత్రిని చేశారు. కోవిడ్ -19 మహమ్మారి విజృంభణ సమయంలో ఆయన నియామకం జరిగింది.

సర్వీస్ సెక్టార్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ఆయన ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్ అనే పథకం ప్రవేశపెట్టారు.

కానీ ఆ పథకం వల్ల కోవిడ్ 19 కేసులు భారీగా పెరిగాయని సునక్‌ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

పార్టీగేట్ కుంభకోణంలో బోరిస్ జాన్సన్ పేరు వెలుగులోకి రావడం జాన్సన్ ప్రతిష్ఠను మసకబార్చింది. బోరిస్ జాన్సన్ పై పోలీసులు జరిమానా కూడా విధించారు.

లాక్‌డౌన్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రధాని బోరిస్ జాన్సన్ తన నివాసంలో ఓ పార్టీ నిర్వహించడాన్ని పార్టీగేట్ కుంభకోణంగా చెబుతారు.

పన్ను చెల్లింపు విషయంలో రిషి సునక్‌ భార్య అక్షత పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఆమె శాశ్వత నివాసం యూకే వెలుపల ఉండటం వల్ల యూకేలో ఆమె మిలియన్ డాలర్ల ఆస్తిపన్ను కట్టకుండా తప్పించుకోగలిగారని విమర్శలు వచ్చాయి.

ఈ సమాచారం బయటకు వచ్చిన తరువాత యూకే వెలుపల నుంచి వచ్చే ఆదాయంపై యూకేలో పన్నులు చెల్లిస్తానని ఆమె చెప్పారు.

2022లో కన్జర్వేటివ్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతుండగా, ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తరువాత సునక్‌ కూడా రాజీనామా చేశారు.

బోరిస్‌జాన్సన్ స్థానంలో లిజ్‌ట్రస్ ప్రధాని అయ్యారు. కానీ 45 రోజుల్లోనే ఆమె ఆ పదవి నుంచి దిగిపోయారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కన్జర్వేటివ్ పార్టీ రిషి సునక్‌ను ప్రధానిని చేసింది.

రిషి ఎన్నికల వాగ్దానాలేంటి?

కిందటేడాది రిషి సునక్‌ ఐదు వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాల ఆధారంగా తీర్పు ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.

ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, అప్పులు తగ్గించడం, నేషనల్ హెల్త్‌స్కీమ్‌ కింద వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడం, చిన్నపడవల్లో వలసవస్తున్న వారిని నిరోధించడం అనే ఐదు హామీలను రిషి ఇచ్చారు.

జులైలో ఆయన సాధారణ ఎన్నికలకు పిలుపునిచ్చే ముందు యూకేలో ద్రవ్యోల్బణం మూడేళ్ళ కనిష్ఠం 2.3 శాతానికి పడిపోయింది.

ద్రవ్యోల్బణం తగ్గడమనేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తన ప్రణాళికలు పనిచేస్తున్నాయనడానికి సంకేతమని, దేశం మాంద్యం నుంచి బయటపడుతోందని చెప్పారు.

అప్పులు పెరుగుతుంటే తరుగుతున్నాయని చెప్పడాన్ని రిషి సునక్ ప్రకటనను గణాంక సంస్థలు తప్పు పట్టాయి.

సునక్ అధికారంలోకి వచ్చిన నాటి కంటే కూడా ప్రస్తుతం జాతీయ ఆరోగ్య పథకం కింద వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెరిగింది. సునక్ ప్రచారంలో ఉండగా, డాక్టర్లు సమ్మెకు దిగారు.

చిన్నపాటి పడవల్లో అక్రమంగా వలస వస్తున్నవారిని రువాండకు తరలించాలనే రిషి సునక్ ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది.

ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆయన ప్రత్యర్థులు విమర్శించారు. దీంతో ఎన్నికల ముందు రువాండకు ఎవరినీ తరలించకూడదని రిషి సునక్ నిర్ణయించారు.

ఈ ఏడాది మొదటి ఐదునెలల్లోనే చిన్నపడవల్లోకి దేశంలోకి ప్రవేశించే వారి సంఖ్య రికార్డుస్థాయిలో 10వేలకు చేరిందని యూకే హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఇలా సముద్రం మార్గంలో యూకేకు చేరుకునే క్రమంలో ఈ ఏడాది ఓ ఏడేళ్ళ బాలిక సహా ఐదుగురు మరణించారు.

ఇక 18 ఏళ్ళు నిండిన వారందరూ ఏడాదిపాటు నిర్బంధ జాతీయసేవ చేయాలనే పథకం గురించి కన్జర్వేటివ్ పార్టీ ప్రచారంలో ప్రస్తావించింది. అలాగే పన్ను రహిత పింఛన్‌ను ఆ పార్టీ వాగ్దానం చేసింది.

ముందే ఎన్నికలకు..

కిందటేడాది రిషి సునక్ పార్టీ బాధ్యతలు చేపట్టేనాటికి కన్జర్వేటివ్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. దీంతో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడానికి సునక్ ప్రయత్నించి కొంతవరకు విజయం సాధించారు.

ఈ క్రమంలో 70 ఏళ్ళలో ఎన్నడూలేనంతగా పన్నులు పెరిగాయని అదేపనిగా తన టీమ్‌పై విమర్శలు చేస్తున్నవారిని ఆయన శాంతపరచగలిగారు.

నవంబర్ నుంచి అన్ని సర్వేలలోనూ కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ కన్నా 20 పాయింట్లు వెనుకబడే ఉంది.

మార్చి నుంచి లేబర్, రిఫామ్ పార్టీల నాయకులు సునక్‌ను ఆయన పథకాలపై క్రమం తప్పకుండా విమర్శించడం మొదలుపెట్టారు.

మరోపక్క ఎన్నికల ముందు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అనేకమంది తమ పదవులకు రాజీనామా చేశారు.

అనేకమంది పరిశోధకులు, టోరీ పార్టీ (కన్జర్వేటివ్ పార్టీ) ఎంపీలు కూడా రిషి సునక్ సెప్టెంబర్, అక్టోబర్ మధ్యన ఎన్నికలకు వెళతారని భావించారు. కానీ ఆయన జులై 4న ఎన్నికలు జరగాలని పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)