టీమిండియా విక్టరీ పరేడ్: యావత్ భారతం ఒక్కచోట చేరిందా అన్నట్లుగా మెరైన్‌ డ్రైవ్‌‌కు పోటెత్తిన అభిమానులు

ముంబయిలో క్రికెట్ అభిమానుల నినాదాల జడివానలో టీమిండియా తడిసి ముద్దయింది.

టీ20 ప్రపంచ కప్‌ గెలుచుకొని సొంతగడ్డకు తిరిగొచ్చిన రోహిత్ సేనకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.

17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా గురువారం ముంబయిలో విజయ యాత్రలో పాల్గొంది.

ఇసుకేస్తే రాలనంత జనంతో మెరైన్ డ్రైవ్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి.

అభిమానులు రోహిత్, కోహ్లీ అంటూ నినాదాలు, అరుపులు, కేరింతలతో హోరెత్తించారు.

మరోవైపు ఏకబిగిన 14 వేల కిలోమీటర్లు, 16 గంటల పాటు ప్రయాణం చేసి వచ్చిన క్రికెటర్లు, విజయోత్సవ ర్యాలీలో ఎలాంటి అలసట లేకుండా చాలా ఉత్సాహంగా సంతోషంగా కనిపించారు. మైదానంలోనూ డ్యాన్సులతో అలరించారు.

టీ20 ప్రపంచ టైటిల్‌తో టీమిండియా గురువారం భారత్‌కు చేరుకుంది.

దిల్లీలో ఉదయం మొదలైన అభిమానుల కోలాహం, సాయంత్రం అయ్యేసరికి ముంబయిలో ఆకాశాన్నంటింది. ముంబయి వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.

సాయంత్రం జరిగిన విజయయాత్రలో ప్రపంచ చాంపియన్లకు స్వాగతం పలికేందుకు అభిమానులంతా పోటీపడ్డారు.

మెరైన్ డ్రైవ్‌లో ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు అభిమానుల సముద్రం కనిపించింది.

దారి పొడవునా అభిమానులు నీరాజనాలు అందించారు.

టీమిండియాకు స్వాగతం పలికేందుకు వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

మ్యాచ్ లేకున్నా మైదానం ఫుల్

విజయయాత్ర జరిగిన నారీమన్ పాయింట్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.

మ్యాచ్ లేకపోయినప్పటికీ వాంఖెడే స్టేడియం కూడా అభిమానులతో నిండిపోయింది.

బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని చూసేందుకు అభిమానులంతా స్టేడియానికి తరలి వచ్చారు.

వర్షం పడినా లెక్కచేయకుండా మైదానానికి వచ్చారు.

2007లో ధోని సారథ్యంలో తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ముంబయిలోనే విక్టరీ పరేడ్ జరిగింది.

2011లో భారత్ వన్డే వరల్డ్ కప్‌ను వాంఖెడేలోనే గెలిచింది.

అవమానపడ్డ చోటే హార్దిక్‌కు అందిన గౌరవం

ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

కెప్టెన్సీ మార్పును తేలికగా తీసుకోలేకపోయిన ముంబయి అభిమానులు రోహిత్ శర్మ స్వయంగా కెప్టెన్సీని వదులుకోలేదని, ఆయనను బలవంతంగా తప్పించారని నమ్ముతూ హార్దిక్‌ను గేలి, హేళన చేశారు.

వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ముంబయి మ్యాచ్ సందర్భంగా హార్దిక్ విషయంలో అభిమానులు శ్రుతి మించడంతో, కాస్త మర్యాదగా ప్రవర్తించాలంటూ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించే స్థాయికి పరిస్థితి దిగజారింది.

అయితే, సరిగ్గా 2 నెలలు తిరిగేసరికి ఈ పరిస్థితి మారిపోయింది.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గురువారం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించడంతో స్టేడియంలోని అభిమానులంతా హార్దిక్, హార్దిక్ అంటూ హోరెత్తించారు.

ఈ చర్యతో హార్దిక్ కూడా కుర్చీలో నుంచి పైకి లేచి, చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశాడు.

‘‘వరల్డ్ కప్ మళ్లీ చేజారుతోంది అనిపించింది’’: కోహ్లీ

ఫైనల్ జరుగుతున్నప్పుడు స్టేడియంలోని అభిమానులకు అనిపించినట్లే ఒకదశలో తనకు కూడా వరల్డ్ కప్ మళ్లీ చేజారిపోతుందనే భావన కలిగినట్లు వాంఖెడే మైదానంలో బీసీసీఐ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ చెప్పాడు.

‘‘ఆఖరి 5 ఓవర్లలో నిజంగా అద్భుతం జరిగింది. జస్‌ప్రీత్ బుమ్రా చేజారిన మ్యాచ్‌ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు. దయచేసి మీరంతా బుమ్రాను చప్పట్లతో అభినందించండి. ఇప్పుడు టీమిండియాకు దక్కిన స్వాగతాన్ని జీవితంలో మరిచిపోలేను. ఇక్కడికి వచ్చిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు.

బ్రిడ్జ్‌టౌన్‌లో గెలిచాక మైదానంలో రోహిత్ శర్మ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. 15 ఏళ్లు మేం కలిసి ఆడాం. కానీ, నేను మైదానంలో రోహిత్‌ను ఎప్పుడూ అలా చూడలేదు. నేను కన్నీళ్లతో మెట్లు ఎక్కుతున్నా. ఎదురుగా రోహిత్ కూడా ఏడుస్తూ వస్తున్నాడు. అలాగే హత్తుకున్నాం. నా వరకైతే ఇది ఎప్పటికీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోతుంది’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

వరల్డ్ కప్‌లో టీమ్ సాధించిన విజయానికి గానూ బీబీసీఐ రూ. 125 కోట్ల నజరానాను టీమిండియాకు అందజేసింది.

ఆటగాళ్లను ఘనంగా సన్మానించింది.

కార్యక్రమ ముగింపు సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఆటగాళ్లంతా మైదానంలో కలియ తిరుగుతూ అభిమానులకు టెన్నిస్ బంతులను విసిరారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)