వరల్డ్ కప్‌తో ప్రధాని మోదీని కలిసిన టీమిండియా..

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 వరల్డ్ కప్‌తో భారత్‌కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది.

లోక్‌ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఆయనను భారత క్రికెటర్లు కలిశారు.

ఈ సందర్భంగా ట్రోఫీని చేతిలో పట్టుకొని జట్టుతో కలిసి ఫోటోలు దిగిన మోదీ, క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు.

అనంతరం టీమిండియా, దిల్లీ విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి ముంబయికి బయల్దేరింది

టీమిండియా క్రికెటర్లు, వరల్డ్ చాంపియన్లుగా వరల్డ్ కప్‌తో ఈ ఉదయం భారత్‌లో అడుగుపెట్టారు.

బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం బయల్దేరిన భారత జట్టు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6 గంటల సమయంలో దిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బంది, కొందరు జర్నలిస్టులు భారత్‌కు చేరుకున్నారు.

ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో దిల్లీ విమానాశ్రయంలో సందడి నెలకొంది.

టీమిండియా రాక కోసం ఉదయం 4 గంటల నుంచే అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్ద ఎదురుచూశారు.

తర్వాత టీమిండియా ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లింది.

అభిమానుల స్వాగతం

దిల్లీ విమానాశ్రయం టర్మినల్ 3 వద్ద భారత క్రికెటర్లకు అభిమానులు స్వాగతం పలికారు.

వేకువజామునే గుంపులుగా అభిమానులు అక్కడికి చేరుకోవడంతో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు.

అభిమానులంతా నినాదాలు, ప్లకార్డులతో కేరింతలు కొట్టారు. వారికి, ఆటగాళ్లు అభివాదం చేశారు.

ప్రపంచకప్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశామని, ఇప్పుడు భారత్ దగ్గర వరల్డ్ కప్ ఉండటం చాలా సంతోషంగా ఉందని ఒక అభిమాని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

ఉదయం 4 గంటల నుంచి జట్టు రాక కోసం ఎదురుచూస్తున్నామని, భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకే విమానాశ్రయానికి వచ్చినట్లు మరో అభిమాని తెలిపారు.

కప్‌తో వస్తున్న రోహిత్ సేనను ఒకసారి చూడాలనే ఆశతో వచ్చినట్లు మరో అభిమాని చెప్పారు.

వరల్డ్ కప్ భారత్‌కు వస్తున్న నేపథ్యంలో క్రికెటర్లతో ప్రత్యేకంగా రూపొందించిన ఒక వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.

ప్రత్యేక కేక్..

13 ఏళ్ల తర్వాత తొలిసారి వరల్డ్ చాంపియన్లుగా భారత్‌లో అడుగుపెట్టిన భారత క్రికెటర్లను బీసీసీఐ, ప్రధాని మోదీ సత్కరించనున్నారు.

దిల్లీ విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకున్న టీమిండియా కోసం నిర్వాహకులు ప్రత్యేక కేక్‌ను తయారు చేశారు.

భారత జట్టు జెర్సీ రంగులతో తయారు చేసిన ఈ కేక్ మీద చాక్లెట్‌తో వరల్డ్ కప్‌ టైటిల్‌ను డిజైన్ చేశారు. హోటల్ బయట కూడా అభిమానులంతా గుమిగూడారు.

విరాట్ కోహ్లీని కలిసేందుకు ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ, సోదరి భావన తన పిల్లలతో కలిసి హోటల్ ఐటీసీ మౌర్యకు వెళ్లారు.

టీమిండియా జట్టు ప్రధాని మోదీని కలిసింది. క్రికెటర్ల కోసం మోదీ, ప్రత్యేక బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేశారు.

అనంతరం టీమిండియా జట్టు దిల్లీ నుంచి ముంబయికి బయల్దేరింది. సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు రోడ్‌షో మొదలవుతుంది.

రెండు గంటల పాటు ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో రోహిత్ బృందం ఈ ఊరేగింపులో పాల్గొంటుంది.

ప్రపంచకప్ గెలుపును అభిమానులతో కలిసి ఆస్వాదించాలని అనుకుంటున్నట్లుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

సాయంత్రం జరిగే పరేడ్‌లో కలుసుకుందామని ట్వీట్‌లో రోహిత్ పేర్కొన్నాడు.

2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా ధోని నేతృత్వంలోని టీమిండియా ఇక్కడే విక్టరీ పరేడ్‌ నిర్వహించింది.

పరేడ్ అనంతరం వాంఖెడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మానం జరుగుతుంది.

ఆ తర్వాత ఆటగాళ్లంతా తమ ఇళ్లకు వెళ్లనున్నారు.

విక్టరీ పరేడ్‌కు వెళ్లాలంటే ఇలా చేయండి

టీమిండియా విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలనుకునే అభిమానులకు ముంబయి పోలీస్ జోన్ 1 డీసీపీ ప్రవీణ్ ముండే కొన్ని సూచనలు జారీ చేశారు.

ముంబయిలో టీమిండియా ఊరేగింపు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు.

‘‘నారీమన్ పాయింట్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు 2 గంటల పాటు టీమిండియా ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపులో మీరు పాల్గొనాలనుకుంటే సాయంత్రం 4:30 గంటల్లోపు ఈ ప్రాంతానికి చేరుకోవాలి. సాయంత్రం 7 గంటలకు వాంఖెడే స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలనుకుంటే, సాయంత్రం 6 గంటల్లోపే స్టేడియానికి చేరుకొని సీట్లలో కూర్చోవాలి. ట్రాఫిక్ జామ్‌ కాకుండా ఉండేందుకు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి’’ అని ప్రవీణ్ సూచించారు.

కప్ గెలిచిన నాలుగు రోజులకు భారత్‌కు

బార్బడోస్‌లో జూన్ 29న వరల్డ్ కప్ గెలిచిన భారత్, తుపాను కారణంగా అక్కడే చిక్కుకుపోయింది.

బార్బడోస్‌లో బెరిల్ తుపాను హెచ్చరికల కారణంగా ముందస్తుగా విమానాశ్రయాలను మూసేసి, కర్ఫ్యూ విధించారు.

భారత జట్టు అక్కడి హిల్టన్ హోటల్‌లో బస చేసింది. తుపాను నేపథ్యంలో ఆటగాళ్లంతా హోటల్‌కే పరిమితమయ్యారు.

ఆటగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో కప్ గెలిచిన నాలుగు రోజుల తర్వాత వారు భారత్‌లో అడుగుపెట్టారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)