లోక్‌సభ ఎన్నికలు: తెలంగాణలో సుప్రీంకోర్టు బెంచ్‌‌పై ఇప్పుడెందుకు చర్చ మొదలైంది, కాంగ్రెస్ ఏమన్నది?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఈ హామీ ఉంది. ఇప్పుడు ఈ విషయం అటు రాజకీయ.. ఇటు న్యాయవర్గాల్లోనూ చర్చకు దారి తీసింది.

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ పెట్టాలనేది నాలుగు దశాబ్దాల డిమాండ్. లా కమిషన్లు పలు సందర్భాల్లో చెప్పినా అది ముందుకు కదల్లేదు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మరోసారి సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ అంశం తెరపైకి వచ్చింది.

ప్రత్యేక బెంచ్‌ల అవసరం ఎంత..?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, 1951 జనగణన ప్రకారం భారతదేశ జనాభా దాదాపు 36.10 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ఇప్పుడు దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని అంచనా.

రాజ్యాంగం రచించినప్పుడు దేశ జనాభా తక్కువగానే ఉన్నందున దానికి తగ్గట్టుగా దిల్లీలో సుప్రీంకోర్టు ఏర్పాటైంది.

ఇప్పుడు దేశ జనాభా భారీగా పెరిగిపోయింది. దక్షిణాదికి దిల్లీ దూరం కూడా. దీనికి తగ్గట్టుగా దిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 79,759 కేసులు పెండింగులో ఉన్నాయి. ఇందులో సివిల్ కేసులు 62,880 కాగా, 16,879 క్రిమినల్ కేసులు.

కేసులు పెండింగులో ఉన్నవి డిస్పోజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగానే.. అంతకుమించి నెలనెలా కొత్త కేసులు సుప్రీంకోర్టులో నమోదవుతూనే ఉన్నాయి.

గత నెల.. అంటే మార్చి నెలలో 3,902 కేసులను సుప్రీంకోర్టు పరిష్కరించింది. అదే సమయంలో, అదే నెలలో 4,659 కేసులు సుప్రీంకోర్టులో రికార్డయ్యాయి.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలుపుకొని 34 మంది జడ్జిలు ఉన్నారు. అంటే, సగటున చూసుకుంటే ఒక్కో జడ్జి 2,346 కేసులు పరిష్కరించాల్సి ఉంటుంది. ఇవి ఇప్పుడున్న కేసుల ప్రకారమే. అదే కేసుల సంఖ్య పెరిగితే ఒక్కొక్కరిపై భారం మరింత పెరుగుతుంది.

ఈ విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘దేశంలో ప్రజల ఇంటి వద్దకే న్యాయం అనే నినాదం కొన్నేళ్లుగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల హైకోర్టు బెంచ్‌‌లు ఉన్నాయి. మహారాష్ట్రలో హైకోర్టు ఆఫ్ బాంబే‌కు ఔరంగాబాద్, నాగ్‌పూర్ బెంచ్‌లు ఉన్నాయి. తమిళనాడులో మద్రాస్ హైకోర్టుకు మదురై బెంచ్ ఉంది. ఇదే తరహాలో సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉంటే కేసుల పరిష్కారంతోపాటు కక్షిదారులకు ప్రయోజనం ఉంటుంది’’ అన్నారు.

దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు చెప్పిందేమిటి..?

సుప్రీంకోర్టు దక్షిణాది బెంచ్ ఏర్పాటు విషయంలో 2021 జూలైలో కీలక పరిణామం జరిగింది.అప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉప రాష్ట్రపతికి లేఖలు రాశారు.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సుప్రీంకోర్టు బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు లేఖలో విజ్జప్తి చేశాయి.

ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిల్ అధ్యక్షులు, కొంతమంది సీనియర్ అడ్వకేట్లు కలిసి.. అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు.

‘‘దక్షిణాది రాష్ట్రాలకు దిల్లీ చాలా దూరంలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 1500కుపైగా కిలోమీటర్లు, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు 2000-2500 కిలోమీటర్ల దూరంలో దిల్లీ ఉంది. కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో అప్పీళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు. మొత్తం అప్పీళ్లలో కేవలం ఒక్కశాతం అప్పీళ్లు మాత్రమే దక్షిణాది నుంచి ఫైల్ అవుతున్నాయి. అదే దిల్లీ నుంచి 9.3 శాతం, ఉత్తరాంచల్, పంజాబ్ నుంచి 5 శాతం, చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి 3 శాతం అప్పీళ్లు సుప్రీంకోర్టుకు వెళుతున్నాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన సందర్భంలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ రామారావు.

లా కమిషన్లు ఏం చెప్పాయి..

గతంలో వివిధ లా కమిషన్లు కూడా సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌లు దేశంలో వేర్వేరు చోట్ల ఉండాలని చెప్పాయని రామారావు అన్నారు.

అయితే, సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటు అంశం దాదాపు నలభై ఏళ్ల నుంచి పెండింగులో ఉంది. 1984లో 10వ లా కమిషన్ 95వ నివేదికలో సుప్రీంకోర్టును రెండుగా వి‌‍భజించాలని ప్రతిపాదించింది.

‘కాన్‌స్టిట్యూషనల్ కోర్టు దిల్లీలో ఉండాలి.. కోర్టు ఆఫ్ అప్పీల్ దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమాన ఉండాలి’ అని నివేదికలో పేర్కొంది.

1988లో 11వ లా కమిషన్ ‘‘ఎ సుప్రీంకోర్ట్-ఎ ఫ్రెష్ లుక్’’ పేరిట 125వ నివేదిక ఇచ్చింది.

ఇందులో సుప్రీంకోర్టు బెంచ్‌ల ఏర్పాటు విషయంలో పదో లా కమిషన్ చేసిన సిఫార్సులనే మరోసారి ప్రతిపాదించింది. బెంచ్‌ల ఏర్పాటుతో కక్షిదారుల ప్రయాణ భారం, ఖర్చులు తగ్గుతాయని అభిప్రాయపడింది.

2009లో 18వ లా కమిషన్ ఇచ్చిన 229వ నివేదికలో దిల్లీలో సుప్రీంకోర్టు కాన్‌స్టిట్యూషనల్ బెంచ్ ప్రత్యేకంగా ఉండాలని పేర్కొంది. దీనికితోడు మరో నాలుగు క్యాసేషన్ బెంచ్‌లు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ వ్యవహరించారు.

‘‘లా కమిషన్లతోపాటు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన వేసిన పార్లమెంటరీ కమిటీ కూడా సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉండాలనే చెప్పాయి. సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావడం లేదని కేంద్రం అప్పట్లో సమాధానం ఇచ్చింది. రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో ప్రత్యేక బిల్లు ద్వారా బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చని ప్రణబ్ ముఖర్జీ కమిటీ సూచించింది. సుప్రీంకోర్టు నుంచి అంగీకారం లేకుండా కేంద్రం ముందుకు వె‌‍ళ్లడం లేదు. సుప్రీంకోర్టు అంగీకారంతోనే బెంచ్‌ల ఏర్పాటు త్వరగా జరుగుతుంది’’ అని తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి బీబీసీకి చెప్పారు.

దక్షిణ భారతంలో ఎక్కడ?

దక్షిణ ‌భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఎక్కడ ఉండాలనే విషయంలో ఎప్పుడూ మూడు నగరాల పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఈ చర్చ వచ్చినప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

18వ లా కమిషన్ తన నివేదికలో రెండు పేర్లను సూచించింది. నాలుగు కాసేషన్ బెంచ్‌లలో ఉత్తరానికి సంబంధించి దిల్లీలో ఉండాలని చెప్పింది. తూర్పున కోల్‌కతా, పశ్చిమాన ముంబయిలో ఉండాలని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంలో పెట్టే బెంచ్ హైదరాబాద్ లేదా చెన్నైలో ఉండాలని సూచన చేసింది.

‘‘లా కమిషన్ హైదరాబాద్ లేదా చెన్నైలో అని చెప్పినా.. దానిపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చెన్నైలో వాతావరణ ప్రతికూలతలు ఉంటాయని ‌ భావిస్తే హైదరాబాద్‌తోపాటు బెంగళూరును లెక్కలోకి తీసుకోవచ్చు’’ అని తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి బీబీసీతో చెప్పారు.

గత ఏడాది లోక్‌సభ ముందుకు ప్రైవేటు బిల్లు

తెలంగాణలోని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి 2023 ఆగస్టు 5న లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా(ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఎ పర్మినెంట్ బెంచ్ ఎట్ హైదరాబాద్) బిల్, 2023గా దీన్ని తీసుకొచ్చారు. దీనిపై లోక్‌సభలో స్వల్ప చర్చ జరిగింది.

‘‘దేశంలో దూర ప్రాంతాల నుంచి దిల్లీకి కక్షిదారులు రాలేకపోతున్నారు. సుప్రీంకోర్టులో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా దిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాతోపాటు పుదుచ్చేరి, దాద్రానగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాలను కలుపుకొని సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి’’ అని లోక్‌సభలో కోరారు రంజిత్ రెడ్డి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఐదుగురు జడ్జిలతో పర్మినెంట్ బెంచ్ ఉండాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు. ఆర్టికల్ 130 బెంచ్ ఏర్పాటుకు వెసులుబాటు కల్పిస్తోందన్నారు.

ఆ సందర్భంలో కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు సమాధానమిస్తూ.. ‘‘సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుతో కక్షిదారులపై భారం తగ్గుతుందని లా కమిషన్ అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని గతంలోనే కేంద్రం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపింది. 2010 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు పూర్తి ధర్మాసనం సమావేశమై దిల్లీ బయట సుప్రీంకోర్టు బెంచ్‌ల ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించింది’’ అని చెప్పారు.

ఆర్టికల్ 130 ఏం చెబుతోందంటే..

రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ సుప్రీంకోర్టు స్థానం గురించి ప్రత్యేకంగా చెబుతోంది.

దీని ప్రకారం, సుప్రీంకోర్టు దిల్లీలో ఉండవచ్చు. కాలానుగుణంగా రాష్ట్రపతి ఆమోదం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయంతో ఇతర ప్రాంతాల్లోనైనా ఏర్పాటు చేయవచ్చు.

మరి, సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణాదిలో ఎందుకు పెట్టడం లేదన్న విషయంపై తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ముందు నుంచీ సుప్రీంకోర్టు దిల్లీలోనే ఉంది. దిల్లీ వదిలిరావడం చాలా మందికి అనుకూలంగా ఉండకపోవచ్చు’’ అని చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు బీబీసీతో మాట్లాడారు.

‘‘సుప్రీంకోర్టు బెంచ్ పెట్టడానికి బీజేపీ అనుకూలంగా ఉంది. అందులోనూ హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఉంటుంది. దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు వినతిపత్రం అందించాయి. ప్రస్తుతం ఆ ప్రతిపాదన సుప్రీంకోర్టు వద్ద పెండింగులో ఉంది. సుప్రీంకోర్టు నుంచి అంగీకారం వస్తే, దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది కేంద్ర ప్రభుత్వానికి ఉండదు’’ అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)