సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో ఎప్పుడు వస్తుంది... ఎక్కడెక్కడ చూడవచ్చు?

భారతదేశం గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, కెనడా, మెక్సికోలో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించింది.

ఈ సూర్యగ్రహణాన్ని చూసేందుకు కొంతమంది భారతీయులు అమెరికా, కెనడాకు వెళ్ళారు.

సూర్య,చంద్ర గ్రహణాలు ఏడాదిలో అప్పుడప్పుడు మాత్రమే సంభవిస్తాయి. భూమిలో ముప్పాతిక భాగం సముద్రాలతో నిండిపోయి ఉంటుంది. అందుకే భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడాన్ని అరుదైన విషయంగా పరిగణిస్తారు.

అనేకమందికి తమ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుంది. కానీ చాలామంది గ్రహణాలను వీక్షించేందుకు ఎంతో దూరం ప్రయాణిస్తుంటారు. ఇలాంటివారిని ‘గ్రహణ వీక్షకులు’ లేదా ‘గ్రహణ వేటగాళ్ళు’ అంటారు.

వీరిలో ఖగోళ శాస్త్రవేత్త, పంచాంగ రచయిత డీకే సోమన్ ఒకరు. ఆయన బీబీసీ కరస్పాండెంట్ జాహ్నవి మూలేతో ఇప్పటిదాకా వీక్షించిన కొన్ని సూర్యగ్రహణాల గురించి మాట్లాడారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

తొలి సంపూర్ణ సూర్యగ్రహణం

సంపూర్ణ సూర్య గ్రహణం ఓ ఖగోళ అద్భుతం. సూర్యుడు కొంతసేపు చీకటిలోకి జారుకోవడం, సూర్యగోళమంతటిని చీకటి కప్పేసినా, దాని బాహ్య వలయం నుంచి వెలుగురావడం, సూర్యగోళం మధ్యభాగమంతా నల్లగా కనిపించడం ఉద్వేగంగా ఉంటుంది.

1980 ఫిబ్రవరి 16న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం నాకింకా బాగా గుర్తుంది.

దాదాపు ఎనిమిది దశాబ్దాల తరువాత భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే భాగ్యం దక్కింది.

స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం. ఆ సమయంలో నేను అనేక ప్రాంతాలలో పర్యటించి, గ్రహణ సంబంధిత విషయాలను ప్రజలకు వివరించాను.

దక్షిణ భారతదేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది.

నేను ఆ సమయంలో మరాఠి సైన్స్ కౌన్సిల్ కోసం కార్వార్ సమీపంలోని ఆంకోలాకు వెళ్ళాను. మా తరం అప్పటిదాకా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడలేదు.

ఆ సమయంలో దీనిపై భారత్‌లో ఆసక్తితోపాటు భయం కూడా ఉండేది. అంకోలా గ్రామంలో ప్రజలందరూ తలుపులు, కిటికీలు మూసుకుని ఇంట్లోనే కూర్చున్నారు.నేను ఓ ఇంటి తలుపు తడితే, ఆ ఇంట్లోని వ్యక్తి ‘‘ సూర్యగ్రహణాన్ని చూస్తే కళ్ళు దెబ్బతింటాయని ప్రభుత్వం చెప్పింది’’ అని తెలిపారు.

సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రత్యేక కళ్ళజోడును ధరించాలి.

ఆ సమయంలో మేం మరాఠి సైన్స్ కౌన్సిల్ వారి నుంచి అలాంటి కళ్ళజోళ్ళను తీసుకువెళ్ళాం.

చంద్రుడు సూర్యుడి కాంతికి అడ్డుగా రావడం మొదలవ్వగానే నీడ కనిపిస్తుంది.

తరువాత చంద్రుడు పూర్తిగా అడ్డు వచ్చాకా ఏర్పడిన నల్లటి వలయం చుట్టూ కాంతి కనిపిస్తుంది.

మేం ఆకాశంలో డైమండ్ ఉంగరంలాంటి దానిని చూశాం. అయితే, చంద్రుడు సూర్యుడిని మొత్తంగా కప్పేశాకా ఆ ఉంగరం అదృశ్యమైంది. పూర్తిగా చీకటి పడిపోగానే మేం కళ్ళజోడులను తీసివేశాం.

ఆ సమయంలో అంతరిక్షంలోని మిగతా గ్రహాలను కూడా చూడగలిగాం. ఆ రోజు మధ్యాహ్నం బుధ,శుక్ర గ్రహాలు కూడా కనిపించాయి.

చుట్టూ కమ్ముకున్న చీకటిలో గడియారాన్ని చూడగలిగే వెలుతురు ఉందికానీ, ఆ వెలుతురు పుస్తకం చదివేందుకు సరిపోదు. ఆ సమయంలో ఉష్ణోగ్రత పది డిగ్రీలకు పడిపోయింది.

ఈ విషయాలన్నింటినీ మేం రికార్డు చేశాం. మేం కొన్ని మొక్కలను కూడా సేకరించాం. చెట్లు రాత్రిపూట ఆకులను రాల్చుతాయని మనందరికీ తెలుసు. కానీ, సూర్యగ్రహణ సమయంలో కూడా చెట్ల ఆకులు రాలుతాయి.

కొంత సేపటి తరువాత చంద్రుడు పక్కకు తొలగడంతో సూర్యకిరణాలు మళ్ళీ కనిపించాయి.

మాలోని ఓ పెద్దాయన ‘పశ్చిమాన సూర్యోదయం’ అని వ్యాఖ్యానించారు.

( ఆ సమయంలో సూర్యుడు పశ్చిమ దిక్కున ఉన్నాడు) .

ఆ సమయంలో కోడి కూడా కూసింది.

ఆ శబ్దాలను మేం టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేశాం.

భారత్‌లో మళ్ళీ ఎప్పుడు?

1980 తరువాత, 1995 అక్టోబర్ 24న మరోసారి భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.

దీనిని చూసేందుకు మేం మరాఠీ సైన్స్ కౌన్సిల్‌తో కలిసి ఫతేపుర్ సిక్రీకు వెళ్ళాం.

కానీ అప్పుడు సూర్యగ్రహణం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే కనిపిచింది.

దాదాపు 50 నుంచి 55 సెకన్ల మేర దర్శనమిచ్చినట్టు గుర్తుంది.

మరో నాలుగేళ్ళ తరువాత అంటే 11 ఆగస్టు 1999లో భారత్‌లో సూర్యగ్రహణం కనిపించింది.

ఈ గ్రహణాన్ని చూసేందుకు మేం గుజరాత్‌లోని భుజ్ ప్రాంతానికి వెళ్ళాం.

కానీ ఆగస్టులో వానల కారణంగా ఆకాశం మేఘావృతం కావడంతో సూర్యగ్రహణాన్ని సరిగా చూడలేకపోయాం.

ఓ దశాబ్దం తరువాత 2009 జులై 22న ఉత్తర భారతదేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.

దీని వీక్షణ కోసం మేం ఇండోర్ వెళ్ళాం. వర్షాకాలం కారణంగా ఇక్కడ కూడా మేం గ్రహణాన్ని చూడలేకపోయాం.

దీని తరువాత జనవరి 15, 2010న పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం దొరికింది.

దాదాపు ఎనిమిది నిమిషాలపాటు కన్యాకుమారిలో అద్భుతమైన గ్రహణాన్ని చూడగలిగాం.

పాక్షిక సూర్యగ్రహణంలో సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేయడు.

కానీ ఈ సూర్యగ్రహణాన్ని చూడటమనేది ఓ భిన్నమైన అనుభవం.

2019లో దక్షిణ భారతంలోనూ, 2020లో ఉత్తర భారతంలోనూ పాక్షిక సూర్యగ్రహణాలు సంభవించాయి.

దీంతోపాటు అమెరికాలో పాక్షిక సూర్యగ్రహణాన్ని చూశాను. ఇప్పుడు 2024లో కూడా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడటానికి అమెరికా వచ్చాను.

భారతదేశంలో తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని 2034లో కశ్మీర్‌లో చూడొచ్చు.

ప్రజలెందుకు గ్రహణాన్ని చూస్తారు?

గ్రహణాలను చూసేందుకు అనేకమంది ప్రయాణాలు చేస్తుంటారు. గ్రహణాలంటే జనానికి ఆసక్తి ఎందుకు?

ప్రత్యేక సందర్భాలలో ప్రజలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు ఎలా వెళతారో, అదేవిధంగా అంతరిక్షం, సౌర వ్యవస్థపై ఆసక్తి ఉండేవారికి గ్రహణాలు కూడా అంతే ముఖ్యమైనవి.

వారు గ్రహణాలను చూడటమే కాదు, దానికి సంబంధించిన తమ వ్యాఖ్యానాన్ని నమోదు చేస్తారు. ఒకసారి అమెరికాలో జల్లెడ ద్వారా గ్రహణం ప్రతిబింబం చూసే ప్రయత్నం జరిగింది.

అలాంటి అనేక ప్రయోగాలు చేయవచ్చు. గ్రహణాల్లాంటి సంఘటనలు సాధారణ ప్రజలు, ప్రత్యేకించి చిన్నపిల్లల్లో ఆసక్తి పెంచుతాయి.

పిల్లలకు తోకచుక్కలు, చుక్కలను కూడా చూపించాలి. విజయదుర్గ కోట వద్ద తీసిన గ్రహణం ఫోటోలు హీలియం కనుక్కోవడానికి సాయపడిందని చెబుతారు.

గ్రహణ సమయంలో సూర్యుడి కరోనా, సూర్యుడిపై ఏర్పడే నల్లని ప్రాంతాల మధ్య సంబధాలను కూడా అధ్యయనం చేశారు.

ఇలాంటివే అంతరిక్షం గురించి తెలుసుకోమనే ఆసక్తిని పెంచి, గ్రహణాలు చూడటానికి ఎంత దూరమైనా ప్రయాణించేలా పురిగొల్పుతుంటాయి.

పాక్షిక సూర్యగ్రహణ సమయాలలో పూర్తిగా చీకటిపడదు. కానీ సంపూర్ణ సూర్యగ్రహణ వేళ చీకటిపడుతుంది. ఇది ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంటుంది.

భయపడాల్సిన పని లేదు

ప్రాచీన కాలం నుంచి కూడా గ్రహణాలను ప్రజలు అరిష్టంగా భావించేవారు.

గ్రహణం రోజు ఏర్పడే చీకటి గురించి అనేక భ్రమలు వ్యాప్తిలో ఉన్నాయి.

మతపరమైన కారణాల వల్ల కూడా ప్రజలు గ్రహణాలకు భయపడుతుంటారు.

కానీ ఈ భయాల వెనుక ఎటువంటి నిజాలు లేవు.

గ్రహణం విడిచిన తరువాత ప్రజలు స్నానాలు చేస్తుంటారు.

చెరువులు, కాలువలు, సరస్సుల్లోనీ నీరు అలాగే ఉన్నప్పుడు మనిషి అపవిత్రం ఎలా అవుతాడు?

గ్రహణం కారణంగా ఏదీ అపవిత్రమైపోదు. శాస్త్రీయ దృక్పథం పెరగడం, విద్యావ్యాప్తి కారణంగా ప్రజలలో గ్రహణమంటే భయాలు తగ్గాయి.

కానీ గ్రహణ వీక్షణ సమయంలో ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

కళ్ళద్దాలు లేకుండా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూదు. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన సందర్భం మాత్రం ఇందుకు మినహాయింపు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)