You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ జిల్లాల స్వరూపాన్ని రేవంత్ రెడ్డి మార్చేస్తారా... మార్చితే ఏమవుతుంది?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో జిల్లాల స్వరూపం, సంఖ్య మళ్లీ మారనుందా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు ఊతమిస్తున్నాయి.
తెలంగాణలో జిల్లాలకు సంబంధించి మార్పులుచేర్పులు ఉండొచ్చని స్పష్టంగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు కాకపోయినా, వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకీ తెలంగాణలో ఉన్న జిల్లాల సంఖ్యపై రేవంత్ రెడ్డి ఏమన్నారు?
‘’33 జిల్లాలు ఉండాలా లేదా అనే చర్చ కంటే, ఒక జిల్లాలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంటే మరో జిల్లాలో కోటిపైన ఉంది.
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కోటి పైచిలుకు జనాభా ఇక్కడ ఉంది.
ఇంత ఇర్రేషనల్‌గా.. నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా ఉంది..
బడ్జెట్ సెషన్‌లో అసెంబ్లీలో చర్చించి డీలిమిటేషన్ కోసం ఒక రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టి మండలాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్లు, జిల్లా విభజనపై కమిషన్ వేస్తాం.
119 నియోజకవర్గాలు తిరిగి అక్కడ ఏమేం కావాలో కమిషన్ అధ్యయనం చేస్తుంది’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.
జిల్లాలే కాకుండా మండలాలు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
10 నుంచి 33 జిల్లాలు..
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి.
2014లో పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు.
ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పాలనకు ఇబ్బందులు ఎదురయ్యేవి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాల విభజన చేపట్టాలనే డిమాండ్ వినిపించింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన కమిటీ వేసి జిల్లాల పునర్విభజన చేపట్టింది.
తెలంగాణ ఏర్పడే నాటికి సగటున 35 లక్షలకుపైగా జనాభా జిల్లాల్లో ఉండేది. కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలు లేదా ముఖ్య పట్టణాలకు చేరుకోవాలంటే దాదాపు 200 నుంచి 250 కిలోమీటర్ల వరకూ ప్రయాణించాల్సిన పరిస్థితి.
ఈ ఇబ్బందులు అధిగమించేందుకు జిల్లాల విభజన చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు 2016 డిసెంబరులో అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. అప్పటి వరకు ఉన్న జిల్లాల పునర్విభజన చట్టం, 1974కి మార్పులు చేస్తూ బిల్లు నం.14ను తీసుకొచ్చింది.
2016 అక్టోబరులో 3౦ జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వనపర్తి, ములుగు, జోగులాంబ గద్వాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది.
అలాగే, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరడంతోపాటు రెవెన్యూ మండలాలు 612కు చేరాయి.
పాలనను ప్రజలకు చేరువచేసే ఉద్దేశంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
జిల్లాల పునర్విభజనపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ, ''ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యవస్థ బాగా పెరిగింది. సామాన్యులకు జిల్లా అధికారిని కలిసే పరిస్థితి తక్కువ'' అన్నారు.
‘‘అప్పట్లో శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగలేదు. అవసరానికి తగ్గట్టుగా జరగలేదు. దీనివల్ల ఐఏఎస్, ఐపీఎస్‌ల సంఖ్య విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్నికల ముందు వరకు మండలాల విభజన చేసుకుంటూ వెళ్లారు. మండలం చేస్తున్నాం.. ఓట్లు వేయండి అన్నట్లుగా చేసుకుంటూ పోయారు. కానీ, ఇప్పటికే భవనాల నిర్మాణం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది చూడాలి’’ అని పద్మనాభ రెడ్డి చెప్పారు.
జిల్లాల విభజనతో కొత్త సమస్యలా?
జిల్లాల విభజన జరగక మునుపు దూరం, పరిధి వంటి సమస్యలు ఉండేవి. ప్రజలెవరైనా జిల్లా అధికారులను కలిసేందుకు రావాలంటే సుదూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది.
ఉదాహరణకు, రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే కలెక్టరేట్‌లో అర్జీ పెట్టుకోవాలంటే, బషీరాబాద్, తాండూరు వంటి ప్రాంతాల నుంచి మూడు నుంచి నాలుగు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి.
జిల్లాల విభజన తర్వాత దూరం వంటి సమస్యలు తగ్గాయి. కానీ, అదే సమయంలో పరిధుల పరంగా సమస్యలు మొదలయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, నారాయణ పేట, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని మండలాలను తీసుకొచ్చి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపారు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఏడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది.
ఎంపీ ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే ఐదు జిల్లాల అధికారులతో మాట్లాడాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటర్వ్యూలో చెప్పారు.
మరోవైపు, హైదరాబాద్ నగరాన్ని ఆనుకునే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉంది. ఈ జిల్లా పరిషత్‌లో సభ్యుల సంఖ్య కేవలం ఐదు. వారిలో ఒకరు చైర్మన్ కాగా, మరొకరు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ ఐదుగురితోనే జిల్లా పరిషత్ నడుస్తోంది.
జిల్లాల్లో జనాభా, అధికారుల పరిధి విషయంలో హెచ్చుతగ్గులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది.
దీనికితోడు నియోజకవర్గాలు చాలా వరకు వేర్వేరు జిల్లాల పరిధిలో ఉన్నాయి. మక్తల్, కొడంగల్, దేవరకద్ర, కల్వకుర్తి వంటి నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయి.
హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి.
జిల్లాల పునర్విభజన అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఎప్పుడైనా మార్చుకునేందుకు వీలుంటుందని చెప్పారు నల్సార్ యూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్ సునీల్ కుమార్.
‘‘జిల్లాల విభజన విషయంలో న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు తక్కువగానే ఉంటాయి. అశాస్త్రీయంగానో, అన్యాయం జరిగిందనో న్యాయస్థానానికి వెళ్లేందుకు వీలుంటుంది కానీ, జిల్లాల పునర్విభజన వద్దని న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం తక్కువ ఉంటుంది. జిల్లాల విభజన జరిగితే అటు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి’’ అని చెప్పారు సునీల్ కుమార్.
తెలంగాణలో జిల్లాలు ఏర్పడినప్పటికీ, ఇప్పటి వరకు నవోదయ స్కూళ్లు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి ప్రతి జిల్లాకు నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ, వాటిని మంజూరు చేయలేదు.
మండలాలపై ప్రభావం
జిల్లాల విభజన తర్వాత మండలాలు పెద్దసంఖ్యలో పెరిగాయి.
గతంలో ఉన్న 459 నుంచి 612కు పెరిగాయి. మండలాల్లో గ్రామాల సంఖ్యలో మార్పులు జరిగాయి. రెవెన్యూ డివిజన్లు 43 నుంచి 74కు పెరిగాయి.
రేవంత్ రెడ్డి మండలాల విషయంలోనూ కమిషన్ అధ్యయనం చేస్తుందని చెప్పడంతో మండలాల్లో కూడా పునర్విభజన జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ విషయంపై తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.
‘‘జిల్లాలు, మండలాలను శాస్త్రీయంగా విభజిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన మండలాల్లో కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీనివల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల భవనాలు మంజూరైనప్పటికీ, నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో స్థానికంగా ఉన్న భవనాలను అద్దెకు తీసుకుని ఉంటున్నారు’’ అని ఆయన చెప్పారు.
రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు గౌతమ్ కుమార్. ‘‘రెవెన్యూలో దాదాపు 30 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కొత్త జిల్లాలకు తగ్గట్టుగా పోస్టులు కేటాయించాల్సి ఉంది’’ అని చెప్పారు.
జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
జోన్ల వారీగా మార్పులు అవసరం
కొత్త జిల్లాలకు తగ్గట్టుగా ఏడు జోన్లను ప్రభుత్వం విభజించింది. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దీనికి కేంద్ర ప్రభుత్వం సైతం 2021లో ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న రెండు జోన్లు ఏడుకు చేరుకున్నాయి.
పునర్వ్యవస్థీకరణ చేస్తే కథ మళ్లీ మొదటికొస్తుందని, ఉద్యోగాల భర్తీపై ప్రభావం పడుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
భవనాలు ఏం చేస్తారు..?
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రతి జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణానికి 2017 అక్టోబరులో శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు. అందులో భాగంగా 26 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు నిర్మితమయ్యాయి.
ఒక్కొక్క జిల్లాలో సగటున రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు భవనాల నిర్మాణానికి కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటికే చాలా వరకు భవనాలు పూర్తి కావడంతో కలెక్టరేట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తే, ఈ భవనాలు ఏం చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోనుంది.
భారీ ఎత్తున ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనాలను ఏం చేస్తారనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
‘‘జిల్లాల ఏర్పాటు తర్వాత భవనాల నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారు. ఏదైనా జిల్లా విభజించినప్పుడు అక్కడి ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. సూర్యాపేట జిల్లాలో చూస్తే, భూముల ధరలు పెరగాలని అక్కడి ఓ ప్రజాప్రతినిధి కలెక్టరేట్ కట్టారనే విమర్శలున్నాయి’’ అని చెప్పారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
జిల్లాల విభజన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగింది.
మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా దూర ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణం జరిగే ప్రదేశాన్ని చూపించి చుట్టుపక్కల భూముల రేట్లు భారీగా పెంచారు.
‘‘కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భూముల రేట్లలో భారీగా మార్పులు వచ్చాయి. 2017 నుంచి భూముల రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఈ ప్రభావం జిల్లా కేంద్రంలోనే కాకుండా పక్కనున్న మండలాలపైనా పడింది ’’ అని సూర్యాపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు బీబీసీతో చెప్పారు.
మరోవైపు, దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా, మరో రెండేళ్లలో మొదలయ్యే అవకాశం ఉందని ఎంపీలు చెబుతున్నారు.
ఇదే జరిగితే పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులు మరోసారి మారతాయి. దీనివల్ల తెలంగాణలో జిల్లాల పునర్వవస్థీకరణ చేసినా, సరిహద్దుల్లో వ్యత్యాసం వస్తుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?
- సీఎం రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఇవే.. ఎడిటర్స్ కామెంట్
- విశాఖపట్నం: ప్రియుడే తన ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడని బీచ్‌లో కూర్చుని ఏడుస్తున్న మైనర్ బాలికపై మరో ఎనిమిది మంది అత్యాచారం
- ఎంఫిల్ కోర్సు రద్దు: యూజీసీ ఆదేశంతో విద్యార్థులకు లాభమా, నష్టమా?
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)