డ్రైవర్ హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ అనంతబాబు సీఎం సభల్లో ఎందుకు కనిపిస్తున్నారు... ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేశారా?

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు అనంత ఉదయ భాస్కర్(అనంతబాబు) వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది.

తన దగ్గర పనిచేసిన డ్రైవర్‌ను హత్య చేసి, ఆ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మృతుడి కుటుంబానికి అప్పగించారనే అభియోగాలపై అరెస్టయ్యారు అనంతబాబు. ఆ సమయంలో అధికార వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అనంతబాబు బెయిల్‌పై విడుదలయ్యాక, ఆ సస్పెన్షన్‌‌ను ఎత్తివేస్తూ వైఎస్సార్సీపీ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరువుతున్న అన్ని చోట్లా ముందువరుసలో ఉంటూ, సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇటీవల సీఎం నివాసంలో జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశాలకు కూడా హాజరయ్యారు.

దాంతో అనంతబాబు వ్యవహారంలో వైఎస్సార్సీపీ వైఖరి మీద విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ యువకుడిని హత్య చేసి జైలుకెళ్లిన నాయకుడికి పోలీసులు సహా అధికారులంతా ప్రాధాన్యతనిస్తుండటం అందుకు కారణమవుతోంది.

ఇంతకీ అనంతబాబు విషయంలో వైఎస్సార్సీపీ వైఖరేంటి?

ఎమ్మెల్సీగా తొలగించాలని డిమాండ్

2022 మే నెల 19వ తేదీ రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం (24) హత్య జరిగింది. ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. హత్య చేసిన తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నం చేశారన్నది పోలీసుల అభియోగం.

సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్టు అనంతబాబు అంగీకరించారని అప్పటి కాకినాడ జిల్లా ఎస్పీ బహిరంగంగానే ప్రకటించారు. అనంతబాబు రిమాండ్ రిపోర్టులో కూడా పోలీసులు అదే విషయాన్ని నమోదు చేశారు.

అనంతబాబు అరెస్ట్ తర్వాత ఆరు నెలల పాటు ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.

ఆయన అరెస్ట్ అయినప్పటికీ ఈ కేసు దర్యాప్తు తీరు మీద కొన్ని సంఘాలు సందేహాలు వ్యక్తం చేశాయి. సమగ్ర దర్యాప్తు కోసం జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని కోరాయి. తొలుత నిందితుడిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించి, కేసు దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేశాయి.

చట్టం ప్రకారం హత్య కేసులో నేరం అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్న తరుణంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే అవకాశం లేదని ఆయా సంఘాలు వాదించాయి. ఆయన్ని మండలి సభ్యత్వం నుంచి తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. అయినా అనంతబాబును తొలగించలేదు. అనంతబాబు అరెస్టు తరువాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు 24 మే 2022న వైఎస్‌ఆర్‌పీ ప్రకటించింది.

బెయిల్‌పై విడుదలైన నాటి నుంచే..

అనంతబాబు అరెస్ట్ అయి 6 నెలలు గడిచాక, 2022 డిసెంబర్ 12న ఆయనకు బెయిల్ వచ్చింది. అది కూడా కింద కోర్టుల్లో పలుమార్లు బెయిల్ పిటీషన్లు తోసిపుచ్చగా చివరకు సుప్రీంకోర్టులో తాత్కాలిక బెయిల్ మంజూరైంది.

బెయిల్‌పై వచ్చిన అనంతబాబుకి అధికార వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో స్వాగతం పలికి, సత్కారాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.

'హత్య కేసులో అరెస్టయిన నిందితుడికి బెయిల్ వస్తే ఊరేగింపులా?' అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.

బెయిల్ రాకముందు కూడా జైలులో ఉండగానే వైఎస్సార్సీపీ నేతలు ఆయనతో పలుమార్లు ములాఖత్ అయ్యారు. వారిలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబీకులు కూడా ఉన్నారు. దాంతో నిందితుడికి అధికార పార్టీ అన్ని రకాలుగా అండదండలు ఇస్తోందనే ఆరోపణలున్నాయి.

ఆ కారణాలు చూపుతూ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని మృతుడి తల్లిదండ్రులు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు పిటీషన్ విచారణలో ఉంది.

బెయిల్ మీద విడుదలయిన నాటి నుంచి అనంతబాబు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ముఖ్యంగా అల్లూరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నట్టుగా చెబుతున్నారు.

సస్పెన్షన్ ఉండగానే పార్టీ కార్యక్రమాల్లో...

రంపచోడవరంలో వైఎస్సార్సీపీ పేరుతో బహిరంగ సభ నిర్వహించి "నా మీద హత్యారోపణలు కుట్రపూరితం" అని ఆయన ప్రకటించారు. న్యాయ పోరాటం చేస్తానని కూడా చెప్పారు.

ఆ తర్వాత శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీఎల్పీ సమావేశంలో కూడా పాల్గొన్నారు.

సీఎం పర్యటనల సందర్భంగా 2023 అక్టోబర్‌లో సామర్లకోట సభలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. సీఎంతో సన్నిహితంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కూడా ఆయనతో అంతే మర్యాదపూర్వకంగా వ్యవహరించడం విశేషం.

తాజాగా 2024 జనవరి 3న కాకినాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కూడా అనంతబాబు సీఎం వెంట ఉన్నారు. బహిరంగసభలో కూడా సీఎంతో పాటుగా మొదటి వరుసలో ఆయన కూర్చున్నారు.

ఆయన వైఎస్సార్సీపీ వేదికలు, ముఖ్యమంత్రి సభల్లో ప్రత్యక్షమైన ప్రతీసారి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అధికార పక్షం వాటిని ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు. హత్యకేసులో నిందితుడైన ఎమ్మెల్సీకి సీఎం దగ్గర కూడా ప్రాధాన్యత తగ్గిన సూచనలు లేవు.

పోలీసుల తీరుపై విమర్శలు

అధికారికంగానూ, అధికార పార్టీ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్సీకి గౌరవ మర్యాదలకు లోటు లేకపోవడంతో పోలీసులు కూడా అదే రీతిలో సాగిపోయారు.

2024 జనవరి1న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు పోలీసులు అధికారులు ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటికి క్యూ కట్టారు. దాదాపు అరడజను మందికి పైగా పోలీస్ అధికారులు పూల బొకేలతో ఎమ్మెల్సీని గౌరవించడానికి పోటీ పడిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడని వెల్లడించిన పోలీసులు, అదే నిందితుడి ఇంటికి శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంపై డీజీపీ స్పందించాలని కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

"ఎస్సీ యువకుడిని క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు.. మృతదేహం ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వ్యక్తికి, పోలీసులు ఈ రీతిలో మర్యాద పాటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిణామాలను పలువురు ఆక్షేపిస్తున్నారు. డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి" అంటూ మాజీ పోలీస్ అధికారి అయిన వర్ల రామయ్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

పోలీసుల తీరు సమంజసంగా లేదని ఆయన బీబీసీతో అన్నారు.

"ఇలాంటి చర్యలు ఖాకీ యూనిఫాం గౌరవాన్ని తగ్గిస్తాయని కూడా అభిప్రాయపడ్డారు. బాధితుల కుటుంబాన్ని రోడ్డు పాలుచేసిన నిందితుడి కోసం ఈ రీతిలో వ్యవహరించడం ద్వారా పోలీసులు సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్టు?" అని రామయ్య ప్రశ్నించారు.

సస్పెన్షన్ ఉందా? తొలగించారా?

అనంతబాబు మీద వైఎస్సార్సీపీ సస్పెన్షన్ విధించినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ, దానిని తొలగించినట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలన్నింటా ముందుంటున్నారు అనంతబాబు.

దీనిపై వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆపార్టీ నాయకులు స్పందించలేదు. హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ మీద సస్పెన్షన్ విధించి ఏడాదిన్నర దాటిపోయిన నేపథ్యంలో అదింకా కొనసాగిస్తున్నారా? లేక ఎత్తివేశారా? అన్నది బహిరంగంగా వెల్లడించడం అవసరమని అల్లూరి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ రావు అన్నారు.

"ఎమ్మెల్సీని పార్టీ కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన జైలు నుంచి తిరిగి వచ్చి మొత్తం వ్యవహారాన్నీ అన్ని తానై నడిపిస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మాట కాదనలేని పరిస్థితి ఉంది. ఆయన లేకుండా ఏ కార్యక్రమం జరగడం లేదు. అలాంటప్పుడు పార్టీ సస్పెన్షన్ ఉంచారా ? లేక తొలగించారా? అన్నది స్పష్టం చేయాలి. ఎమ్మెల్సీ నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీ నేతలు, మంత్రులు కూడా పాల్గొంటున్నారు. దాంతో సస్ఫెన్షన్ లేనట్టుగానే అంతా భావిస్తున్నారు. అదే విషయాన్ని బహిరంగంగా చెప్పడం అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ పార్టీలు తమ నేతల మీద సస్పెన్షన్ వేయడం, తర్వాత వాటిని తొలగించడం సాధారణ విషయమే, అయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎందుకు గోప్యత పాటిస్తుందన్నది అర్థం కావడం లేదంటూ ఆయన బీబీసీతో అన్నారు.

గతంలో ఏం జరిగింది..

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయా పార్టీలకు చెందిన నాయకులు వివిధ కేసుల్లో అరెస్టయి జైలు పాలైన చరిత్ర ఉంది.

ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారు సైతం కేసుల్లో చిక్కుకొని జైలుకెళ్ళారు. అలాంటి సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేయడం లేదా పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉండడం వంటివి జరిగేది.

వైఎస్ఆర్సీపీ మాత్రం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

"గతంలో నాయకులు కొన్ని జాగ్రత్తలు పాటించేవారు. అవినీతి ఆరోపణలు వచ్చినా, వివిధ నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనా బాధ్యతగా వ్యవహరించేవారు. వర్తమానంలో అలాంటి పరిస్థితి లేదు. అవినీతి కేసులు, హత్యా నేరాలు, అంతకుమించిన కేసులు ఉన్నప్పటికీ ఎవ్వరూ వెనుకాడడం లేదు" అన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్.

"పార్టీ నాయకత్వాలు కూడా సంశయం లేకుండా అలాంటి నాయకులకి అండగా నిలుస్తున్నాయి. అందులో భాగమే అనంతబాబు వ్యవహారం. రాజకీయంగా ఆయా నాయకులు వల్ల ఓట్లు వస్తాయా లేదా అన్నదే కొలబద్దగా చూస్తున్నారు" అని చెప్పారు.

"గతంలో నేర చరిత్ర ఉన్న వారిని మండలికి పంపించాలంటే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఎస్సీ యువకుడిని చంపిన కేసులో నిందితుడు పెద్దల సభకి ప్రాతినిధ్యం వహించడం చూస్తున్నాం" అంటూ వ్యాఖ్యానించారు.

"మారుతున్న రాజకీయాలకు ఈ పరిణామాలు అద్దం పడతాయి"అని కృష్ణకుమార్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)