You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖపై వివాదం... అందులో ఏముంది, అసలు అలా రాయవచ్చా?
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రజలకు బహిరంగ లేఖ రాయడంపై వివాదం రాజుకొంది.
లేఖలో అంశాలను పక్కన పెడితే, ఈ లేఖను విడుదల చేసిన తీరును వైసీపీ తప్పుబడుతోంది. మరోవైపు దీనితో తమకు ఎలాంటి సంబంధమూలేదని జైలు సూపరింటెండెంట్ అంటున్నారు.
అసలు ఖైదీలు ఇలా బహిరంగ లేఖలు రాయొచ్చా? ఇలాంటి లేఖలు రాసేటప్పుడు ఎలాంటి నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది?
ఇంతకీ లేఖలో ఏముంది?
ఎలాంటి అవినీతి ముద్ర పడకుండానే త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని చంద్రబాబు ఈ లేఖలో అన్నారు. వైసీపీ నియంతృత్వ ప్రభుత్వంపై పోరాటానికి తాను నేతృత్వం వహిస్తానని చెప్పారు.
‘‘కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు. కానీ, నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరు. ఈ జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయలేవు. ఈ జైలు ఊచలు ప్రజల్నించి నన్ను దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను’’ అని లేఖలో చంద్రబాబు రాశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించి ఇప్పటికీ ఏడు వారాలకుపైనే గడుస్తోంది. ఆయన రిమాండ్‌ను నవంబరు 1 వరకూ విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) కోర్టు పొడిగించింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.
లేఖలో ప్రజలకు ఏం చెప్పారు?
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని లేఖలో చంద్రబాబు చెప్పారు. 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై వైసీపీ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు.
‘‘నేను లేని లోటును భర్తీ చేయాలని నా భార్య భువనేశ్వరిని కోరాను. వైసీపీపై ప్రభుత్వ అరాచక పాలనపై పోరాడేందుకు ఆమె అంగీకరించింది’’ అని చంద్రబాబు లేఖలో చెప్పారు.
‘‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ తాత్కాలికమే. అంతిమంగా గెలిచేది న్యాయమే. అప్పటివరకూ వైసీపీ నియంతృత్వ పాలనపై శాంతియుత పోరాటాన్ని కొనసాగించండి’’ అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ లేఖ టీడీపీ సోషల్ మీడియా అకౌంట్లలో కనిపిస్తోంది.
వైసీపీ ఏమంటోంది?
చంద్రబాబు బహిరంగ లేఖకు స్పందనగా వైసీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కూడా ఓ లేఖను విడుదల చేశారు.
‘‘చంద్రబాబు లేఖలో మొదటి వాక్యమే జైలులో లేనని రాశారు. కాబట్టి మీ పోరాటం ఇక ఆపేయండి. క్వాష్, బెయిలు పిటిషన్లను ఊపసంహరించుకోండి’’ అని అంబటి అన్నారు.
‘‘ఓటమి భయంతోనే మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించారని ఆరోపణలు చేశారు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే స్కిల్ స్కాములో ఒక అవినీతిపరుడిని కేంద్ర ఐటీ శాఖ పట్టుకుంది. అది మీరే. ఆ స్కాముకు కర్త, కర్మ, క్రియ మీరే. మీకు విధించిన రిమాండ్‌ను హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా సమర్థించాయి. దొరికిపోయిన తర్వాత దేశభక్తుడిని, ప్రజా సేవకుడిని అని చెప్పుకోవడం బాగోదు’’ అని అంబటి వ్యాఖ్యలు చేశారు.
‘‘సంకెళ్లు మీ సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని అంటున్నారు. మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే మీ ఆదాయం ఎంత? ఆస్తుల విలువ ఎంత? అనే అంశంపై నేను పిటిషన్ వేస్తాను. స్టే కోసం కోర్టులకు వెళ్లకుండా సీబీఐ విచారణకు సిద్ధపడతారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
జైలు అధికారులు ఏం చెబుతున్నారు?
చంద్రబాబు లేఖ వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ స్పందించారు.
‘‘ముద్దాయిలు ఇలాంటి బహిరంగ లేఖ విడుదల చేయాలంటే దాన్ని జైలు అధికారులు మొదట పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం అధికారుల ధ్రువీకరణ, కారాగార ముద్రలతో సంబంధిత కోర్టుల ద్వారా కుటుంబ సభ్యులకు దీన్ని పంపుతాం’’ అని ఆయన ఓ ప్రకటనలో చెప్పారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న లేఖకు, రాజమహేంద్రవరం కారాగారానికి ఎలాంటి సంబంధమూలేదని ఆయన అన్నారు.
జైలు నుంచి లేఖలు రాయొచ్చా?
బహిరంగ లేఖల విషయానికి వస్తే, సాధారణ రిమాండ్‌తో మొదలుపెట్టి అండర్ ట్రయల్ ఖైదీలు, నిందితులు, దోషులకు సాధారణ ప్రజల్లానే అన్ని హక్కులూ ఉంటాయి.
దీనికి సంబంధించి బ్రిటిష్ కాలంనాటి ప్రిజన్స్ యాక్ట్-1900తోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రిజన్ రూల్స్‌లో నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం, సూపరింటెండెంట్ పరిశీలన అనంతరం ఖైదీలు లేఖలు పంపొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఖైదీలు పంపే, స్వీకరించే లేఖల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రభుత్వం వీరికి పోస్టు కార్డులు కూడా అందజేస్తుంది.
అయితే, ఈ లేఖలన్నీ సూపరింటెండెంట్ పరిశీలన అనంతరమే బయటకు పంపాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బౌర్ కౌన్సిల్ సభ్యుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ముప్పళ్ల సుబ్బారావు అన్నారు.
‘‘జైలు నుంచి అఫీషియల్‌గా ఒక లేఖ బయటకు రావాలంటే సూపరింటెండెంట్ అనుమతితోనే రావాలి. దాన్ని వారు వెరిఫై చేశాకే బయటకు పంపుతారు’’ అని ఆయన అన్నారు.
మరి ఈ లేఖ బయటకు ఎలా వచ్చిందనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘కుటుంబ సభ్యులతోపాటు లీగల్ అడ్వైజర్లు ఎప్పటికప్పుడే చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్నారు. బహుశా వారికి ఇది ఇచ్చుండొచ్చు. కానీ, ఇక్కడ కుటుంబ సభ్యులకు ఇచ్చే లేఖలను కూడా సూపరింటెండెంట్ క్లియర్ చేయాలి. అలా లెటర్లు ఇవ్వకూడదు’’ అని ఆయన అన్నారు.
సాధారణంగా ఒక లేఖను రాసే క్రమంలో ఎలాంటి నిబంధనలు అనుసరించాలో అడ్వొకేట్ ముప్పళ్ల సుబ్బారావు బీబీసీతో మాట్లాడారు.
‘‘జైలులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, ఇతర ఖైదీలు లేఖలు రాసేందుకు కార్డులు, పేపర్లు అందుబాటులో ఉంటాయి. రాసిన అనంతరం వాటిని జైలులోనే భిన్న కేటగిరీలుగా విభజిస్తారు. వీటిలో ఫిర్యాదులను వేరుచేస్తారు. వాటిపై లీగల్ సర్వీస్ అథారిటీకి పంపిస్తారు. మిగతా లేఖలన్నీ సూపరింటెండెంట్ పరిశీలిస్తారు. ఆయన అనుమతితోనే లేఖలు బయటకు పంపిస్తారు’’ అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఇలా లేఖ బయటకు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలా జరగడకుండా ప్రభుత్వం ఈ అంశంపై మరింత దృష్టి సారించే అవకాశముందని అడ్వొకేట్ సుబ్బారావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)