ఆంధ్రప్రదేశ్: పరవాడ ఫార్మా సిటీ దెబ్బకు మంచం పట్టిన తాడి గ్రామం... వారం రోజుల్లోగా ఊరిని తరలిస్తామన్న సీఎం జగన్ ఏడాది కిందటి హామీ ఏమైంది?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

“త్వరలోనే తాడి గ్రామాన్ని తరలించేందుకు అవసరమైన రూ. 56 కోట్ల నిధులను విడుదల చేస్తాం. ఆ గ్రామానికి న్యాయం చేస్తాం. ఇది కూడా వారం, పది రోజుల్లోనే జరుగుతుంది” అని సీఎం జగన్మోహన్ రెడ్డి 2022 ఏప్రిల్ 28న అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో జరిగిన సభలో చెప్పారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడలో ఏర్పాటైన ఫార్మాసిటీ నుంచి విడుదలయ్యే కాలుష్యంతో తాడి బాధిత గ్రామంగా మారింది. దీంతో ఈ గ్రామాన్ని తరలిస్తామని సీఎం కాక ముందు జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు.

ఆ తర్వాత సీఎం హోదాలో 2022 ఏప్రిల్ 28న మరో పది రోజుల్లో తాడిని తరలిస్తామని చెప్పారు.

కానీ, ఇప్పటీ వరకు ఆ తరలింపు జరగలేదు. పైగా 2023 అక్టోబర్ 16వ తేదీన తాడి గ్రామానికి పావు కిలోమీటరు దూరంలోనే మరో ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవం కూడా సీఎం జగనే చేశారు.

ఇక్కడ సీఎంకు తమ గోడు చెప్పుకుందామని వెళ్లిన తాడి గ్రామ బాధితులకు అవకాశం కల్పించలేదు. సీఎం హామీ ఇచ్చినా తాడి గ్రామాన్ని ఎందుకు తరలించడం లేదు? అక్కడ ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయి?

అసలు తాడి గ్రామానికి ఏమైంది?

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడలో ఫార్మా కంపెనీల కోసం దాదాపు 2400 ఎకరాల్లో ఫార్మాసిటీని 2006లో ప్రారంభించారు. దీనికి ఫార్మా డెవలపర్‌గా రాంకీ వ్యవహారిస్తోంది. ప్రస్తుతం ఈ ఫార్మాసిటీలో 90 పరిశ్రమలున్నాయి. ఈ ఫార్మాసిటీని అనుకుని ఉన్న గ్రామమే తాడి.

ఈ గ్రామానికి, ఫార్మాసిటీకి మధ్య కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంటుంది. గ్రామానికి అంత సమీపంలో ఫార్మాసిటీ ఉంది. తాడి గ్రామ జనాభా దాదాపు 2700. ఫార్మాసిటీ ప్రారంభమైన తర్వాత తాడి గ్రామస్థులు ఇక్కడ ఫ్యాక్టరీలలోనే ఉద్యోగులుగా చేరారు. కొంతకాలం బాగానే గడిచింది.

ఆ తర్వాత క్రమంగా తాడి గ్రామస్థులు రోగాల బారిన పడటం మొదలైంది. దీంతో ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యంతోనే తమ గ్రామంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తమని ఇక్కడ నుంచి తరలించాలని తాడి తరలింపు బాధితుల సంక్షేమ సంఘంగా ఏర్పడి పోరాటాలు చేయడం మొదలు పెట్టారు.

మరో వైపు అనారోగ్యాలతో గ్రామంలోని చాలా మంది మంచాలకే పరిమితమవ్వడం కూడా మొదలైంది.

ఈ విషయంపై తాడి గ్రామానికి చెందిన అప్పారావు బీబీసీతో మాట్లాడుతూ, “మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలో పనికి కుదిరాను. ఆ తర్వాత ఆరోగ్యం పాడైపోయింది. పరీక్షలు చేయించుకుంటే కిడ్నీలు రెండు పాడైపోయాయని చెప్పారు. ఆ తర్వాత మంచానికే పరిమితమయ్యాను. కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతోనే చచ్చిపోతామనే భయం పెరుగుతోంది. సొంత ఊరుని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైనా చోటు చూపిస్తే వెళ్లిపోతామంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు” అని చెప్పారు.

అప్పారావు ఆరోగ్యం గత పదేళ్లుగా బాగోలేదు. గత ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కొడుకుల్లేని అప్పారావుకు నలుగురు కుమార్తెలు. నలుగురికి వివాహమైనప్పటికీ.. అప్పారావు కుమార్తెలు వంతుల వారీగా తాడి గ్రామానికి వచ్చి ఆయనకు సేవ చేస్తున్నారు.

'అలా ఉండేదాన్ని... ఎలా అయిపోయానో చూడండి'

గ్రామాన్ని తరలించండంటూ జరిగిన అనేక పోరాటాల్లో ముందున్న మరో మహిళ పైడమ్మ. తాడి తరలింపు పోరాటాల్లో అనేకసార్లు అరెస్టైయ్యానని ఆమె చెప్పారు.

అయితే ఆమె సరిగా మాట్లాడలేకపోతున్నారు. ముఖమంతా నల్లగా కమిలిపోయింది. వాకింగ్ స్టాండ్ ఆధారంతోనే నడుస్తున్నారు. తాను గతంలో ఎలా ఉండేదాన్నో చూడండంటూ ఒక ఫోటోని చూపిస్తున్నారు.

“కంపెనీ కాలుష్యం వల్లే నాకు నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. గతంలో పెద్దగా నినాదాలు చేస్తూ అరిచిన నా నోరు నుంచి ఇప్పడు మాటలే సరిగా రావడంలేదు. చూడండి నా పాత ఫోటోని. అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో? ఈ గ్రామాన్ని తరలించకపోతే నా ప్రాణాలు పోతాయని భయంగా ఉంది. దయచేసి త్వరగా ఇక్కడ నుంచి మమ్మల్ని పంపిచేయండి. మీరైనా సీఎంకు చెప్పండి” అని బీబీసీతో పైడమ్మ అన్నారు.

ఫార్మాసిటీకి సమీపంలోనే ఉన్న పైడమ్మ ఇంట్లో ఆమెతో మాట్లాడుతున్నంత సేపు దట్టమైన వాసన వస్తూనే ఉంది. రాత్రిపూట అయితే ఈ వాసన చాలా ఎక్కువగా వస్తుందని పైడమ్మ చెప్పారు. కొన్ని సార్లు ఈ వాసనకు ఏమీ తినాలని అనిపించదని తెలిపారు.

2019లోనే తరలింపు జీవో...

తాడి గ్రామం మూడు భాగాలు ఉంటుంది. తాడి, చినతాడి, బీసీ కాలనీలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 742 కుటుంబాలున్న తాడి గ్రామంపై ప్యాక్టరీల కాలుష్యం తీవ్రమైన ప్రభావం చూపడంతో పాటు ఫార్మాసిటీలో ఏ ప్రమాదం జరిగినా తమ గ్రామంలో ఏమైపోతుందనే ఆందోళన నిత్యం తాడి గ్రామస్థులను వెంటాడుతూనే ఉంటుంది.

2022 నుంచి ఇప్పటీ వరకు ఫార్మాసిటీలో 12 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి తాడి గ్రామస్థులు అక్కడ నుంచి ఇతర గ్రామాలకు తరలివెళ్లిపోవడం, మళ్లీ పరిస్థితి సద్దుమణిగాక రావడం పరిపాటిగా మారిందని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాద్యాక్షులు జి. సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

“టీడీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు రూ.57.63 కోట్లు విడుదల చేస్తూ 2019 ఫిబ్రవరి 6న జీవో-29ను విడుదల చేసింది. ఈ జీవోలో తాడి గ్రామాన్ని అక్కడ నుంచి పది కిలోమీటర్లు దూరంలో ఉండే పెదముసిడివాడకు తరలించేందుకు అవసరమయ్యే ఇళ్ల పరిహారం చెల్లింపు, రవాణా ఛార్జీలు చెల్లింపు, ఇళ్ల స్థలం, ఇళ్ల నిర్మాణం వంటి అంశాలని చేర్చింది. కానీ ప్రభుత్వం మారడంతో ఆ జీవో ఏమైందో తెలియలేదు, తరలింపు జరగలేదు. పైగా ఎన్నికల హామీలో భాగంగా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తాము అధికారంలోకి వస్తే తాడి గ్రామాన్ని తరలిస్తామని చెప్పారు” అని సీఐటీయూ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

‘‘పది రోజుల్లో తరలిస్తాం’’

ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీతో పాటు సీఎం అయిన తర్వాత కూడా 2022 ఏఫ్రిల్ 28న అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారంలో జరిగిన బహిరంగ సభలో అవసరమైన రూ. 56 కోట్ల నిధులు విడుదల చేసి తాడి గ్రామాన్ని వారం నుంచి పది రోజుల్లో తరలిస్తానని ముఖ్యమంత్రి హోదాలో స్పష్టంగా చెప్పారు.

కానీ ఇంత వరకు అది జరగలేదు. పైగా 2023 అక్టోబర్ 16న తాడి గ్రామానికి పావు కిలోమీటరు దూరంలోనే మరో ఫార్మా కంపెనీని సీఎం స్వయంగా ప్రారంభించారు, దానికి పక్కనే ఉన్న తాడి ప్రస్తావన రాలేదు.

“సీఎంను కలిసి మా గోడు చెప్పుకుందామని వెళ్లేందుకు ప్రయత్నిస్తే వెళ్లనివ్వలేదు. పైగా ముందు రోజు బాధిత సంఘం నాయకులని, సీఐటీయూ ప్రతినిధులను అరెస్ట్ చేశారు. తరలింపుపై ముఖ్యమంత్రి ఇచ్చిన మాటపై ఆయన నిలబడకపోతే మేం ఇంకెవరిని అడగాలి” అని తాడి గ్రామానికి చెందిన గోవిందరాజు బీబీసీతో అన్నారు.

“ఫార్మాసిటీలో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఫార్మా సిటీలో ప్రమాదం జరిగితే తాడి ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలతో గడపాల్సిన పరిస్థితి. అందుకని ఈ గ్రామాన్ని వెంటనే తరలించాలి” అని సీఐటీయూ నాయకులు జి. సత్యనారాయణ డిమాండ్ చేశారు.

'మాకు పథకాలు వద్దు.. తరలించండి చాలు'

తాడి తరలింపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అలస్యమయ్యే కొద్ది ఇక్కడ పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతున్నాయని, కాలుష్యం చుట్టుముట్టేస్తుందని తాడి గ్రామస్థుడైన గోవిందరాజు బీబీసీతో అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు నుంచి మూడు ప్రభుత్వాలు చూశామని, కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడిన తమ గ్రామం ఇలా అనారోగ్యంతో నిండిపోయిందని.. ఈ గ్రామంలో ఇంటికో మంచానికి పరిమితమైన మనిషి కనిపిస్తాడని గోవిందరాజు చెప్పారు.

అసలు తమ గ్రామాన్ని తరలించడంతో ఇంత ఆలస్యం చేస్తున్న విధానం చూస్తుంటే... అసలు తరలిస్తారా, లేక ఇక్కడే మమ్మల్ని కాలుష్యంతో చావమంటారా అనే అనుమానంగా ఉందని అన్నారు.

“ఫార్మా ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. భూగర్భ జలాలు సైతం కలుషితం అయ్యాయి. దీంతో చిన్న, పెద్దా అని తేడా లేకుండా చర్మవ్యాధుల బారిన పడుతున్నాం. ఈ విషయాలను ఇటు కంపెనీ ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. సీఎం అనేక పథకాలు ఇస్తున్నారు, మాకు అవేవీ వద్దు, మమ్మల్ని తరలించడండి చాలు” అని గోవిందరాజు అన్నారు.

తాడి గ్రామ తరలింపుపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో బీబీసీ మాట్లాడింది. “ముఖ్యమంత్రి దృష్టిలో తాడి గ్రామం తరలింపు ఉందని, తరలింపు త్వరలోనే జరుగుతుంది” అని ఆయన బీబీసీతో చెప్పారు.

కాలుష్యమే కాదు, ప్రమాదాలు ఎక్కువే...

ఫార్మాసిటీ కాలుష్యమే కాదు, తాడి గ్రామస్థులను ప్రమాదాలు కూడా నిత్యం భయపెడుతూనే ఉంటాయి.

ఈ ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు పరిహారం అందించి యాజమాన్యాలు చేతులు దులిపేసుకొంటున్నాయే తప్ప భద్రతను గాలికి వదిలేస్తున్నాయని అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా పరిశ్రమల శాఖ సమాచారం ప్రకారం…2022 జనవరి నుంచి ఇప్పటివరకు పరవాడ ఫార్మాసిటీలో 12 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఆక్టో ఫార్మాలో రియాక్టర్ పేలుడుతో పాటు ఎమ్మెన్నార్ ఫార్మా, ఎస్ఎన్ఎఫ్ ఫార్మా, ఎస్ఈజెడ్ అలివిర ఫార్మా, గ్లాండ్ ఫార్మా, సాయిశ్రేయాస్ ఫార్మా, ఆప్టిమస్ ఫార్మా సంస్థలో జరిగిన రియాక్టర్ పేలుళ్లు, గ్యాస్ లీక్ ప్రమాదాలు ముఖ్యమైనవి.

కోరి ఆర్గానిక్స్ రియాక్టర్ పేలుడుతో ఫ్యాక్టరీ గోడలే కూలిపోగా, లారస్ ల్యాబ్స్ యూనిట్-3లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

ఇలాంటి పరిస్థితుల్లో తాడి గ్రామాన్ని తరలించడంతోపాటు ఈలోగా ప్రమాదాలు జరగకుండా ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలు పక్కగా అమలయ్యేలా పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలని తాడి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)