You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: జగన్ ఇప్పుడు బీసీ ఓట్ల మీద దృష్టి పెట్టారా... రెడ్డి లీడర్లు అందుకే పార్టీకి దూరమవుతున్నారా?
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అందులోనూ జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకులు కొందరు దూరమవుతున్నారు. రెడ్డి కులానికి చెందిన నేతలే పదవులకు, పార్టీకి సైతం రాజీనామా చేసే వరకూ వచ్చింది.
మరో నాలుగు నెలల్లో ఎన్నికలుండగా ఈ పరిణామాల చుట్టూ పెద్ద చర్చ సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలను మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి.
త్వరలోనే మరిన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరుపున కొత్త నేతలు తెరమీదకు రావడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. దాంతో ఏం జరుగుతోందననే ఉత్కంఠ సర్వత్రా ఉంది.
తెలంగాణ పరిణామాల నేపథ్యంలో అంటే.. వ్యతిరేకత ఉన్నప్పటికీ పోటీకి నిలిపిన అనేక మంది అభ్యర్థులు ఓడిపోయారని, అది కూడా బీఆర్ఎస్ ఓటమికి దారి తీసిన పరిణామాల్లో ముఖ్యమైనది అనే వాదన ఉన్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీలోని రాజకీయ పరిణామాలు ముందస్తు జాగ్రత్తకు సంకేతమా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.
బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నామన్న సంకేతాలు బలంగా పంపించడానికి జగన్ కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తాను అవసరమనుకున్న చోట కొందరు రెడ్డి నాయకులను మార్చడానికి వెనుకాడకుండా అడగులు వేస్తున్నట్టు అర్థమవువుతోంది.
తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆ వెంటనే వైఎస్సార్సీపీని వీడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్కే రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మంగళగిరి తెరపై బీసీ నాయకుడు గంజి చిరంజీవి ( పద్మశాలీ) తెరమీదకు వచ్చారు. దాంతో ఈ జాబితాలో తదుపరి ఎవరనే చర్చ పాలకపక్ష ఎమ్మెల్యేల్లోనే విస్తృతంగా సాగుతోంది.
నెల్లూరు పెద్దారెడ్లతో ఆరంభం...
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్నా ముందే నెల్లూరులో ముగ్గురు రెడ్లు వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. మండలి ఎన్నికల్లో జగన్ నిర్ణయానికి భిన్నంగా టీడీపీని గెలిపించి, వైఎస్సార్సీపీకి వీరు దూరమయ్యారు.
నెల్లూరు రూరల్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందులో హార్డ్ కోర్ జగన్ అభిమాని. జగన్ వెంట నడిచేందుకు కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీ ఆరంభం నుంచి ఆయన అధినేత వెంట ఉన్నారు. అనేక అవరోధాలు కూడా ఎదుర్కొన్నారు. జగన్ కోసం తానే ఏమయినా చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే 2014-19 మధ్య అసెంబ్లీలోనూ, బయట కూడా వైఎస్సార్సీపీ తరుపున బలంగా నిలబడ్డారు. పార్టీ వాయిస్ వినిపించడం, శ్రేణులను కదిలించడంలో ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు.
కానీ 2019లో అధికారం చేపట్టిన తర్వాత అంతకుముందున్న బంధానికి బీటలు వారాయి. జగన్ నమ్మినబంటుగా ఉన్నందుకు కోటంరెడ్డికి మంత్రి పదవి ఖాయమని బలంగా ప్రచారం జరిగింది. కానీ విస్తరణ సమయంలోనూ చాన్స్ దక్కలేదు. నెల్లూరులో సైతం ఆయన హవాకి అడ్డుకట్ట పడింది. ఇతర అనేక కారణాలు తోడు కావడంతో జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మెలిగిన శ్రీధర్ రెడ్డి క్రమంగా దూరమయ్యారు.
కోటంరెడ్డితో పాటుగా నెల్లూరు జిల్లాకే చెందిన మరో ఇద్దరు రెడ్డి కులస్థులైన సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం జగన్‌కు హ్యాండిచ్చి టీడీపీకి చేరువయ్యారు. దాంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు దూరం కావడం వైసీపీ శిబిరంలో కలకలం రేపింది.
కొత్త రెడ్లు తెరమీదకు...
నెల్లూరు జిల్లాలో రెడ్డి కులస్థులకు ఉన్న పట్టు, ప్రాధాన్యత రీత్యా ఆ మూడు స్థానాల్లోనూ రెడ్లలో కొత్త నేతలను తెరమీదకు తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానంటూ ఆయన నెల్లూరు రూరల్‌లో సన్నాహాలు చేసుకుంటున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి మద్ధతుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన సోదరుడు గిరిధర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి టీడీపీ తరుపున పోటీ చేస్తారని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.
వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గడప గడపకు సహా వివిధ పార్టీ కార్యక్రమాలను ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం వెంకటగిరి వ్యవహారాలకు దూరమయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ లేదా ఆత్మకూరు స్థానం ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాల్లో ఉన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానాన్ని ధిక్కరించిన తర్వాత ఆయన చురుగ్గా కనిపించడం లేదు. ఆయన స్థానంలో ఇప్పటికే మేకపాటి కుటుంబం నుంచే రాజగోపాల్ రెడ్డిని ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించారు. ఆయనే ప్రస్తుతం వైఎస్సార్సీపీ వ్యవహరాలు నిర్వహిస్తున్నారు.
అంతర్గత వైరుధ్యాలు బయటపడుతున్నాయి..
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపించడానికి ప్రతి దశలోనూ ప్రయత్నిస్తున్నారు. అది అక్కడక్కడా అధికార స్థానాల్లో పాతుకుపోయిన రెడ్లలో కొంత అసంతృప్తిని రాజేసిందనే అభిప్రాయం ఉంది.
నెల్లూరు జిల్లాలో పి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన హవా కారణంగా రెడ్లు నొచ్చుకున్నట్టుగా సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.
"గతంలో కమ్మ కలస్థుల హవా సాగినట్టుగా జగన్ అధికారంలోకి వస్తే రెడ్లు పెత్తనం ఆశించారు. కానీ అందుకు భిన్నంగా బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యత దక్కింది. దానిని రెడ్లు కొందరు జీర్ణించుకోలేకపోయారు. నెల్లూరు జిల్లాలో అది బహిర్గతమయ్యింది. దానికి తోడుగా రెడ్లలోనే కొందరి ఆధిపత్యం మరికొందరు రెడ్లు సహించలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు అందుకు ఉదాహరణ. జగన్ శిబిరంలో టాప్ 4గా ఉన్న విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారితో ఇతర రెడ్లకు మధ్య ఉన్న వైరుధ్యం ఇప్పుడు ఎన్నికల ముంగిట బయటపడుతోంది" అని ఆయన అన్నారు.
ప్రచారంలో ఉన్నట్టుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరుపున ఏపీ రాజకీయాల్లోకి వస్తే మరింత మంది అసంతృప్తులు ఆమె వెంట సమీకృతమయ్యే అవకాశం కూడా కనిపిస్తోందని నాగరాజు బీబీసీతో అన్నారు. ఇదంతా వైఎస్సార్సీపీలో అంతర్గత వైరుధ్యాలు తీవ్రమవుతున్న తీరుకి అద్దంపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
బీసీల కోసమే మంగళగిరి ఖాళీ చేశారా...
నెల్లూరులో ఓ రెడ్డి పోతే మరో రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ మంగళగిరి అసెంబ్లీ స్థానంలో మాత్రం జగన్‌కు ఒకనాటి అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం పక్కన పెట్టేసి ఆయన స్థానంలో బీసీ నేత గంజి చిరంజీవికి ఇన్‌చార్జ్ హోదా కట్టబెట్టడం కీలక పరిణామంగా కనిపిస్తోంది.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కుల సమీకరణాల రీత్యా తాడేపల్లిలో రెడ్లు, దుగ్గిరాలలో కమ్మ ఆధిక్యత ఉంటుంది. మంగళగిరి రూరల్‌లో కాపు, ఇతర కులాల వారు ఉంటారు. కానీ మంగళగిరి పట్టణంలో సంఖ్య రీత్యా అత్యధికంగా ఉండే పద్మశాలీ ఓట్లే ఫలితాలను నిర్దేశిస్తాయి. దాంతో పద్మశాలీలకు ప్రాధాన్యతనివ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే , చేనేత కులాలకు చెందిన మరుగుడు హనుమంతరావు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఆప్కో చైర్మన్ పదవి నిర్వహించిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకుని ప్రాధాన్యతనిచ్చారు.
టీడీపీ తరుపున మాజీ మంత్రి, ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బరిలో దిగబోతున్న తరుణంలో ఆయన్ని ఢీకొట్టేందుకు కుల సమీకరణాలను ఉపయోగించుకునే లక్ష్యంతో సొంత మనుషులుగా ఉన్న వారిని సైతం పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారనే వాదన వినిపిస్తోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా వైఎస్సార్‌కు సన్నిహితంగా మెలిగారు. ఆయన తర్వాత జగన్ పార్టీలో ఆరంభం నుంచి దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని న్యాయపరంగా చిక్కుల్లో నెట్టడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు.
ఓటుకి నోటు కేసు నుంచి తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వరకూ అన్నీ ఆర్కే ఫిర్యాదు కారణంగానే సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. పార్టీ కోసం అంతగా శ్రమించిన నేత లోకేశ్‌ను ఓడించిన తర్వాత నేరుగా క్యాబినెట్‌లోకి తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత కూడా తనకు తగిన ప్రాధాన్యతనివ్వడం లేదనే కారణంగా ఆర్కే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
బీసీలకు సీట్లు పెరుగుతాయి..
ఏపీలో బీసీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని జగన్ పావులు కదుపుతున్నట్టు కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. సంప్రదాయంగా టీడీపీకి కొంత మొగ్గు ఉండే బీసీ ఓట్లను చీలిస్తే తన పని సులువు అవుతుందని ఆయన నమ్ముతున్నారు.
బీసీ కులాలకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్( శెట్టిబలిజ) , మోపిదేవి వెంకట రమణ( మత్స్యకార) వంటి వారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మండలిలో చోటు కల్పించి మంత్రివర్గంలో తీసుకున్నారు. మండలి రద్దయ్యే దిశలో ఉన్నప్పుడు ఏకంగా రాజ్యసభకి పంపించారు.
ఆ తర్వాత కూడా తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం ద్వారా బీసీలకు పెద్ద పీట వేస్తున్నామనే సంకేతం ఇచ్చారు.
"మంగళగిరిలో రెడ్డి స్థానంలో బీసీకి సీటు ఇచ్చారు. గుంటూరు వెస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాల గిరి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. కానీ ప్రస్తుతం ఆయన స్థానంలో బీసీ కులానికి చెందిన మంత్రి విడదల రజనీని అక్కడ ఇన్‌చార్జ్ చేశారు. ఇలా రెండు చోట్ల సిట్టింగ్ ఓసీల స్థానంలో బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇలా మరికొన్ని స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించబోతున్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా తన ఓటు బ్యాంక్ పెంచుకోవాలని చూస్తున్నారు. యాదవ, మత్స్యకార వంటి కొన్ని కులాల్లో ఆపార్టీ బలం పెరిగింది. ఇక చేనేత వంటి సంప్రదాయ టీడీపీ మద్దతుదారులను తన వైపు మళ్లించుకునే వ్యూహంలో భాగమే ఇలా జరుగుతోంది" అని రాజకీయ విశ్లేషకుడు ఐనం ప్రసాద్ వ్యాఖ్యానించారు.
"జగన్ వ్యూహం కారణంగా కొందరు రెడ్లు దూరమవుతారు..అయినా జరుగుతున్న నష్టం కన్నా ప్రయోజనం ఎక్కుగా ఉంటుందనే అంచనాతో సాగుతున్నారు" అని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
జగన్‌కు 2019లో ఉన్నంత రెడ్ల అండ 2024లో ఉండకపొవచ్చని ప్రసాద్ అన్నారు. రాయలసీమలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి అందుకు ఓ సంకేతంగా చూడాలన్నారు.
ఇప్పటికే వైఎస్సార్సీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు రెడ్లు దూరమయిన తరుణంలో మరికొందరిని కూడా పక్కన పెడితే వైఎస్సార్సీపీలో పరిణామాలు ఎటు మళ్లుతాయన్నది ఆసక్తికరమే.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభలో హైటెన్షన్.. సభలోకి దూకిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు, భద్రతపై వెల్లువెత్తిన విమర్శలు
- రజినీకాంత్ మెడలో కోరలు తీయని పాము.. అదెలా జరిగింది? ఆయన ‘స్నేక్ సెంటిమెంట్’ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
- బిగ్ బజార్: రిటైల్ కింగ్ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)