బిగ్‌ బజార్: రిటైల్ కింగ్‌ కిశోర్ బియానీ సామ్రాజ్యం ఎలా దివాలా తీసింది...

బిగ్ బజార్, పాంటలూన్స్, ఫుడ్ బజార్, సెంట్రల్....ఇలా మాల్స్‌కి వెళ్లి షాపింగ్ చేయాలనుకునే కస్టమర్లకు ఇవన్నీ గుర్తుకొస్తాయి. భారత్‌లోని మధ్యతరగతి కస్టమర్లకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ (వస్తువులు, దుస్తులు) అందించడంలో ఈ మాల్స్ కీలకపాత్ర పోషించాయి.

ఈ మాల్స్ చైన్‌ను సృష్టించిన ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈవో కిశోర్ బియానీ భారతీయ వ్యాపారవేత్తల్లో 'కింగ్ ఆఫ్ రిటైల్‌'గా పేరుగాంచారు.

దేశంలో వేగంగా పెరుగుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌, దాని ఎదుగుదలను ఆయన గమనించారు. 21 శతాబ్దం తొలినాళ్లలో దేశంలోని చిన్నాపెద్దా నగరాల్లో బిగ్‌ బజార్‌ షాపింగ్ మాల్స్‌ను ప్రారంభించారు.

పాంటలూన్స్, బిగ్ బజార్, ఫుడ్ బజార్, సెంట్రల్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో విప్లవం సృష్టించారు బియానీ. ఆ తర్వాత ఆయన కంపెనీ ఫైనాన్స్, సినిమా, రవాణా రంగాలకూ విస్తరించింది.

కుటుంబ వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని బియానీ భావించారు. డిస్కో దాండియా నుంచి ఆయన తొలిపాఠాలు నేర్చుకున్నారు. షాపింగ్ మాల్స్ నిర్వహణ గురించి ఆయన భారత్‌కి చెందిన నిపుణులతో పాటు విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. కానీ, ఆయన నిజంగా వ్యాపార పాఠాలు నేర్చుకుంది మాత్రం దేవాలయం నుంచే.

సంక్షోభం చుట్టుముట్టడంతో దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ సాయం పొందేందుకు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. న్యాయపోరాటం కొనసాగింది.

ఇవాళ ఆయన కంపెనీ దివాలా అంచుల్లో ఉంది. బియానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు జిందాల్ గ్రూప్ ఇటీవల ప్రకటించినప్పటికీ, కంపెనీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, పెట్టుబడి పెట్టాలనుకున్నవారు రుణగ్రహీతల అంగీకారం నుంచి మొదలుపెట్టి, చట్టపరమైన ఆమోదం వరకూ చాలా పెద్ద ప్రక్రియనే దాటాల్సి ఉంటుంది.

మీడియా కథనాల ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ 19,440 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. బియానీ కంపెనీకి రుణాలిచ్చిన ప్రధాన బ్యాంక్ ఫ్యూచర్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ విచారణ ప్రారంభించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

దేవాలయం, డిస్కో దాండియా నుంచి మేనేజ్‌మెంట్ పాఠాలు

కిశోర్ బియానీ 1961 ఆగస్ట్ 9న ముంబయిలో, ఓ సంపన్న మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన తాత బన్సీలాల్ రాజస్థాన్ నుంచి ముంబయికి వలసొచ్చారు. బట్టల దుకాణంతో ప్రారంభించి సొంతంగా బట్టల మిల్లులు ప్రారంభించే స్థాయికి ఎదిగారు.

బియానీ కుటుంబ పెద్ద లక్ష్మీనారాయణ్, ఆయన సోదరులు, వారి కుమారులు కుటుంబ వ్యాపారంలోనే భాగస్వాములయ్యారు. కానీ, చిన్నప్పటి నుంచి కిశోర్ బియానీకి కుటుంబ వ్యాపారంలో భాగస్వామి కావడం ఇష్టం లేదు. ఏదో ఒకటి కొత్తగా చేయాలని అనుకునేవారు.

ఫ్యూచర్ గ్రూప్‌పై వచ్చిన 'ఇట్ హ్యాపెన్డ్ ఇన్ ఇండియా' పుస్తకానికి బియానీ సహ రచయిత కూడా. దానిని ఆయన ఆత్మకథ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

పుస్తకంలోని రెండో అధ్యాయంలో, "నవరాత్రుల సమయంలో గుజరాతీ యువతీయువకులు సంగీతానికి అనుగుణంగా దాండియా డ్యాన్స్ చేస్తారు. కానీ, మనకది బోరింగ్‌గా అనిపిస్తుంది. నేను కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక స్నేహితుడు నన్ను దాండియా ఉత్సవాల్లో పాల్గొనేందుకు జుహుకి తీసుకెళ్లాడు.

ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ రాజేశ్ రోషన్ లైవ్ మ్యూజిక్ ప్రారంభమైంది. యువతీయువకులు డ్యాన్స్ చేస్తున్నారు. అంతమంది యువతీయువకులు ఒకచోట చేరి డ్యాన్స్ చేయడం చూసింది అప్పుడే. అద్భుతంగా అనిపించింది. దానికి నేను ముగ్ధుడినయ్యా''

వచ్చే ఏడాది తమ సొసైటీలో డిస్కో దాండియా నిర్వహించాలని బియానీ నిర్ణయించుకున్నారు.

‘‘అది చాలా సక్సెస్ అయింది. కొన్నేళ్లలోనే చుట్టుపక్కల మంచి పేరొచ్చింది. అది క్రౌడ్ కంట్రోల్, మేనేజ్‌మెంట్‌ పాఠాలు నేర్పింది’' అని బియానీ ఆ పుస్తకంలో రాశారు.

'న తుమ్ జానో న హమ్' సినిమాను కూడా నిర్మించారు బియానీ.

ఆ సినిమాకి రాజేశ్ రోషన్ మ్యూజిక్ కంపోజర్‌ కాగా, హృతిక్ రోషన్ హీరో. దాని తర్వాత 'చురా లియా హై తుమ్నే' సినిమా తీశారు.

ఆ తర్వాత బియానీ బిగ్ బజార్ చైన్‌ను ప్రారంభించారు. 'చవకగా వస్తువులు' అందించడం దాని ప్రత్యేకత. కస్టమర్లు భారీగా వచ్చేవారు. వారిని నియంత్రించడం బిగ్ బజార్ సిబ్బందికి, సెక్యూరిటీ గార్డులకు పెద్ద పనిగా మారింది.

భారీగా వచ్చే జనాన్ని నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారిందని, ఈ సమస్య పరిష్కారానికి దేవాలయాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు ఆయన పుస్తకంలో రాశారు.

దేవాలయాలకు భారీగా వచ్చే భక్తులను నియంత్రించడం, వారిని దర్శనానికి పంపించడం వంటి విధానాలను కంపెనీ సిబ్బంది ఆలయాల నిర్వహణపై అధ్యయనం చేసి తెలుసుకున్నారు.

పెద్ద ముందడుగు బిగ్ బజార్

1987లో పాంటలూన్స్‌ని స్థాపించారు బియానీ. ఈ కంపెనీ పురుషుల ప్యాంట్లు తయారుచేసేది. తన కంపెనీలో తయారైన ప్యాంట్లు మీ దుకాణంలో అమ్మకానికి ఉంచాలని ముంబయిలోని ఓ రిటైలర్‌ను అడిగినట్లు బియానీ రాశారు.

తాను ఫారిన్ బ్రాండ్లు తెచ్చానంటూ స్టోర్‌లో ప్యాంట్లు పెట్టుకునేందుకు ఆ రిటైలర్ నిరాకరించారు. ముంబయిలోని ఏ మాల్‌లోనూ వాటికి చోటు దక్కలేదు.

దీంతో కలకత్తా నుంచి తన కంపెనీ ఉత్పత్తులను రిటైల్‌గా విక్రయించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, నిత్యవసర వస్తువులను కూడా ఒకచోటకి చేర్చాలని అనుకున్నారు. అప్పటికే కొంతమంది ఈ రిటైల్ రంగంలో పనిచేస్తున్నారు.

మొదట్లో బిగ్ బజార్‌కి కస్టమర్ల నుంచి అనుకున్నంత ఆదరణ దక్కలేదు. దీంతో కన్సల్టెంట్లను సంప్రదించారు. వాల్‌మార్ట్, టెస్కో తరహాలో కంపెనీలో మార్పులు చేయాలని కన్సల్టెంట్లు సూచించారు. అప్పటికే ఆ రెండు కంపెనీలు అమెరికా, యూకేలో విజయవంతంగా నడుస్తున్నాయి.

కస్టమర్లు మార్కెట్‌లో షాపింగ్ చేసే భావనతో ఉన్నారని బియానీ గ్రహించారు. ప్యాక్ చేసిన వస్తువులనే కాకుండా కిరాణా సరుకుల నుంచి, పండ్లు, కూరగాయల వరకూ అన్నీ అమ్మడం మొదలుపెట్టారు.

''బియానీ దక్షిణ భారతదేశంలోని శరవణ స్టోర్స్ అనే బ్రాండ్‌పై కొద్దివారాల పాటు అధ్యయనం చేశారు. శరవణ బ్రాండ్ దేశంలోనే అతితక్కువ ధరలకు వస్తువులను ఎలా విక్రయిస్తుందో గమనించారు. అప్పటి నుంచి తక్కువ లాభం, ఎక్కువ వ్యాపారం సూత్రాన్ని వంటబట్టించుకున్నారు'' అని జియోఫ్ హిస్కాక్ తన పుస్తకం 'ఇండియాస్ స్టోర్ వార్స్'‌లో పేజీ నంబర్ 9, 10లో రాశారు.

ఏడాదికి 72 రోజులు ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టి కస్టమర్లను ఆకర్షించాలని బిగ్ బజార్ ప్రయత్నించింది. అందుకోసం ప్రతి బుధవారం నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయలను తక్కువ ధరలకు విక్రయించింది. ఈ సమయంలో గృహిణులు నిత్యవసరాలు కొనేవారు. అదే సమయంలో ధర ఎక్కువ ఉన్న వస్తువులను తక్కువ ధరలకు కొనేందుకు ఇష్టపడేవారు.

2007లో బియానీ బిలియనీర్ల జాబితాలో చేరారు. దేశంలోని అత్యంత సంపన్నుల ఫోర్బ్స్‌ జాబితాలో 54వ స్థానంలో నిలిచారు. 2008లో ఆర్థిక మాంద్యం తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి.

ఇబ్బందులు, పొరపాట్లు

2008 ఆర్థిక మాంద్యం ప్రభావం పడినప్పటికీ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ రంగంలో ఒక బ్రాండ్ తర్వాత మరో బ్రాండ్‌ను ప్రారంభిస్తూ వెళ్లింది. దేశంలోని చాలా నగరాల్లో భారీ స్థాయిలో స్టోర్స్ ఏర్పాటు చేయడంతో కంపెనీ అప్పులు పెరిగాయి. క్రమంగా కంపెనీపై రుణ భారం పెరిగింది.

ఆ సమయంలో రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేదు. బ్యాంకుల నుంచి మినహా ఇతర మార్గాల నుంచి నిధులు సేకరించడం బియానీకి కష్టతరం అయ్యింది.

రుణభారం తగ్గించుకునేందుకు 2012లో ప్యాంట్స్ బ్రాండ్‌లో తన వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్‌కి విక్రయించారు. ఆ తర్వాత కంపెనీని కూడా వారికే అమ్మేశారు.

ఆ తర్వాతి కాలంలో దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతూ వచ్చింది. ఈబే, ఫ్లిప్‌కార్ట్ సహా ప్రపంచంలోనే అతిపెద్ద ఆ‌న్‌లైన్ కంపెనీ అయిన అమెజాన్ కూడా మార్కెట్లోకి ప్రవేశించింది.

ఈ మార్పు వేగంగా వచ్చింది. దానితో పాటు భారీ డిస్కౌంట్లు, అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కూడా ఆన్‌లైన్ కస్టమర్లను తయారు చేసింది. అది రిటైలర్లకు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది.

ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ ఆఫ్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు 2019 ఆగస్టులో బిగ్ బజార్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో బియానీ 2.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చివరిసారి కనిపించారు.

ఆ ఒప్పంద ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే 2020లో కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించడం, ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా నిబంధనలు అమలు చేయడంతో నిత్యవసర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనడం ఎక్కువైంది. దీంతో మొదటి మూడు, నాలుగు నెలల్లోనే కంపెనీ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది.

ఆ తర్వాత ఫ్యూచర్ గ్రూప్‌కి చెందిన 19 కంపెనీలను 24,713 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020 ఆగస్టులో ప్రకటించింది. ముకేశ్ అంబానీ కూతురు ఇషా రిటైల్ వ్యాపారాలు చూసుకుంటున్నారు. రిలయన్స్ రిటైల్‌ ఆధ్వర్యంలోని స్టోర్స్ అప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి.

అయితే, గతంలో ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్న అమెజాన్ కోర్టును ఆశ్రయించింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో 2022 ఏప్రిల్‌లో రిలయన్స్ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతకుముందే సంస్థ సిబ్బందితో పాటు, కొన్నిచోట్ల ఫ్యూచర్ గ్రూప్ స్టోర్స్‌ను రిలయన్స్ లీజుకు తీసుకుంది.

నిధుల లేమితో ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. చివరికి కంపెనీ దివాలా తీసిందని ప్రకటించాల్సి వచ్చింది. '' రెండు కంపెనీల మధ్య ఇరుక్కుపోయాం. మేం అనుకున్నది అనుకున్న విధంగా జరగలేదు'' అని ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ బియానీ అన్నారు.

ఇదంతా ఫ్యూచర్ గ్రూప్ గతం. ఇప్పుడు దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరు కొనుగోలు చేస్తారనే దానిపై ఆ కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి: