సీఎంగా రేవంత్ ప్రకటనకు ముందు దిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఏమన్నారు?

తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ప్రకటన చేయడానికి ముందు దిల్లీలో హైడ్రామా నడిచింది.

డిసెంబరు 3 ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి.

119 స్థానాలున్న అసెంబ్లీలో 64 సీట్లు గెలుచుకొన్న కాంగ్రెస్, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించింది.

ఫలితాలు వెలువడినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మరం చేసింది. దీనిపై ఆదివారం నుంచి దిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతూ వచ్చారు. ఇవి మంగళవారం సాయంత్రానికి కొలిక్కి వచ్చాయి.

అయితే వేణుగోపాల్ ప్రకటన వెలువడటానికి ముందు పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.

మంగళవారం ఏం జరిగింది?

సోమవారం హైదరాబాద్‌లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశం జరిపి, సీఎల్పీ నేత ఎవరనేదానిపై అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే, ఏకాభిప్రాయం రాలేదు.

మంగళవారం మరోసారి సీనియర్ నేతలతో చర్చలు జరిపారు ఏఐసీసీ నేతలు.

మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్, హుజుర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమ ప్రాధాన్యాలను అధిష్ఠానానికి తెలియజేశారని వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాంగ్రెస్ పెద్దలతో జరుగుతున్న చర్చలపై మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తనకు అన్ని అర్హతలున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం మీడియాతో అన్నారు.

సీఎల్పీ నేత, ఇతర విషయాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడే ఉంటానని చెప్పారు.

నేనూ రేసులోనే ఉన్నా: శ్రీధర్ బాబు

64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా సీఎం అయ్యే అవకాశముంటుందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం మధ్యాహ్నం మీడియాతో అన్నారు.

''అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. రేసులో నేను కూడా ఉన్నా'' అని చెప్పారు.

ప్రతీ ఒక్కరికి ఎవరో ఒకరు మద్దతిస్తారని, అందరికీ ఫ్యాన్స్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

దిల్లీకి రేవంత్

సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు.

సీఎల్పీ నాయకుడిగా తనను ఎంపిక చేయడంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే‌కు రేవంత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు, కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తనకు మద్దతుగా నిలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 7న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి వారిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించేందుకు రేవంత్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి దిల్లీకి బయల్దేరారు.

సిద్ధరామయ్య, కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(ట్విటర్)‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.

''కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి అభినందనలు. తెలంగాణలో రాబోయే ఐదేళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరినీ కలుపుకొని పోయే, ప్రగతిశీలమైన, పారదర్శకమైన పాలనను మనం చూస్తాం’’ అని చెప్పారు.

''సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైనందుకు, తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి నాయకత్వం వహించినందుకు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు'' అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)