తెలంగాణ: ఓటమి పాలైన మంత్రులు ఎవరు? ఎంత తేడాతో ఓడిపోయారు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు భారీ తేడాతో ఓడిపోయారు.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్‌, నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్‌లకు ఓటమి తప్పలేదు.

ఎర్రబెల్లిని 46 వేల ఓట్ల తేడాతో ఓడించిన 26 ఏళ్ల యశస్విని

ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.

ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఆయన్ను 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు.

పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని 46 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు 1994 నుంచి 2009 వరకు వర్ధన్నపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు గెలిచారు.

తర్వాత పాలకుర్తి నియోజకవర్గానికి మారిన ఆయన అక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్లీ టీడీపీ నుంచే పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2016లో బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి 2018లో బీఆర్‌ఎస్ టికెట్ మీద పోటీ చేసి గెలిచి, మంత్రి అయ్యారు. ఈసారి యశస్విని చేతిలో ఆయనకు ఓటమి ఎదురైంది.

50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గంలో పోటీచేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి 50,703 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి 1,06,400 ఓట్లు, ఇంద్రకరణ్ రెడ్డికి 55,697 ఓట్లు పోలయ్యాయి.

2018లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీద ఇంద్రకరణ్ గెలిచారు. అప్పుడు ఇంద్రకరణ్‌కు 79,985 ఓట్లు వచ్చాయి.

ఇంద్రకరణ్ రెడ్డి 1991-96 వరకు ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. తర్వాత వరుసగా రెండు పర్యాయాలు నిర్మల్ ఎమ్మెల్యేగా పనిచేసి 2008లో కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో ఆదిలాబాద్, రెండో ఎన్నికల్లో నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.

22 వేల ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ పరాజయం

ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు.

కొప్పుల ఈశ్వర్‌పై కాంగ్రెస్ నాయకుడు అడ్లూరి లక్ష్మణ్ రావు 22 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

కాంగ్రెస్‌కు 91,393 ఓట్లు పోలవ్వగా, కొప్పుల ఈశ్వర్‌కు 69,354 ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకుడు ఎస్. కుమార్‌కు 7,345 ఓట్లు పోలయ్యాయి.

2018లో కొప్పుల ఈశ్వర్ 441 ఓట్ల స్వల్ప మెజార్టీతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై నెగ్గారు.

తుమ్మల చేతిలో 34 వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఓటమి

ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 34,134 ఓట్ల తేడాతో కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు చేతిలో ఓడిపోయారు.

తుమ్మలకు 99,528 ఓట్లు రాగా, పువ్వాడకు 65,394 ఓట్లు పడ్డాయి.

జనసేన పార్టీ నాయకుడు మిరియాల రామకృష్ణకు 2,846 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నాయకుడు కావడం ఆ పార్టీకి కలిసొచ్చింది.

తుమ్మల, పువ్వాడ ఇద్దరూ కమ్మవారే కావడంతో ఇక్కడ పోరు ఆసక్తిని పెంచింది.

తుమ్మల గతంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కేసీఆర్ క్యాబినెట్‌లలో మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో సత్తుపల్లి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి మారి 2009లో గెలుపొందారు.

తర్వాత రాంరెడ్డి వెంకట రెడ్డి మృతితో పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల గెలిచారు. అయితే, 2018లో పాలేరులో ఓటమి పాలయ్యారు.

తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడపై గెలిచారు.

25 వేల ఓట్ల తేడాతో నిరంజన్ రెడ్డి పరాజయం

వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓడిపోయారు.

ఆయనపై కాంగ్రెస్ నాయకుడు టి. మేఘారెడ్డి 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గారు.

నిరంజన్ రెడ్డికి 81,795, మేఘారెడ్డికి 1,07,115, బీజేపీ అభ్యర్థి అనుజ్ఞ రెడ్డికి 9,185 ఓట్లు పోలయ్యాయి.

18 వేల ఓట్ల తేడాతో శ్రీనివాస్ గౌడ్‌ ఓటమి

మహబూబ్‌నగర్‌లో మంత్రి వి.శ్రీనివాస గౌడ్‌ 18,738 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస రెడ్డికి 87వేల పైచిలుకు ఓట్లు రాగా, శ్రీనివాస్ గౌడ్‌కు 68,489 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ నాయకుడు మిథున్ కుమార్ రెడ్డికి 19,919 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)