లోక్‌సభలో భద్రతా వైఫల్యం: ఎంపీల మధ్యలోకి దూకిన ఆ ఇద్దరు వీరే

పార్లమెంటుపై దాడి జరిగిన 22 సంవత్సరాలు పూర్తయిన రోజునే మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్యాస్ విడుదల చేసే పరికరాలతో సహా విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం సంచలనం సృష్టించింది.

లోక్‌సభలో జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా వెంటనే సభను వాయిదా వేశారు.

దాడి ఘటనలో భద్రతా బలగాలు నలుగురిని అరెస్టు చేశాయి. వీరిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారు.

వీరిలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఎంపీల మధ్యలోకి దూకిన వారి పేర్లు సాగర్ శర్మ, మనోరంజన్ అని అధికారులు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

''వారి నేపథ్యం గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం. సాగర్ శర్మ మైసూరుకు చెందిన వ్యక్తి. ఆయన బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేస్తున్నారు. మనోరంజన్‌ది కూడా మైసూరే'' అని ఒక అధికారి చెప్పారు.

పట్టుబడిన వారి గురించి మరింత సమచారం రాబట్టడానికి ఐబీ, స్థానిక పోలీసుల బృందం వారి ఇళ్లకు చేరుకున్నాయని ఆయన వివరించారు.

ఇద్దరి ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, వారికి ఏ సంస్థతో సంబంధం ఉందో తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోందన్నారు. విజిటర్ గ్యాలరీ చేరుకోడానికి ముందు వాళ్లు ఎక్కడెక్కడ నుంచి వెళ్లారో ఆ చెక్ పాయింట్ల సీసీటీవీ ఫుటేజి తెప్పించుకుని పరిశీలిస్తున్నామని కూడా తెలిపారు.

అసలేం జరిగింది?

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకారని పలువురు ఎంపీలు వెల్లడించారు. వీరి చేతిలో గ్యాస్‌ను విడుదల చేసే పరికరాలు ఉన్నాయని, వాటి నుంచి పసుపు రంగు గ్యాస్ విడుదలవుతున్నట్లు కొందరు లోక్‌సభ సభ్యులు వెల్లడించారు.

దుండగుల చేతిలో పరికరాల నుంచి విడుదలైన గ్యాస్ విషపూరితమైనది కావచ్చని కాంగ్రెస్ సభ్యుడు కార్తీ చిదంబరం అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి స్పీకర్ సీటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు.

ఈ ఆగంతకులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకు వచ్చారని కూడా కార్తీ చిదంబరం వెల్లడించారు.

విజటర్ గ్యాలరీ నుంచి దూకిన ఇద్దరు ఆగంతకులను కొందరు పార్లమెంటు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి తెలిపారు.

ఓ వ్యక్తి సభ్యుల టేబుల్స్ మీదుగా దూకుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. సభ బయట కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తుండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా వీడియోలు మీడియా చానళ్లలో ప్రసారమయ్యాయి.

ఆగంతకుల దాడి ప్రయత్నంతో సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

ప్రమాదకర గ్యాస్ కాదు: స్పీకర్ ఓం బిర్లా

ఈ ఘటనతో పార్లమెంటు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు. ఇద్దరు వ్యక్తులు లోకసభలో చొరబడటం, గ్యాస్ లీక్ చేసే ప్రయత్నం చేయడం కచ్చితంగా భద్రతా లోపమేనని కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ అజ్లా వ్యాఖ్యానించారు.

ఈ ఘటన కచ్చితంగా భద్రతాలోపమేనని బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ అన్నారు. ఘటన జరిగిన సమయంలో రాజేంద్ర అగర్వాల్ సభకు అధ్యక్షత వహిస్తున్నారు.

మొదట ఒక వ్యక్తి కిందికి దూకినప్పుడు గ్యాలరీ నుంచి జారి పడ్డారని భావించామని, ఆ తర్వాత రెండో వ్యక్తి దూకారని, మొదటి వ్యక్తి చేతిలో ఉన్న పరికరాల నుంచి పసుపు రంగు గ్యాస్ విడుదల కావడం మొదలైందని రాజేంద్ర అగర్వాల్ వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కలకలం అనంతరం సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు.

సభ జీరో అవర్‌లో ఈ ఘటన జరిగిందని, బాధ్యులైన వారి గురించి దిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చామని స్పీకర్ వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఈ గ్యాస్ ప్రమాదకరమైనది కాదని, ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన అన్నారు.

లోక్‌సభ బయట అరెస్టైన నీలమ్ ఎవరు?

లోక్‌సభ బయట కలర్ స్మోక్ వదిలారంటూ నీలమ్‌, అమోల్‌ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు నీలమ్‌ను విచారిస్తున్నారు.

నీలమ్ తల్లి ఏఎన్ఐతో మాట్లాడారు. ఉద్యోగం దొరక్కపోవడం వల్ల కూతురు నైరాశ్యంలో ఉందని చెప్పారు.

''ఆమె ఉద్యోగం లేదని చాలా బాధపడుతోంది. నేను ఆమెతో మాట్లాడా. నాకు దిల్లీ వెళుతున్నట్లు చెప్పలేదు. ఇంత చదువుకున్నా ఉద్యోగం లేదు, దీనికంటే చావడమే మేలు అని నాతో చెప్పింది'' అని నీలమ్ తల్లి అన్నారు.

''మా అన్న నాకు ఫోన్ చేసి టీవీ ఆన్ చెయ్. నీలమ్ అరెస్టయ్యింది అన్నాడు'' అని నీలమ్ తమ్ముడు చెప్పారు.

‘‘తను దిల్లీ వెళ్లిందనే విషయం కూడా మాకు తెలీదు. తన చదువుకు సంబంధించి ఆమె హిసార్ వెళ్లిందని తెలుసు. మొన్న ఇంటికి వచ్చింది, నిన్న తిరిగి వెళ్లిపోయింది. తను బీఏ, ఎంఏ, బీఎడ్, ఎంఎడ్, సీటీఐ, ఎంఫిల్ చదివింది, నెట్ పరీక్షకూ క్వాలిఫై అయ్యింది. ఎన్నోసార్లు నిరుద్యోగ సమస్య లేవనెత్తింది. రైతు ఉద్యమంలో కూడా పాల్గొంది'' అని ఆయన చెప్పారు.

కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ, ''మేం పాలు అమ్ముతాం. మా నాన్న స్వీట్ షాప్ వ్యాపారి'' అని అన్నారు.

పార్లమెంటుపై దాడికి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సహా పలువురు మంత్రులు, ఎంపీలు ఆనాటి ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.

అది జరిగిన కొన్ని గంటలకే ఆగంతకులు లోక్‌సభలో ప్రవేశించడం చర్చనీయాంశం అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)