You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నదియా: బాలీవుడ్ సినిమాల్లో మగాళ్లకు ధీటుగా స్టంట్స్ చేసి ఉర్రూతలూగించిన ఈ విదేశీ మహిళ ఎవరు?
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
‘‘నా చిన్నతనంలో నాకు గుర్తున్న ముఖ్యమైన సీన్ నదియా గుర్రం మీద కూర్చుని చేయి ఊపుతూ ‘హేయ్’ అని అరుస్తూ విలన్ల మీద దూకడం’’ అని ప్రఖ్యాత నాటక రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ 1980లో రాశారు.
‘‘ నలభైలలో స్కూలు పిల్లలకు నదియా అంటే ధైర్యం, బలం, ఒక ఆదర్శం" అని తెలిపారాయన.
నటి, స్టంట్ మహిళ అయిన మేరీ ఆన్ ఎవాన్స్.. 'ఫియర్‌లెస్ నదియా' పేరుతో బాగా ప్రసిద్ది చెందారు.
ఆమె మొదటిసారి 1935లో హిందీ చిత్రం హంటర్‌వాలి (ది ఉమెన్ విత్ ఎ విప్) ద్వారా పరిచయమై, బాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
ఆస్ట్రేలియా మూలాలున్న ఈ నీలి కళ్ల అందగత్తె ఎవాన్స్, చేతిలో కొరడాతో క్యాప్, లెదర్ షార్ట్, మోకాలి ఎత్తులో ఉన్న బూట్‌లలో తెరపై కనిపించి సందడి చేశారు.
ఎవాన్స్ 1908లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జన్మించారని, ఆమె తల్లి గ్రీకు, తండ్రి బ్రిటీష్ అని 'బాంబే బిఫోర్ బాలీవుడ్' రచయిత రోసీ థామస్ తెలిపారు.
ఆర్మీలో పనిచేసే తండ్రితో పాటు ఎవాన్స్ 1911లో ఇండియాకు వచ్చారు, తండ్రి మరణం తర్వాత ఆమె కుటుంబంతో కలిసి ముంబయిలో స్థిరపడ్డారు.
ఆమె డ్యాన్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారని థామస్ తెలిపారు. రష్యన్ బ్యాలెట్ బృందంతో కలిసి ఆమె ఇండియాలో ప్రదర్శనలు ఇచ్చారు.
కొంతకాలం సర్కస్ ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రకాల వేదికలలో ప్రదర్శనలు ఇస్తూ ఎవాన్స్ గాయకురాలిగా, డ్యాన్సర్‌గా పేరు పొందారు.
బాలీవుడ్‌లో ఎలా అవకాశం దక్కింది?
1930ల ప్రారంభంలో థియేటర్, సర్కస్‌లో పని చేస్తుండగా ఆమెను ప్రముఖ బాలీవుడ్ చలనచిత్ర దర్శకుడు జేబీహెచ్ వాడియా చూశారు.
వాడియా తన సోదరుడు హోమీతో కలిసి వాడియా మూవీటోన్ స్టూడియో పేరుతో చిత్రాలు నిర్మించేవారు. మొదట్లో ఎవాన్స్‌కు వారి చిత్రాలలో చిన్న పాత్రలు ఇచ్చారు.
ఎవాన్స్ స్టంట్స్ చేయడంలో దిట్ట. ఆమెకు ఏదైనా చేయగలననే నమ్మకముండేదని జేబీహెచ్ వాడియా మనవడు రాయ్ వాడియా చెప్పారు.
ఆమె ప్రతిభ గమనించిన వాడియా సోదరులు ఆమెకు హంటర్‌వాలి చిత్రంలోని ప్రధాన పాత్రను పోషించే అవకాశం ఇచ్చారు.
ఇందులో కోర్టు అధికారి చేతిలో హత్యకు గురైన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకొనే కూతురిగా ఎవాన్స్ నటించారు. ఇందులో ఎవాన్స్ ముసుగు వేసుకున్న యువరాణిలా కనిపిస్తారు.
ఎవాన్స్ ప్రతిభపై వాడియా సోదరులు నమ్మకంగా ఉన్నప్పటికీ, ఆ సినిమాని ఇతర భాగస్వాములు కొద్దిగా ఆందోళన చెందారు.
"ఈ పార్సీ సోదరులు తీసుకున్న నీలికళ్ల తెల్లటి అందగత్తె ప్యాంటు, తోలు చొక్కాలు ధరించి, కొరడా పట్టుకుని సినిమాలోని విలన్లను కొట్టేస్తుందా? అని చిత్ర ఫైనాన్షియర్లు చాలా భయపడ్డారు" అని రాయ్ వాడియా చెప్పారు.
దీంతో వాడియా సోదరులే సినిమాను విడుదల చేశారు. 1935లో ఈ చిత్రం భారీ విజయం సాధించింది. థియేటర్లలో వారాల పాటు హౌస్‌ఫుల్‌గా నడిచింది.
థామస్ ప్రకారం 1930లు, 1940లలో ఎవాన్స్ టాప్ బాక్సాఫీస్ మహిళా స్టార్‌గా నిలిచారు.
అంతేకాదు ఈ చిత్ర విజయం 'వాడియా మూవీటోన్' స్టూడియోను అద్భుతమైన స్టంట్స్, థియేట్రికల్ చిత్రాలకు ఫేమస్ ఇనిస్టిట్యూట్‌గా మార్చింది. హంటర్‌వాలిలో బాగా పాపులర్ అయిన ఎవాన్ డైలాగ్ "హే-య్-య్" అందరి నోటిలోనూ నానింది.
స్వాతంత్య్ర ఉద్యమంలో తన వంతు..
"భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో విముక్తి , స్వాతంత్య్ర పోరాటం, చదువుల కోసం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలు ఆమె కోసం మా తాత సృష్టించారు" అని రాయ్ వాడియా చెప్పారు.
1930, 1940లలో కఠినమైన బ్రిటిష్ సెన్సార్‌షిప్ ఉండేది. దీంతో స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధిత సీన్లపై కత్తిరింపులుండేవని, అయినా కూడా చిత్రనిర్మాతలు ఉద్యమ పాటలు, గుర్తులను చిత్రంలో ఏదో ఒక రూపంలో పెట్టేవారని థామస్ తెలిపారు.
నదియా పోషించిన చాలా పాత్రలు జాతీయోద్యమానికి మద్దతుగా ఉన్నాయని చెప్పారు. ఆమె చిత్రాలలో ప్రజలు చదువుకోవాలని, భారత్ బలమైన దేశంగా మారాలని సందేశాలు ఉండేవని చెప్పారు.
సొంతంగానే స్టంట్స్
ఎవాన్స్ సినిమాల్లో చాలావరకు విలన్లతో పోరాడే మహిళగానే నటించారు.
"జలపాతాలు, విమానాల నుంచి దూకడం, గుర్రాలను స్వారీ చేయడం, షాండ్లియర్స్‌కు వేలాడుతూ తిరగడం, కోట పైకప్పు నుంచి (30 అడుగుల ఎత్తు) నుంచి దూకడం. ఇలాంటి చాలా విన్యాసాలు ఆమె స్వయంగా చేశారు" అని రాయ్ వాడియా చెప్పారు.
"ఆ రోజుల్లో సేఫ్టీ నెట్స్ లేవు, డూప్స్ లేరు, ఇన్సూరెన్స్ కూడా లేదు" అని అన్నారు రాయ్.
ఎవాన్స్ నటనలో చైతన్యం, విన్యాసాలు తెరపై ప్రేక్షకులను ఆకర్షించాయి. కానీ ఆమె చేసినవి సులభమైన సాహసాలేం కాదు.
1980లో కర్నాడ్‌కి ఎవాన్స్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా షూటింగ్‌లలో ఎదుర్కొన్న భయానక క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
జంగిల్ ప్రిన్సెస్ (1942) చిత్రంలో సింహంతో ఎవాన్స్ సీన్ చేయాలి.
"మేం షూటింగ్ ప్రారంభించాం, అకస్మాత్తుగా సుందరి అనే సింహం బోను నుంచి పెద్దగా గర్జిస్తూ బయటికి రావడానికి ప్రయత్నించింది. అది బోనులో నుంచి తల ముందు కాళ్లను బయటకు పెట్టి నా మీదకు, హోమీ(దర్శకుడు, నిర్మాత) మీదకు, కెమెరామెన్ మీదకు దూకేందుకు ప్రయత్నించింది.’’ అని ఆమె చెప్పారు. చివరకు ట్రైనర్ దాన్ని మళ్లీ లోపలకు పంపించారు.
ప్రేమ, పెళ్లి
ఎవాన్స్ చిత్రాలు పరిశీలిస్తే ఆమె పాశ్చాత్య వేషధారణ నుంచి భారతీయ వస్త్రధారణకు సులభంగా మారారని తెలుస్తుంది.
"ఆమెను చూస్తే నవ్వుతూ, మెరుస్తున్న కళ్లతో ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందని అనుకుంటారందరు. కానీ ఆమె అన్ని సినిమాల్లోనూ ఒకే వ్యక్తిగా కనిపిస్తారు" అని రాయ్ వాడియా చెబుతున్నారు.
నిజజీవితంలో ఎవాన్స్ ప్రేమలోనూ పడ్డారు, హోమీ వాడియాని ఇష్టపడ్డారు. అయితే, ఇరువురి ప్రేమను వాడియా కుటుంబంలో చాలామంది ఒప్పుకోలేదు.
ఈ జంటకు సోదరుడు జేబీహెచ్ వాడియా మద్దతుగా నిలిచారు. వాడియా తల్లి మరణించిన తర్వాత ఇరువురు వివాహం చేసుకున్నారు.
ఎవాన్స్‌ను ఒక డౌన్ టు ఎర్త్, గొప్ప హాస్య చతురత గల మహిళగా గుర్తుంచుకుంటారు రాయ్ వాడియా.
"ఆమె చాలా బాగా నవ్వేవారు, జోక్స్ వేసేవారు. అందులో కొంటె జోకులు కూడా ఉండేవి" అని తెలిపారు రాయ్.
ప్రతి ఏడాది ఎవాన్స్, హోమీ వాడియా జుహూలోని వారి ఇంటిలో క్రిస్మస్ పార్టీని జరుపుకొనేవారు. అక్కడ కంపెనీ సహోద్యోగులు, కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల వరకు అందరినీ పలకరించేవారు.
"హోమీ శాంతా క్లాజ్ మాదిరి వేషం వేసుకుని కనిపించేవారు. మేరీగా ఎవాన్స్ అలరించేవారు" అని రాయ్ వాడియా తెలిపారు.
ఈ జంటకు పిల్లలు లేరు. అయితే ఎవాన్స్‌కు అంతకుముందే కొడుకున్నాడు. ఆ అబ్బాయిని హోమీ వాడియా దత్తత తీసుకున్నారు.
88 ఏళ్ల వయసులో 1996లో ఎవాన్స్ మరణించారు. ఎవాన్స్ బహుశా బాలీవుడ్‌లో కల్ట్ నటిగా పేరు పొందిన మొదటి విదేశీ మహిళ.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా జలాల వివాదం: సాగర్, శ్రీశైలం కేఆర్ఎంబీకి ఇవ్వకూడదని తెలంగాణ చేసిన తీర్మానంతో ఏం జరగనుంది.. తెలంగాణకు లాభమా, నష్టమా?
- ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు
- నరేంద్ర మోదీ నుంచి‘‘బ్రాండ్ మోదీ’’ వరకు..
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే..
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)