ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు

    • రచయిత, విక్టోరియా గిల్, కేట్ స్టీఫెన్స్
    • హోదా, బీబీసీ న్యూస్

స్టీవ్ అనే 24 ఏళ్ల కెన్యా యువకుడు రోజు గాడిదలపై నీటిని తీసుకెళుతుంటారు. అతనికి అదే జీవనాధారం. రోజు 20 క్యాన్లను కస్టమర్ల కోసం తీసుకెళ్లేవారు స్టీవ్. అయితే ఒకరోజు ఆ గాడిదలు కనిపించలేదు.

రోజూలాగే పొలాల్లో ఉన్న గాడిదలను తీసుకురావడానికి ఉదయాన్నే స్టీవ్ నైరోబి శివార్లలో ఉన్న ఇంటి నుంచి బయలుదేరారు. కానీ, అప్పటికే గాడిదలను ఎవరో దొంగిలించారు.

‘ఆ రోజంతా, మరుసటి రోజు కూడా వెతికాను’ అని స్టీవ్ అన్నారు.

మూడు రోజుల తర్వాత గాడిదల అస్థిపంజరాలు దొరికాయని స్టీవ్‌కు ఆయన స్నేహితుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

''వాటిని చంపేశారు, వధించారు, వాటి చర్మం కూడా అక్కడ లేదు'' అని గుర్తుచేసుకున్నారు స్టీవ్.

అయితే ఆ గాడిదలను ఎందుకు చంపారు?

గాడిదలతో ఏం చేస్తారు?

ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో గాడిదలను దొంగిలిస్తుంటారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగే 'వివాదాస్పద వాణిజ్యానికి' స్టీవ్ గాడిదలూ బలయ్యాయి.

దీని మూలాలు అక్కడి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నాయి.

చైనాలో గాడిద చర్మంలోని జెలటిన్‌తో తయారయ్యే సంప్రదాయ ఔషధానికి అధిక డిమాండ్ ఉంది. దీనిని ఎజియావో అంటారు.

దీనికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, యవ్వనత్వాన్ని సంరక్షించే లక్షణాలున్నాయని భావిస్తారు.

ఈ జెలటిన్‌ను సేకరించడానికి గాడిద చర్మాలను ఉడకబెడతారు. అనంతరం దానితో పొడి, మాత్రలు లేదా ద్రవం తయారు చేస్తారు, ఆహారంలోనూ కలుపుతారు.

ఎజియావో ఔషధానికి ఉన్న డిమాండ్‌తో స్టీవ్ వంటి గాడిదల యజమానులు బాధితులుగా మారుతున్నారని ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న క్యాంపెయినర్లు చెబుతున్నారు.

డాంకీ శాంక్చురీ సంస్థ 2017 నుంచి ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.

ఈ వ్యాపారం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కనీసం 59 లక్షల గాడిదలను వధిస్తున్నట్లు ఆ సంస్థ తన రిపోర్టులో తెలిపింది.

బీబీసీ ఆ గణాంకాలను ధ్రువీకరించలేకపోయింది, అయితే, గాడిదలకు డిమాండ్ మాత్రం పెరుగుతోందని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

అయితే, ఎజియావో కోసం ఎన్ని గాడిదలు చంపారో కచ్చితమైన గణాంకాలను పొందడం చాలా కష్టం.

ఆఫ్రికా నుంచే ఎందుకు?

ప్రపంచంలోని 5.3 కోట్ల గాడిదల్లో మూడింట రెండొంతులు ఆఫ్రికాలోనే ఉన్నాయి. అయితే, అక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి.

గాడిద చర్మాల ఎగుమతి చాలా దేశాల్లో చట్టబద్ధం, మరికొన్ని దేశాల్లో చట్టవిరుద్ధం.

కానీ గాడిదల చర్మానికి ఉన్న అధిక ధర, డిమాండ్ వాటి దొంగతనాలకు ఆజ్యం పోస్తున్నాయి.

ఈ వ్యాపారం చట్టబద్ధమైన ప్రదేశాల్లో చేయడానికి గాడిదలను అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా తరలిస్తున్నట్లు డాంకీ శాంక్చురీ తెలిపింది.

గాడిదల సంఖ్య తగ్గిపోతుండటంతో ఆఫ్రికన్, బ్రెజిల్ ప్రభుత్వాలు వాటి ఎగుమతులతో పాటు వధించడంపై నిషేధానికి ప్రయత్నిస్తున్నాయి.

డాంకీ శాంక్చురీ కోసం పని చేస్తున్న నైరోబిలో ఉన్న సోలమన్ ఒన్యాంగో మాట్లాడుతూ.. "2016, 2019 మధ్య కాలంలో కెన్యా గాడిదల్లో సగం గాడిదలను చర్మ కోసం వధించారని అంచనా" అని అన్నారు.

వస్తువులు, నీరు, ఆహారం రవాణాలో గాడిదలు పేద, గ్రామీణ వర్గాలకు వెన్నెముక వంటివి. కాబట్టి చర్మ వ్యాపారం, దాని వేగవంతమైన పెరుగుదల క్యాంపెయినర్లను, నిపుణులను అప్రమత్తం చేసింది.

గాడిదల చర్మ వ్యాపార వ్యతిరేక ప్రదర్శనలలో పాల్గొనేలా కెన్యాలో చాలామంది ప్రజలను కదిలించింది.

ఫిబ్రవరి 17, 18 తేదీలలో ఆఫ్రికన్ యూనియన్ సదస్సు జరగనుంది. ఆఫ్రికావ్యాప్తంగా గాడిదలను వధించడంపై నిరవధిక నిషేధం విధించాలనే ప్రతిపాదన ఈ సదస్సు అజెండాలో ఉంది.

ఆఫ్రికా వ్యాప్త నిషేధంపై స్టీవ్ స్పందిస్తూ ఇది జంతువులను రక్షిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. లేకపోతే "తదుపరి తరానికి గాడిదలు ఉండవు" అని ఆయన అంటున్నారు.

అయితే, ఆఫ్రికా, బ్రెజిల్‌లో నిషేధం ఈ వాణిజ్యాన్ని వేరే చోటికి మారుస్తాయా?

చైనాలో తగ్గిన గాడిదలు

ఎజియావో తయారీదారులు మొదటగా చైనాలో లభించే గాడిద చర్మాలనే ఉపయోగించేవారు.

కానీ, 1990లో దేశంలోని గాడిదల సంఖ్య 1.1 కోట్ల నుంచి 2021 నాటికి కేవలం 20 లక్షలకు పడిపోయిందని అక్కడి వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

అదే సమయంలో ఎజియావో విస్తృతంగా ప్రజాదరణ పొందింది. దీంతో చైనీస్ కంపెనీలు చర్మ కోసం విదేశాలను ఆశ్రయించాయి. అనంతరం ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా ప్రాంతాలలో గాడిద కబేళాలు వెలిశాయి. ఇది ఆఫ్రికాలో వాణిజ్య పోటీకి దారితీసింది.

అయితే, ఇథియోపియాలో గాడిద మాంసపై నిషేధముంది. 2017లో ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిరసనలు తెలపడంతో అక్కడ రెండు కబేళాలలో ఒకటి మూసివేశారు.

టాంజానియా, ఐవరీ కోస్ట్‌తో సహా పలు దేశాలు 2022లో గాడిద చర్మాలను తొలగింపు, ఎగుమతులపై నిషేధం విధించాయి.

అయితే చైనా పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఈ వ్యాపారంపై ఆసక్తి చూపింది. గత సంవత్సరం చివర్లో కొన్ని ఉత్తమ జాతుల గాడిదలను పెంచడానికి దేశంలోని మొట్టమొదటి అధికారిక గాడిద పెంపకం క్షేత్రం గురించి అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.

చైనాలోని ఎజియావో మార్కెట్ విలువ 2013లో సుమారు రూ. 26 వేల కోట్ల నుంచి 2020 నాటికి రూ. 64 వేల కోట్లకు పెరిగిందని యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన చైనా-ఆఫ్రికా సంబంధాల స్కాలర్ ప్రొఫెసర్ లారెన్ జాన్స్టన్ అంచనా.

ఇది ప్రజారోగ్య అధికారులు, జంతు సంక్షేమ ప్రచారకులు, అంతర్జాతీయ నేరాలను పరిశోధించే వారికి కూడా ఆందోళన కలిగించింది.

ఇతర వన్యప్రాణుల ఉత్పత్తులను రవాణా చేయడానికి ఈ గాడిద చర్మాలను ఉపయోగిస్తున్నారని వారి పరిశోధనలో తేలింది.

గాడిదలకు ప్రత్యేక లక్షణం

"నా కమ్యూనిటీలోని చాలామంది చిన్న తరహా రైతులే. వారు తమ వస్తువులను విక్రయించడానికి గాడిదలను ఉపయోగిస్తారు" అని స్టీవ్ చెప్పారు.

స్కూల్ ఫీజు చెల్లించడం నుంచి మెడిసిన్​ చదవడం వరకు తన జీవిత అవసరాల కోసం స్టీవ్​ గాడిదలపై నీరు అమ్ముతూ డబ్బు సంపాదించారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో గ్రామీణ జీవితంలో గాడిదలు ఉన్నాయని డాంకీ శాంక్చురీకి చెందిన ఫెయిత్ బర్డెన్ చెప్పారు. ఇవి బలమైన, అనుకూలమైన జంతువులని అన్నారు.

"ఒక గాడిద 24 గంటలు నీరు తాగకుండానే ఉండగలదు, ఎటువంటి సమస్యలు లేకుండా చాలా త్వరగా రీహైడ్రేట్ కాగలదు" అని ఫెయిత్​ అన్నారు.

గాడిదలు సులభంగా లేదా త్వరగా సంతానోత్పత్తి చేయవు. అందుకే వీటి చర్మ వ్యాపారాన్ని తగ్గించకపోతే గాడిదల సంఖ్య తగ్గిపోతుందని, పేద ప్రజలకు జీవనాధారం లేకుండా పోతుందని క్యాంపెయినర్లు భయపడుతున్నారు.

గాడిదలను సామూహిక వధ కోసం ఎన్నడూ పెంచలేదని ఒన్యాంగో అంటున్నారు.

గాడిదలు వేల ఏళ్లుగా పేదలను మోశాయని ప్రొఫెసర్ జాన్స్టన్ అన్నారు. అవి పిల్లలు, మహిళలను కూడా మోసుకెళ్లాయని గుర్తుచేశారు.

జీవనోపాధి పోయింది: స్టీవ్

గాడిదలను పోగొట్టుకోవడంతో తన జీవితం, జీవనోపాధిపై దెబ్బ పడిందని స్టీవ్ ఆందోళన వ్యక్తంచేశారు, ఒంటరైపోయానని అన్నారు.

బ్రూక్ అనే స్వచ్ఛంద సంస్థ నైరోబీలోని స్థానిక జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ పోయిన గాడిదలను వెతకడానికి కృషి చేస్తోంది.

గాడిదలను రక్షించడానికి ఎక్కువ దేశాలు చట్టాన్ని రూపొందించినట్లయితే చర్మం కోసం గాడిదలు దొరకడం కష్టమవుతుందని డంకీ సాంచ్యురీకి చెందిన జాన్నెకే మెర్క్స్ అభిప్రాయపడ్డారు.

"ఎజియావో కంపెనీలు గాడిద చర్మాలను దిగుమతి చేసుకోవడం మానేసి, సెల్యులార్ అగ్రికల్చర్ (ల్యాబ్‌లలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడం) వంటి స్థిరమైన ప్రత్యామ్నాయాలలో పెట్టుబడి పెట్టాలి. దానికోసం సురక్షితమైన, సమర్థవంతమైన మార్గాలు ఉన్నాయి" అని జాన్నెకే మెర్క్స్ సూచించారు.

గాడిద చర్మ వ్యాపారాన్ని అమానవీయమైనదిగా డంకీ సాంచ్యురీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫెయిత్ బర్డెన్ అభివర్ణించారు.

"వాటిని దొంగిలిస్తున్నారు, వందల మైళ్లు నడిపిస్తున్నారు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంచుతున్నారు. ఇతర గాడిదలు చూస్తుండగానే వధిస్తున్నారు" అని ఫెయిత్ బర్డెన్ చెప్పారు.

"దీనికి వ్యతిరేకంగా మనం గళమెత్తాల్సిన అవసరం వారికి ఉంది" అని పిలుపునిచ్చారు ఫెయిత్.

బ్రూక్ సంస్థ స్టీవ్‌కి ఒక కొత్త గాడిదను ఇచ్చింది, దానికి జాయ్ లక్కీ అని పేరు పెట్టారు స్టీవ్. ఎందుకంటే అతను దాన్ని పొందడం అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నారు.

"నా కలలను సాధించడంలో అది నాకు సహాయం చేస్తుంది" అని స్టీవ్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)