You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మాంసం బియ్యం: ఈ హైబ్రిడ్ బియ్యం తింటే, మాంసం తిన్నట్లే...
- రచయిత, మిచెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇకపై మాంసం తినడానికి జంతువులను చంపాల్సిన పనిలేదు. జస్ట్ ఓ కుక్కర్ లో బియ్యం ఉడికిస్తే చాలు. మాంసం రెడీ. ఇదేంటి బియ్యం ఉడికిస్తే మాంసం ఎలా అవుతుందనే సందేహమే అక్కరలేదు.
శాస్త్రవేత్తలు ఇప్పుడు మాంసంలాంటి హైబ్రిడ్ బియ్యాన్ని ప్రయోగశాలలో పండించారు. ఇది చౌక, పర్యావరణ హితమని వారు చెబుతున్నారు.
ఈ బియ్యం గింజలలో పశు మాంసం, కొవ్వు కణాలు ఉండేలా ప్రయోగశాలలో సాగు చేస్తారు.
ఇందు కోసం ముందుగా బియ్యపు గింజలకు చేపల నుంచి తీసిన జిగరులాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తరువాత వాటిని 11 రోజులపాటు ఓ పాత్రలో సాగు చేస్తారు.
ఇటువంటి ఆహారం కరువు వచ్చినప్పుడు, సైనిక అవసరాలు తీర్చేందుకు, లేదంటే అంతరిక్షంలో గడిపే వారికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, ఇటువంటి మాంసం బియ్యం మార్కెట్లోకి వస్తే ప్రజలు దీనిని ఎలా ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్న.
ఈ హైబ్రిడ్ బియ్యం సాధారణ బియ్యంతో పోల్చితే కొంచెం పెళుసుగా ఉంటుంది, కానీ ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయని మేటర్ జర్నల్ కథనం తెలిపింది.
దక్షిణ కొరియాలోని యోన్‌సై యూనివర్సిటీకి చెందిన బృందం ఈ బియ్యంలో మాంసకృత్తులు 8శాతం అధికంగానూ, ఏడుశాతం కొవ్వు ఎక్కువగానూ ఉంటుందని తెలిపింది.
సాధారణ పశు మాంసంతో పోల్చి చూసినప్పుడు, ఇందులో కర్బన ఉద్గారాలు చాలా తక్కువ స్థాయులో ఉంటాయి. దీనివల్ల పెద్ద సంఖ్యలో పశుపోషణ చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది.
హైబ్రిడ్ రైస్‌లో ప్రతి 100 గ్రాముల (3.5 ఔన్సుల) ప్రొటీన్ 6.27 కేజీ (13.8 పౌన్లు)ల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. కానీ పశుమాంస ఉత్పత్తిలో 8 రెట్లు ఎక్కువగా కర్బన ఉద్గారాలు విడుదల అవుతాయని వారు చెప్పారు.
‘‘సాధారణంగా మనకు కావాల్సిన ప్రొటీన్ పశుమాంసం నుంచే వస్తుంది. కానీ పశు మాంస ఉత్పత్తికి పెద్ద ఎత్తున వనరులు, నీటి అవసరం ఉంటుంది. పైగా కర్బన ఉద్గారాలు భారీ ఎత్తున విడుదల అవుతాయి’’ అని పరిశోధకురాలు సోహ్యోన్ పార్క్ వివరించారు.
‘‘మనకు కావాల్సిన పోషకాలన్నీ సాగుచేసిన ప్రొటీన్ బియ్యం నుంచి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. బియ్యంలో అధికమోతాదు పోషకాలు ఉంటాయి. అయితే దానికి అదనంగా మాంసకణాలను జత చేస్తే అవి మరింత పోషకాలను అందిస్తాయి’’
‘‘బియ్యం గింజలలో మాంస కణాలు పెరుగుతాయని నేను ఊహించలేదు. ఇప్పుడు ఈ హైబ్రిడ్ బియ్యానికి పుష్కలమైన అవకాశాలున్న ప్రపంచం నా కళ్ళ ముందు కనిపిస్తోంది’’ అని ఆమె చెప్పారు.
ప్రజలు సానుకూలంగా స్పందిస్తారా?
బియ్యపు గింజల నిర్మాణం మాంసపు కణాలు పెరిగేందుకు అనువుగా ఉంటుంది. పైగా అవి వాటికి పోషకాలను కూడా అందిస్తాయి.
అయితే ప్రయోగశాలలో మాంసం ఉత్పత్తులను సాగుచేయడమేనేది ఈ బృందంతోనే మొదలవ్వలేదు.
లండన్‌లో 2013లోనే ప్రయోగశాలలో తయారుచేసిన బర్గర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఇలాంటి మాంసాన్ని మార్కెట్‌లోకి తెచ్చేందుకు రేసులోకి దిగాయి.
ప్రపంచంలోనే మొదటిసారిగా సింగపూర్‌లో ఇటీవల ప్రయోగశాలలో తయారుచేసిన కోడిమాంస ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు.
మరోపక్క సంప్రదాయ ఆహార పద్ధతులను రక్షించుకోవడానికి లాబోరేటరీలో తయారుచేసిన మాంసాహారాన్ని నిషేధిస్తూ ఇటలీ ఓ బిల్లును తీసుకువచ్చింది.
లాబోరేటరీలో తయారుచేసిన మాంసంలో ఎటువంటి సింథటిక్ పదార్థాలు ఉండవని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. ఇవి కేవలం సహజమైన మాంస కణాలతోనే తయారవుతాయని చెబుతున్నారు.
ఈస్ట్ అంగాలియా యూనివర్సిటీలో ఆహార, వాతావరణ నిపుణుడు ప్రొఫెసర్ నెయిల్ వార్డ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆరోగ్యకరమైన, వాతావరణ అనుకూల ఆహారాన్ని తయారుచేసుకోవచ్చని ఈ పరిశోధనలు హామీ ఇస్తున్నాయి. కాకపోతే ప్రజలు వీటిని అంగీకరించాల్సి ఉంటుంది అని చెప్పారు.
‘‘ఖర్చు, వాతావరణ ప్రభావం రీత్యా చూసినప్పుడు ఈ సమాచారమంతా చాలా సానుకూలంగా కనిపిస్తోంది. కాకపోతే ప్రజల ఆకలిపై ఈ లాబ్ తయారీ ఆహారపదార్థాలు ఓ కఠిన పరీక్ష లాంటివే’’ అని ఆయన తెలిపారు.
‘‘ఈ లాబ్ తయారీ మాంసం, ప్రాసెస్డ్ మాంసానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.’’
‘‘ప్రజల ఆరోగ్యానికి, వాతావరణానికి కూడా మేలు చేసే ఆహారాన్ని అభివృద్ధి చేయడమనేది ఓ పెద్ద సవాల్. ఈ అధ్యయనం ఓ విన్నూత్న విధానాన్ని ఈ సవాల్‌కు పరిష్కారంగా చూపింది’’ అని బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్‌కు చెందిన బ్రిడ్జెట్ బెనెలెం చెప్పారు.
‘‘ప్రస్తుతం కనుగొన్న విషయాలు బియ్యంలో స్వల్ప పరిమాణంలో మాత్రమే మాంసకృత్తులు పెరగడాన్ని చూపుతున్నాయి. సంప్రదాయ మాంస ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఈ సాంకేతికతను వినియోగించడానికి మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే..
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- కంటి శుక్లాలు ఎందుకొస్తాయి? ఆపరేషన్ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)