You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిరియా నుంచి పారిపోయిన 8 రోజుల తరువాత అసద్ తొలి ప్రకటన.. ఏం చెప్పారంటే
రష్యాకు పారిపోవాలని తాను ఎప్పుడూ అనుకోలేదని సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ చెప్పారంటున్న ఒక ప్రకటన విడుదలైంది.
ఎనిమిది రోజుల క్రితం సిరియాలో రెబల్స్, రాజధాని నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న తరువాత రష్యాకు పారిపోయిన అసద్ నుంచి వచ్చిన తొలి ప్రకటన ఇదే.
సిరియన్ ప్రెసిడెన్సీకి చెందిన టెలిగ్రామ్ చానెల్‌లో సోమవారం అసద్ చేశారంటున్న ఈ ప్రకటన కనిపించింది.
అయితే, ఇప్పుడు ఈ టెలిగ్రామ్ చానల్‌ను ఎవరు నిర్వహిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు.
రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో.. యుద్ధ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి తమకు పట్టున్న లటాకియా ప్రావిన్సులోని రష్యన్ మిలిటరీ బేస్‌కు వెళ్లానని అసద్ చెప్పినట్లుగా ఆ ప్రకటనలో ఉంది.
హమీమిమ్ స్థావరంపైనా డ్రోన్ దాడులు తీవ్రతరం కావడంతో అసద్‌ను విమానంలో మాస్కోకు తీసుకెళ్లాలనని రష్యా నిర్ణయం తీసుకుంది.
''ఈ ఘటనలు జరుగుతున్నంత సేపు కూడా నేను ఎప్పుడు గద్దె దిగిపోవాలని అనుకోలేదు, శరణార్థిగా మారాలనుకోలేదు. అలాంటి ప్రతిపాదనను కూడా ఎవరూ నా ముందుకు తీసుకురాలేదు'' అని అసద్ చేసినట్లుగా చెప్తున్న ఆ ప్రకటనలో ఉంది.
''దేశం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లినప్పుడు, మనం ఏదైనా చేయగలిగే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు చేతిలో ఏ పదవి ఉన్నా ప్రయోజనం లేదు'' అని అసద్ అందులో పేర్కొన్నారు.
కేవలం 11 రోజుల వ్యవధిలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని రెబెల్స్ ఒకదాని తర్వాత మరొక నగరాన్ని చేజిక్కించుకోవడంతో అసద్, ఆయన కుటుంబం రష్యాకు పారిపోవాల్సి వచ్చింది.
రెబెల్స్ గ్రూపులు, సిరియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి.
హెచ్‌టీఎస్, సిరియాలోని అత్యంత శక్తిమంతమైన రెబెల్ గ్రూప్. 2011లో జబాత్ అల్ నుస్రా పేరుతో ఈ తిరుగుబాటు గ్రూపు ఏర్పాటైంది. తర్వాత అల్-ఖైదాకు మద్దతు ప్రకటించింది.
అల్ నుస్రా 2016లో అల్-ఖైదాతో సంబంధాలు తెంచుకొని, ఇతర రెబెల్ గ్రూపులతో కలిసి హెచ్‌టీఎస్‌గా అవతరించింది. అయితే అమెరికా, యూకే, ఐక్యరాజ్యసమితి సహా ఇతర దేశాలు ఈ గ్రూపును తీవ్రవాద గ్రూపుగా వర్గీకరించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)