వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వాడకూడదా? వీటితో ప్రమాదాలు పెరుగుతాయా..

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాత్రిపూట ప్రయాణాల్లో లైట్లే వాహనదారులకు ఆధారం. అది హెడ్‌లైట్ అయినా, బ్రేక్ లైట్ అయినా, పార్కింగ్ లైట్ అయినా.. లైట్ల ద్వారానే వాహన కదలికను అర్ధం చేసుకోవావాల్సి ఉంటుంది.

కానీ, ఆ లైట్ల వల్ల ముఖ్యంగా కొన్ని రకాల ఎల్‌ఈడీ లైట్లున్న వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటారు.

వాహనాల తయారీ సమయంలో అమర్చిన లైట్లు కాకుండా, వాటిని మార్చేసి బాగా వెలుగునిచ్చే ఎల్‌ఈడీ లైట్లను వాడటం ప్రమాదకరంగా మారుతుండటంతో, వాటిపై కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.

''హైబీమ్ ఎ‌ల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ వాడే వాహనాలకు అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఏడాది జులై ప్రారంభ వారంలోనే 8 వేల చలాన్లను ఆ రాష్ట్ర పోలీసులు జారీ చేశారు. కేవలం బెంగళూరు నగరంలోనే 3 వేల చలాన్లు వేశారు'' అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

''వాహనాలకు కంపెనీ ఇచ్చిన లైట్లు కాకుండా, వైట్ ఎల్‌ఈడీ లైట్లు అమర్చుకునే వాహనదారులపై గుజరాత్‌ ప్రభుత్వంజరిమానాలు విధిస్తోంది'' అన్నది మరో కథనం.

ఎల్‌ఈడీ లైట్లతో ఇబ్బందులేంటి?

హైబీమ్ ఎల్‌ఈడీ లైట్లు రోడ్ల మీద ప్రయాణించేవారికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ లైట్లున్న వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు రోడ్డు మీద ఏమీ కనిపించక ఇబ్బంది పడుతున్నామని పలువురు వాహనదారులు చెబుతున్నారు.

ఇంతకు ముందు ప్రతి లైట్‌కు అద్దం మీద నలుపు రంగు వేసేవారు. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లలో లైటింగ్ పడకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు ఉండేది. ఇప్పుడా నియమం లేదు.

'' హైదరాబాద్‌ నుంచి మా ఊరికి వెళుతుంటే మధ్యలో సింగిల్ లైన్‌పై వాహనం నడపాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎల్‌ఈడీ లైట్లున్నవాహనాలు ఎదురుగా వస్తుంటాయి. ఆ వాహనాలు వెళ్లిన తర్వాత కొన్ని సెకన్లపాటు నా కళ్లు బైర్లు కమ్మినట్లు అవుతాయి. ఏమీ కనిపించదు. స్పీడ్‌‌గా వెళుతున్నప్పుడు బండిని కంట్రోల్ చేయలేను. అలా అని అంతే స్పీడ్‌లో వెళ్లలేను. అలా చాలాసార్లు ఇబ్బందిపడ్డా.'' అని హైదరాబాద్‌కు చెందిన ఒక వాహనదారుడు తన అనుభవాన్ని వివరించారు.

ఏ లైట్ ఎప్పుడు వాడాలో డ్రైవర్‌కు తెలియాలి.

వాహనాలకు హెడ్‌లైట్స్ చాలా ముఖ్యమైనవి. ఈ హెడ్‌లైట్లలో రెండు రకాలు ఉంటాయి. అవి హైబీమ్, లోబీమ్.

సేఫ్ డ్రైవింగ్‌కు ఈ లైట్లు ఎంతో కీలకమైనప్పటికీ, వీటి వాడకంపై భారత్‌లో నియమ నిబంధనలు ఉన్నాయి.

చీకట్లో, వర్షం పడేటప్పుడు, పొగమంచు సమయంలో దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు రోడ్డు కనిపించేందుకు డ్రైవర్లకు ఫాగ్ ల్యాంప్స్ సాయపడతాయి. ఎదురుగా వచ్చేవారు కూడా వాహనాన్ని గుర్తించేందుకు ఈ లైట్లే ప్రధానం.

అయితే, ఏ లైట్ ఎప్పుడు వాడాలన్నది డ్రైవర్‌కు కచ్చితంగా తెలిసి ఉండాలి. లేదంటే, ప్రమాదంలో పడతారు.

హైబీమ్ హెడ్‌లైట్లను రోడ్డు బాగా చీకటిగా ఉన్నప్పుడు, మరే ఇతర వాహనాలు రానప్పుడే వాడాలి. ఇతర వాహనాలు వస్తున్నప్పుడు దాన్ని ఆఫ్ చేయాలి.

హైబీమ్ హెడ్‌లైట్లను ఎప్పుడు పడితే అప్పుడు వాడితే, మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988 ప్రకారం జరిమానా విధిస్తారు. చాలా వరకు లోబీమ్ హెడ్‌లైట్లనే ప్రజలు వాడుతుంటారు. హైబీమ్, లోబీమ్ హెడ్‌లైట్లలోకి మారేందుకు డ్రైవర్ దగ్గర స్విచ్ ఉంటుంది.

కొందరు హెడ్‌లైట్ల కోసం ఎల్‌ఈడీ బల్బులను వాడుతున్నారు. ఈ లైట్లపై భారత్‌లో పూర్తిగా నిషేధం లేనప్పటికీ, ప్రభుత్వం వాటి వినియోగాన్ని నియంత్రిస్తోంది . కంపెనీ ఇచ్చినవి కాకుండా హెడ్‌లైట్లను, టెయిల్‌ లైట్లను మార్చుకోవడం భారత్‌లో చట్ట వ్యతిరేకం. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ పొందే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

దృశ్యమానత పెరగడానికి వివిధ రంగుల్లో లైట్లను అమర్చుకుంటే, వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇన్సూరెన్స్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

''ఎల్‌ఈడీ లైట్లు అమర్చుకోకూడదనే విషయంలో వాహనదారులకు, కంపెనీలకు ఎలాంటి ఆంక్షలూ లేవు. కంపెనీలు దేశీయ ప్రమాణాల ప్రకారం వాహనాలను తయారు చేయాలి. అలా ఉన్నాయో లేదో రవాణా శాఖ పరీక్షించి చూస్తుంది. ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్ల వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నందున అంతకుముందున్న లైట్‌ మీద స్టిక్కర్ వేసే నిబంధనను మళ్లీ తీసుకొస్తే బాగుంటుంది'' అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(రోడ్ సేఫ్టీ) రాజా రత్నం అన్నారు.

''సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ సెక్షన్ 105 లో వాహనాలకు సంబంధించిన లైటింగ్ నిబంధనలను పొందుపరిచారు. ఆ మేరకు కంపెనీలు తయారు చేసిన లైట్లను మార్చడానికి వీలులేదు. కొందరు కావాలనే లైట్లను మారుస్తూ ఉంటారు. కంపెనీలు తయారు చేసి ఇచ్చే ఎల్ఈడీ లైట్ల వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. మార్చుకునే లైట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది'' అని మాజీ అడిషనల్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీఎల్ఎన్ గాంధీ చెప్పారు.

ఎల్‌ఈడీ లైట్లను ఎందుకు వాడుతున్నారు?

ఎల్‌ఈడీ హెడ్‌లైట్లను వాడటం వల్ల దూరంలో ఏమున్నా వాహనదారునికి తేలికగా కనిపిస్తుంది. అంతేకాక, బ్యాటరీ పవర్ ఆదా అవుతుంది.

లగ్జరీ వాహనాల నుంచి ఈ లైట్లకు ఎక్కువగా డిమాండ్ వస్తోందని మార్కెట్ రీసర్చ్ ఫ్యూచర్ తన నివేదికలో పేర్కొంది.

దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ ఎల్‌ఈడీ లైటింగ్‌కు మార్కెట్లో వార్షిక వృద్ధిరేటు పెరుగుతోందని తెలిపింది.

అధునాతన ఫీచర్లు, హైఎండ్ స్పెసిఫికేషన్లతో తయారీదారులు లగ్జరీ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నారు. వాహనం ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ లైటింగ్ సిస్టమ్‌ను వారు వాడుతున్నారు.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇండియన్ ఆటోమేటివ్ ఎల్‌ఈడీ లైటింగ్ మార్కెట్ వేగంగా పెరుగుతోందని మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్ తెలిపింది.

భారత్‌లో కూడా ఆటోమోటివ్ ఎల్‌ఈడీ లైటింగ్ మార్కెట్ పెరుగుతోందని మోర్డార్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది. ఇది వివిధ రంగాల గురించి రీసర్చ్ రిపోర్టులను తయారు చేస్తుంది.

శీతాకాలంలో పొగమంచు వల్ల ప్రమాదాలు పెరుగుతుండటంతో ఫాగ్ ఎల్‌ఈడీ ల్యాంప్‌ల వాడకం పెరుగుతోందని ఈ రీసర్చ్ రిపోర్టు తెలిపింది.

ప్రమాదాలు ఎంత పెరిగాయి?

యుద్ధాలు, మిలిటెన్సీ, నక్సలిజం కంటే భారత్‌లో రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి 3 శాతం నష్టం వాటిల్లుతుందన్నారు.

భారత్‌లో సంవత్సరానికి 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, 3 లక్షల మంది గాయాల పాలవుతున్నట్టు చెప్పారని ఎకనమిక్ టైమ్స్ నివేదించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)