You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిరియా: అసద్ ప్రభుత్వం తమను వ్యతిరేకించినవారిని బంధించిన భూగర్భ చీకటి గదులు ఎలా ఉన్నాయో చూశారా
- రచయిత, ఫెరస్ కిలాని
- హోదా, బీబీసీ ప్రతినిధి
సిరియన్లు భయపడినట్లే, ప్రభుత్వ వ్యతిరేకుల్ని బంధించి హింసించారు. బీబీసీ ప్రతినిధి ఫెరస్ కిలాని, గత ప్రభుత్వం అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రహస్య ప్రాంతాల్ని పరిశీలించారు. కేవలం కొద్దిమందికి మాత్రమే అనుమతి ఉన్న ప్రపంచం ఇది.
సిరియా రక్షణ ప్రధాన కేంద్రంలో దేశపు నిఘా విభాగం రహస్యంగా నిర్వహించిన నెట్‌వర్క్‌ను బీబీసీ గుర్తించింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ నెట్‌వర్క్, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన వారి అరాచకానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.
ఇందులో ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదులకు బలమైన మందపాటి ఇనుప తలుపులు ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఉన్న గదుల్లో ఖైదీలను ఉంచేవారు.
ఒక గది లోపలకు చూస్తే, అది కేవలం రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పుతో మురికి గోడల మీద, ఎండిపోయిన మరకలు కనిపిస్తాయి.
గది పైన ఏర్పాటు చేసిన చిన్న కిటికీల ద్వారా వచ్చే సూర్యరశ్మి వల్ల కొద్దిపాటి వెలుతురు వస్తుంది.
బందీలను నెలల తరబడి ఈ గదుల్లోనే ఉంచి విచారణ పేరుతో హింసించేవారు.
సిరియా రాజధాని డమాస్కస్‌లో రద్దీగా ఉండే కాఫర్ సౌసా డిస్ట్రిక్ట్‌లో ఇది వీధికి కొంత దిగువ భాగంలో ఉంది.
ప్రతీరోజూ ఈ మార్గం గుండా వందల మంది సాధారణ సిరియన్ పౌరులు వెళుతూ వస్తూ ఉంటారు. తమ తోటి పౌరులను బంధించి, హింసించిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలోనే వారు తమ రోజువారీ జీవితాన్ని గడుపుతున్నారు.
నేల మాళిగలోని వరండాలో పదవి కోల్పోయిన బషర్ అల్ అసద్ చిరిగిపోయిన చిత్రాలు ఉన్నాయి. దేశంలోని గూఢచార సంస్థలు లక్షల మంది పౌరుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఉపయోగించే ఫైళ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.
ఖైదీలను ఇక్కడ కొంత కాలం ఉంచిన తర్వాత, వారిని డమాస్కస్ శివార్లలో ఉన్న భయంకరమైన సేడ్నేయా జైలులాంటి లాంగ్ టర్మ్ డిటెన్షన్ సెంటర్లకు తరలించేవారు.
ఇది సిరియా గత ప్రభుత్వం నిర్వహించిన విస్తృతమైన నెట్‌వర్క్‌లో ఒక భాగం మాత్రమే.
2011లో అల్ అసద్‌కు వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పటి నుంచి 2024 జులై వరకు 15,102 మందిని ఈ జైళ్లలో చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు స్వతంత్ర పర్యవేక్షణ గ్రూప్ సిరియన్ నెట్‌వర్క్ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.
2024 ఆగస్టులోనే లక్ష 30వేల మందిని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా అదుపులోకి తీసుకోవడంలాంటివి జరిగి ఉండొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది.
అసమ్మతిని అణచివేసేందుకు చిత్రహింసలు పెట్టడం లేదా కనిపించకుండా చెయ్యడాన్ని అల్ అసద్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఒక పాలసీలాగా అమలు చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.
సిరియాలోని నిఘా వర్గాలు జవాబుదారీతనం లేకుండా వ్యవహరించాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభివర్ణించింది.
దేశ రక్షణ ప్రధాన స్థావరం నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న జనరల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వద్దకు మేము చేరుకున్నాము. దేశంలోని గూఢచార సంస్థల నెట్‌వర్క్‌లో ఇది ఇంకో భాగం.
ఈ సంస్థ ప్రజల దైనందిన వ్యవహారాల్లో ప్రతీ చిన్న అంశం మీద కూడా నిఘా పెట్టేదని అసద్ ప్రభుత్వ వ్యతిరేకులు ఆరోపించేవారు.
లోపల, మేమ ఒక కంప్యూటర్ సర్వర్ రూమ్‌ను గుర్తించాం. ఈ రూమ్‌లో నేల, గోడలు తెల్లగా ఉన్నాయి. ఇందులో ఒక దాని తర్వాత మరొకటి డేటాను నిల్వ చేసే యూనిట్లు ఉన్నాయి.
డమాస్కస్‌లోని అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే ఈ ప్రాంతం ముఖ్యమైనది కావడంతో దీనికి స్వీయ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.
డేటాను డిజిటల్‌గా స్టోర్ చేసే వ్యవస్థలు ఉన్నప్పటికీ, పేపర్ రికార్డులు కూడా భారీగా ఉన్నాయి. అవన్నీ చక్కగా అమర్చినట్లు కనిపించాయి.
గదిలో వరుసగా ఏర్పాటు చేసిన ఇనుప అరల్లో ఫైల్స్ నిండిపోయి ఉన్నాయి. మరి కొన్ని అరల్లో గది పైకప్పు వరకు నోట్‌బుక్స్ పెట్టారు.
అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన పారిపోవడానికి ముందు ఇక్కడ పని చేసిన వారికి ఈ పత్రాలు, రికార్డులను ధ్వంసం చేయడానికి కూడా సమయం లేనట్లు అనిపించింది.
కొన్నేళ్లుగా ఉన్న ఈ రికార్డుల్లో దేన్ని కూడా ధ్వంసం చెయ్యలేదు. అంతే కాకుండా ఇక్కడ ఉపయోగించిన బుల్లెట్ల కాట్రిడ్జ్‌లున్న పెట్టెలను మేం గుర్తించాం.
ఇక్కడ మరో వైపున ఆయుధాలు ఉన్నాయి. అందులో మోర్టార్లు, గ్రనేడ్లు కూడా ఉన్నాయి.
డమాస్కస్‌ను స్వాధీనంలోకి తీసుకున్న ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హెచ్‌టీఎస్ ఫైటర్లు మాకు తోడుగా వచ్చారు. ఆయుధాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని నేను వారిలో ఒకరిని అడిగాను.
అసద్ పాలనాకాలంలో రష్యా సహకారంతో "ప్రభుత్వ వ్యవస్థలన్నీ సిరియన్ ప్రజలకు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రధాన కేంద్రాలుగా మారాయి" అని అతను మాతో చెప్పారు.
సిరియా ప్రజల్ని బంధించి, చిత్రహింసలు పెట్టిన వారిపై భవిష్యత్‌లో విచారణ జరిగితే జనరల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కార్యాలయం గదుల్లో గుట్టలుగా పోగు పడిన పత్రాలు, కంప్యూటర్ రికార్డులు కీలకంగా మారతాయి.
అల్ అసద్ ప్రభుత్వ పాలనా కాలంలో ప్రజల్ని హింసించడం, బందీలను చంపెయ్యడంలో భాగస్వాములైన వారిని వేటాడతామని, వారికి క్షమాభిక్ష ప్రసక్తే లేదని హెచ్‌టీఎస్ నాయకుడు ఒక ప్రకటనలో వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
"సిరియాలో వాళ్లెక్కడ ఉన్నా పట్టుకుంటాం. విదేశాలకు పారిపోయిన వారిని మాకు అప్పగించాలని అడుగుతాం. వాళ్లను అప్పగిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది" అని ఆయన టెలిగ్రామ్‌లో ఒక సందేశం పోస్ట్ చేశారు.
అయితే సిరియన్ సెక్యూరిటీ నెట్‌వర్క్ విధ్వంసం దేశ సరిహద్దులను దాటి విస్తరించింది.
ఇరాక్, లెబనాన్, జోర్డాన్‌కు చెందిన అనేక ఫైళ్లను మేము అక్కడ గుర్తించాం.
ఈ పత్రాలన్నీ బహిర్గతమైతే, అసద్ పాలనాకాలంలో ప్రముఖ వ్యక్తుల మధ్య సంబంధాలు, అసద్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య సంబంధాలు కూడా బయటకు వస్తాయి. అవి ఈ ప్రాంతాన్ని కుదిపివెయ్యవచ్చు.
బషర్ అల్ అసద్ మాజీ భద్రత విభాగానికి సంబంధించి మరికొన్ని అంశాలు బహిర్గతమైతే పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)