కరోనావైరస్: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తప్ప.. ఏపీ అంతా హాట్‌స్పాట్

ఆంధ్ర ప్రదేశ్‌‌లో 11 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్టు కేంద్రం బుధవారం ప్రకటించిందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన జిల్లాల్లో ప్రత్యక్ష కార్యాచరణ అమలుపై కేంద్రం దృష్టి సారించింది.

అందులో భాగంగా దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించింది. కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌లన్నీ రెడ్‌జోన్‌ పరిధిలోకి వచ్చేవే.

ఈ జాబితాలో ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.

ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదుకాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రం సేఫ్‌జోన్‌లో ఉన్నాయి. 20కిపైగా కేసులు నమోదైన ప్రతి జిల్లాను హాట్‌స్పాట్‌గా.. అందులోనూ అత్యధిక కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు.

అయితే, ఏపీలో క్లస్టర్‌ ప్రస్తావన లేదు. అంటే మొత్తం 11 జిల్లాలు హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగానే భావించాల్సి ఉంటుంది. క్లస్టర్‌ అంటే జిల్లాలో కేసుల సంఖ్య భారీగా ఉన్న ప్రాంతాలతో కూడిన సముదాయం.

ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో వివరించింది.

ఆ లేఖ నేనే రాశా - నిమ్మగడ్డ రమేశ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేసినట్టు ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

ఆ లేఖలో నిమ్మగడ్డ రమేష్ సంతకాలపై అనుమానాలున్నాయంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తూ విచారణ నిమిత్తం డీజీపీకి లేఖ రాసిన నేపథ్యంలో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

దానిపై ఇతరులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ లేఖ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా ధ్రువీకరించారని చెప్పారు. ఈ మేరకు రమేశ్ కుమార్ బుధవారం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

లేఖ కచ్చితత్వం గురించి మీడియాలో వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వివరణ ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తూ ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

ఈ అంశంపై ఎలాంటి అనవసర వివాదాన్ని తాను కోరుకోవడం లేదని, ఆ లేఖ రాయడం పూర్తిగా తన పరిధిలోని అంశమని రమేశ్ కుమార్ స్పష్టం చేశారని ఈ కథనంలో ఈనాడు వివరించింది.

రెండో శనివారం సెలవులు రద్దు

వచ్చే విద్యా సంవత్సరం తెలంగాణలో ఇంటర్, ఉన్నత విద్యలో రెండో శనివారం సెలవులు రద్దయ్యే అవకాశం ఉందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

లాక్ డౌన్ కారణంగా జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు రానున్న విద్యా సంవత్సరంలో రెండో శనివారం సెలవును రద్దు చేయాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు పాఠశాల విద్యాశాఖ టెన్త్‌ పరీక్షలను పూర్తి చేయలేదు. మరోవైపు ఇంటర్‌ ఫలితాలు వెలువడలేదు. డిగ్రీ పరీక్షలు నిర్వహించలేదు.

లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ ముగిశాక విద్యా కార్యక్రమాలు చేపట్టినా జూన్, జులైలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు.

ఆ తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైతే పనిదినాలను, సెమిస్టర్‌ విధానాన్ని సర్దుబాటు చేసేందుకు రెండో శనివారం సెలవులు రద్దు చేయక తప్పని పరిస్థితి నెలకొందని సాక్షి దినపత్రిక ఈ కథనంలో తెలిపింది.

2022 వరకు సామాజిక దూరం పాటించాల్సిందే

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలు 2022 నాటి వరకు సామాజిక దూరాన్ని పాటించాలని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్‌ టీ. హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు తెలిపినట్టు నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

అత్యవసర వైద్య సదుపాయాలు తగిన స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు లేదా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ను కనుగొనే వరకూ ఇదే మార్గమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ వివరాలు ‘జనరల్‌ సైన్స్‌'లో ప్రచురితమయ్యాయి. అమెరికాలో వైరస్‌ సంక్రమణ జరిగిన విధానం, కేసుల సమాచారాన్ని సేకరించి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

అక్కడక్కడ వెలుగుచూసిన వైరస్‌.. క్రమంగా మహమ్మారిగా విస్తరించిందని అందులో పేర్కొన్నారు.

ప్రస్తుతమున్న ప్రపంచ వైద్య వ్యవస్థ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి రావాలంటే 2022 వరకు వేచి చూడాలని, ఇది జరగాలంటే ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు.

వైరస్‌ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసి, పరీక్షలు జరిపి అందుబాటులోకి తీసుకురావాలంటే సంవత్సరాల కాలం పట్టొచ్చని, అప్పటివరకూ సామాజిక దూరాన్ని పాటించడమే వైరస్‌ నియంత్రణకు ఉత్తమ మార్గమని తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)