తెలంగాణ: మల్లన్నసాగర్ కోర్టు ధిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష వేసిన హైకోర్టు - ప్రెస్ రివ్యూ

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ భూసేకరణ వ్యవహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో సిద్దిపేట ప్రస్తుత కలెక్టర్‌ పి.వెంకటరామిరెడ్డి, గతంలో కలెక్టర్‌గా పనిచేసిన ప్రస్తుత సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆర్డీవో జయచంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు శిక్ష విధించిందని ఈనాడు తెలిపింది.

ఆర్డీవోకు కోర్టు రెండు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. శిక్ష అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది. జరిమానాను నాలుగు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. కలెక్టర్లకు జరిమానా విధిస్తూ నాలుగు వారాల్లో చెల్లించాలని, లేని పక్షంలో నెల రోజుల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కలెక్టర్లతోపాటు ఆర్డీవో సర్వీసు రికార్డుల్లో వ్యతిరేక ఎంట్రీ నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

కోర్టు ధిక్కరణ కేసు వల్ల పిటిషనర్లకు చెందిన భూమిని స్వాధీనం చేసుకోవాలన్న అధికారుల ప్రయత్నాలు చెల్లవని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్ల భూమికి సంబంధించి ప్రాథమిక ప్రకటన (భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 11(1) నోటిఫికేషన్‌)తో పాటు 2019 మే 21న జారీ చేసిన డిక్లరేషన్‌, అవార్డు నోటిఫికేషన్లను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆరు నెలల్లోగా తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసి చట్ట ప్రక్రియను అనుసరించి పిటిషనర్ల భూమిని సేకరించవచ్చంది.

ఆర్డీవోతో పాటు ఇద్దరు కలెక్టర్లు వేర్వేరుగా ఒక్కొక్క పిటిషనర్‌కు రూ.2 వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు తన తీర్పులో ఆదేశించారు.

మల్లన్నసాగర్‌ డీపీఆర్‌ (ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నివేదిక)ను పిటిషనర్లకు తెలుగులో ఇచ్చి, వారి అభ్యంతరాలపై తీసుకున్న నిర్ణయాలను తెలియజేసి డిక్లరేషన్‌, అవార్డు నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ 2018లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు విరుద్ధంగా భూసేకరణ చేపట్టడంతో లక్ష్మి, మరో 11 మంది వేర్వేరుగా రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయగా- వీటిపై జస్టిస్‌ రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.

ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్డీవో అందజేశారని కలెక్టర్‌ చెబుతున్నప్పటికీ ఎలాంటి వివరాలివ్వలేదని పిటిషనర్లు చెప్పారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పది రోజుల్లో మూడు సెట్ల డీపీఆర్‌ ఇవ్వాలన్న కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో కలెక్టర్‌ వివరించలేదన్నారు. భూసేకరణపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆర్డీవోకు పిటిషనర్లు వినతి పత్రమిచ్చినా, ఆయన ఎలాంటి సమాధానమివ్వలేదన్నారు. అలాగని తిరస్కరించలేదన్నారు. దీన్నిబట్టి పిటిషనర్ల వాదనను అంగీకరించినట్లేనన్నారు. ఆర్డీవో ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు.

ముందు ఆర్డీవోగా ఉన్న ముత్యంరెడ్డి 2018 ఆగస్టు 13న పిటిషనర్లతో పాటు రైతుల అభ్యంతరాలు విన్నప్పటికీ, తరువాత బాధ్యతలు చేపట్టిన జయచంద్రారెడ్డి ఎనిమిది నెలల తర్వాత సిఫార్సులను పంపారని న్యాయమూర్తి చెప్పారు. అభ్యంతరాలు విన్నవారే సిఫార్సు చేయాలన్నారు (సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం).

పిటిషనర్ల అభ్యంతరాలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని సమాచారం అందజేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఎనిమిది వారాలెందుకు ఆగారో కౌంటరు దాఖలు చేయలేదని జడ్జి పేర్కొన్నారు. సబార్డినేట్‌ అధికారుల ద్వారా కోర్టు ఉత్తర్వులను అమలు చేయించడంలో జిల్లా కలెక్టర్లు విఫలమయ్యారని చెప్పారు.

ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే కలెక్టర్ల పరిపాలనా సామర్థ్యాలపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేలా ఆర్డీవోను ప్రోత్సహించినట్లుందని పేర్కొన్నారు.

కోర్టు ధిక్కరణను ఎదుర్కోవడం ద్వారా భూసేకరణ ప్రక్రియ ఫలితాలను అనుభవించవచ్చన్న అధికారుల ప్రయత్నాలు నెరవేరవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అధికారుల చర్యల వల్ల అన్యాయమైన రైతులకు న్యాయం చేయాల్సి ఉందన్నారు.

"అజయ్ సార్! ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచానికి స్వాగతం": ఎన్టీఆర్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి సంబంధించి మరో ఫొటో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని సాక్షి చెప్పింది.

ఇది రామ్ చరణ్, అజయ్‌ దేవగన్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి దిగిన ఫోటో. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులు. హిందీ నటుడు అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ మధ్యే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సెట్లో అజయ్‌ అడుగుపెట్టారు. ''ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అజయ్‌ సార్‌'' అని ఎన్టీఆర్‌ ట్విటర్లో వ్యాఖ్యానించారు.

''మీ పని అంటే నాకు ఇష్టం. వ్యక్తిగా అంతకంటే ఇష్టం అజయ్‌సార్‌'' అని చరణ్‌ చెప్పారు.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇందులో కొమరమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నారు.

ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ బొమ్మలు ముద్రిస్తాం: మంత్రి పువ్వాడ

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రగతి పథంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తోడ్పాటు అందిస్తున్నారని, ఆయన బొమ్మలను బస్సులపై ముద్రించనున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

కేసీఆర్ బొమ్మలతోపాటు పలు ప్రగతిదాయక, ప్రయాణికుల భద్రత పరమైన నినాదాలను ముద్రిస్తామని మంత్రి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో పేర్కొన్నారు. ఆర్టీసీని సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. నష్టాల డిపోలను అధికారులు దత్తత తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చే స్థాయికి ఆర్టీసీని తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. అందుకే కార్గో సేవలను ప్రారంభిస్తున్నామని, ఈ సేవలకు సీఎం కేసీఆరే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలిపారు. సంస్థలోని ఉద్యోగులను వేధించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ఎవరైనా తన నంబర్‌ (9849555778)కు ఫోన్‌ చేసి చెప్పవచ్చన్నారు.

ఆర్టీసీ నష్టాలకు కారణమవుతున్న ప్రైవేటు వాహనాలను ఇకపై ఆర్టీసీ రూట్లలో తిరగబోనివ్వమని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టిన 55 రోజుల సమ్మె కాలపు వేతనాలను మార్చి 31 లోపు చెల్లిస్తామన్నారు.

శాసనమండలి: కేంద్రం నిర్ణయంలో రాజకీయ కోణం ఉండదన్న జీవీఎల్

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పారని సాక్షి తెలిపింది.

ఆయన బుధవారం దిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ- రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. "ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు" అని ఆయన చెప్పారు.

బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ- "కేబినెట్‌ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా! ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్‌ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు" అని జీవీఎల్ చెప్పారు.

బీజేపీకి ఏపీ చట్టసభల్లో, అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలని ఆయన బదులిచ్చారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, దీనికి సమాధానం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని, వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని జీవీఎల్ చెప్పారు.

రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నకు- "ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం" అని ఆయన సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)