ముంబైలో యువకుడిపై నలుగురి అత్యాచారం... మూడు గంటల పాటు నరకం - ప్రెస్ రివ్యూ

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వికృత ఘటన చోటుచేసుకుందని.. ఒక 22 ఏళ్ల యువకుడిపై నలుగురు వ్యక్తులు కదులుతున్న కారులో మూడు గంటల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ‘సాక్షి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం... సెంట్రల్‌ ముంబై శివార్లలో నివసించే 22 ఏళ్ల యువకుడు ఆదివారం నగరంలోని ఓ రెస్టారెంట్‌ వద్ద సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ పోస్ట్‌ చూసిన నలుగురు అనుమానితులు బాధితుడి లొకేషన్‌ను ట్రేస్‌ చేసి తాము అతని ఫ్యాన్స్‌ అంటూ నమ్మబలికారు. తమతో పాటు బైక్‌ రైడ్‌కు రావాలని కోరగా బాధితుడు సమ్మతించి వారితో పాటు వెళ్లాడు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ హాటల్‌ దగ్గర ఆగిన వారు అక్కడి నుంచి కారులోకి బాధితుడిని బలవంతంగా ఎక్కించుకుని మూడు గంటల పాటు నగరంలో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు సోమవారం తెల్లవారుజామున బాధితుడిని రోడ్డుపై పడవేసి పారిపోయారు.

కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై అసహజ లైంగిక చర్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు.

సీఎం జగన్‌కు మందకృష్ణ ప్రశ్నలు

''హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, మృతదేహాలను బావిలో పడవేసిన శ్రీనివాస రెడ్డిని, జడ్చర్లలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కొట్టి చంపిన నవీన్‌ రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని సూచించే సాహసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ చేయగలరా? ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు నలుగురు మహిళలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయరు?'' అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ తమ సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని కృష్ణమాదిగ బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగితే పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

''నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడమే కాకుండా, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం'' అన్నారు.

'దిశ' సామాజిక వర్గం నేపథ్యంలో... ఆయా రాజకీయ పార్టీలలోని రెడ్డి సామాజికవర్గం పెద్దల ఒత్తిడి, పోలీసు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిందని కృష్ణమాదిగ ఆరోపించారు.

వైఎస్‌ హయాంలో 11 మంది గిరిజన మహిళలపై పోలీసు శాఖకు చెందిన వారు అత్యాచారాలకు పాల్పడి హత్యలు చేశారని ఆయన చెప్పారు. ఆయేషా మీరా తల్లిదండ్రుల ఆవేదన ఇప్పటికీ అరణ్య రోదనగానే మిగిలిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో తల్లీ కూతుళ్లను హత్య చేసి తగులబెట్టారన్నారు. ''ఈ మూడు కేసుల్లో కేసీఆర్‌ పాలసీని జగన్‌ అమలు చేసి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం, లేక ఉరి తీయడం చేయగలరా?'' అని ప్రశ్నించారు.

బిహార్‌లో మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు

బిహార్‌లో ఓ బాలికను గర్భవతిని చేసిన యువకుడు.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించటంతో ఆమె చనిపోయిందని ‘నవతెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. బెట్టయ్య జిల్లాలోని ఒక గ్రామంలో ఓ మైనర్‌ను వివాహం చేసుకుంటానని ఓ యువకుడు నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక ఒక నెల గర్భంతో ఉండగా.. యువకుడిని పెళ్లి చేసుకోవాలని కోరింది.

పెళ్లికి నిరాకరించిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్పందించిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. పాట్నా తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

మంటల్లో 80 శాతం కాలిన గాయాలవటంతో ఆ యువతి పాట్నా వెళ్లే లోపే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

బెలూన్ అడిగిందని చిన్నారిని చంపేసిన సవతి తండ్రి!

ఆడుకోవడానికి బెలూన్ అడిగిందన్న కారణంతో సవతి తండ్రి నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా కొట్టి చంపిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌‌లోని కుల్దాబాద్‌లో జరిగినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఓ మహిళ తన కుమార్తె, రెండో భర్తతో కలిసి కొంత కాలం కిందట సిద్ధార్థనగర్ నుంచి వచ్చి కుల్దాబాద్‌లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం బాలిక సవతి తండ్రిని బెలూన్ కావాలని అడిగింది. దాంతో అతను చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది.

అడ్డుకున్నందుకు తనను బండి మీద నుంచి కిందకు దింపేసి బాలికను మాత్రం తీసుకుని వెళ్లిపోయినట్లు ఆమె వాపోయింది. అదే రోజు రాత్రి 10:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి బాలికను తీసుకుని వెళ్లి గది తలుపు వేసుకున్నట్లు ఆమె వివరించింది.

ఎంత పిలిచినప్పటికీ అటు నుంచి సమాధానం రాకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న నిందితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

వృద్ధులను వేధిస్తే ఆరు నెలల జైలుశిక్ష

ఇకపై తల్లిదండ్రులు, వృద్ధులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తే వారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష, రూ. 10 వేల జరిమానా లేదా రెండూ గానీ విధించేందుకు చట్టం రానున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ (సవరణ) బిల్లు-2019ను కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

తల్లిదండ్రులు/ వృద్ధులను భౌతికంగా గానీ, మానసికంగా గానీ వేధించే కొడుకు, కూతురు, సవతి పిల్లలు, దత్తత పిల్లలు, అల్లుడు, కోడలు, మనుమడు, మనుమరాలు, మైనర్ల గార్డియన్లకు ఈ బిల్లు వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)