You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా చార్జీల పెంపు - ప్రెస్ రివ్యూ
చౌక మొబైల్ కాలింగ్, డేటా సేవలకు భారత్‌లో కాలం చెల్లిందని సాక్షి ఓ కథనంలో పేర్కొంది.
నాలుగేళ్ల తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ప్రీపెయిడ్ వినియోగదారులపై చార్జీల భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. దాదాపు 40 శాతం నుంచి 50శాతం వరకూ ధరల పెంపు ఉండొచ్చని వెల్లడించాయి. డిసెంబర్ 3 నుంచి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థలు చార్జీలను పెంచుతుండగా, డిసెంబర్ 6 నుంచి తమ టారిఫ్ పెంచుతున్నట్లు జియో ప్రకటించింది.
అన్‌లిమిటెడ్ ప్లాన్స్ అని చెబుతున్నప్పటికీ వాటిలో కాల్స్ విషయంలో కొంత పరిమితి విధించబోతున్నారు. ఆ పరిమితి దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్‌కు నిమిషానికి 6 పైసలు చార్జీ ఉంటుంది. నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ మూడు సంస్థలు చార్జీల పెంపు బాట పట్టాయని సాక్షి తెలిపింది.
నేటి అర్థరాత్రి నుంచి టీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపు
ఆర్టీసీలో చార్జీలను సోమవారం అర్థరాత్రి నుంచి పెంచే అవకాశం ఉందని సమాచారం అంటూ ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
చిల్లర సమస్య తలెత్తకుండా ఆర్టీసీలో కనీస చార్జీని రూ.10గా నిర్ణయిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. కనీస చార్జీ రూ.8 ఉండడం వల్ల చిల్లర సమస్య తలెత్తుతోందని సమీక్షా సమావేశంలో కొందరు కార్మికులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో కనీస చార్జీని రూ.10 గా మార్చాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
చేతులు శుభ్రం చేసుకోవడంలో కేరళవాసులు నెంబర్ 1
చేతుల శుభ్రత విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలుస్తోందని ఈనాడు ఓ కథనంలో పేర్కొంది.
గతేడాది జూన్-డిసెంబర్ మధ్య కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 76వ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. "అన్నం తినేముందు చేతిని సబ్బుతో కడుక్కుంటున్నారా? నీటితోనే కడుక్కుంటున్నారా?" అనే ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 60శాతం కుటుంబాలు "నీటితో" అని సమాధానం ఇచ్చాయి. మరుగుదొడ్డికి వెళ్లొచ్చాక మాత్రం సబ్బునీటితోనే చేతులు కడుక్కుంటున్నామని ఆంధ్ర ప్రదేశ్‌లో 54శాతం, తెలంగాణలో 73శాతం కుటుంబాలు స్పష్టం చేశాయి.
చేతుల శుభ్రత విషయంలో మొదటి స్థానంలో కేరళ ఉండగా మూడు, నాలుగు స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయని ఈనాడు తెలిపింది.
ప్రాణహితలో పడవ మునక
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దుల సమీపంలో ప్రాణహిత నదిలో ఆదివారం నాడు నాటుపడవ మునిగి ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.
విధినిర్వహణలో భాగంగా అధికారులు బాలకృష్ణ, సురేశ్, సద్దాంలు మహారాష్ట్ర సరిహద్దులోని అహేరికి నాటుపడవలో వెళ్లారు. పరిస్థితులను పరిశీలించి తిరిగి వస్తుండగా పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ఘటనలో బాలకృష్ణ, సురేశ్ గల్లంతవ్వగా, సద్దాంతోపాటు ముగ్గురు పడవ నడిపే వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు సాయంత్రం వరకూ గాలింపు చర్యలు చేపట్టినా వారిద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయ్ అభిప్రాయం: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా?’’
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్‌నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న
- ఎయిడ్స్ డే: పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
- కె-పాప్ స్టార్ 'గూ హారా' మరణం: సెక్స్‌లో పాల్గొన్న వీడియోను బయటపెడతానంటూ బెదిరించిన బాయ్‌ఫ్రెండ్
- తాగుడు మానడానికి ఈ ఔషధం పని చేస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)