ఏపీలో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం.. ఏప్రిల్ 1 నుంచి రూ.వెయ్యి దాటినా ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ ఆదేశాలు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB/AndhraPradeshCM
ఏప్రిల్ 1 నుంచి వైద్యసేవల వ్యయం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారని ఈనాడు రాసింది.
ఆరోగ్య రంగ సంస్కరణలపై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు నేతృత్వోంలో ఏర్పాటైన కమిటీ నివేదికను బుధవారం ముఖ్యమంత్రి జగన్‌కు అందజేసింది.
నివేదికలోని అంశాలపై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. నివేదికలో చెప్పిన ప్రకారం ప్రభుత్వ వైద్యుల ప్రాక్టీసుపై నిషేధం విధించాలని, ఆ మేరకు వారికి వేతనాలు పెంచేలా ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారని ఈనాడు తన వార్తాకథనంలో రాసింది.
ప్రభుత్వ వైద్యులకు ఎంత మేరకు వేతనాలు పెంచాలో అధికారులు నివేదిక ఇస్తే, దాని ప్రకారం పెంచి, ప్రైవేట్ ప్రాక్టీసును రద్దు చేస్తామని జగన్ చెప్పారని సాక్షి తెలిపింది.
వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహించకూడదన్న విధానం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఇక్కడ కూడా అమలు చేస్తే బావుంటుందని కమిటీ సీఎంకు సూచించింది.
2020 జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీని పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్తగా అమలయ్యే ఆరోగ్యశ్రీ పథకంలో రెండు వేల వ్యాధులకు వైద్యం అందిస్తామని, వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. లోటుపాట్లను సమీక్షించి 2020 ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అప్పటివరకు 1,200 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, ఆ తర్వాత రెండు వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని ఆయన వివరించారు.
"ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తాం. రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తాం. పేదలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొన్నాళ్లు పనులకు వెళ్లలేరు. ఆ సమయంలో వారి ఇల్లు గడవడం కష్టం. అందుకే మానవతా దృక్పథంతో ఈ సాయం చేస్తాం" అని సీఎం జగన్ చెప్పారని సాక్షి తెలిపింది.
రాష్ట్ర ప్రజలకు నవంబర్ 1 నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తలసేమియా, కుష్టు, పోలియో, బోధకాలు, పుట్టుకతోనే వచ్చే హెచ్‌చ్‌వీ, పక్షవాతం బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్ ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఫొటో సోర్స్, FB/TelanganaCMO
ఏం కొందామన్నా కల్తీయే: కేసీఆర్
ఇవాళ బజారుకు వెళ్లి ఏ వస్తువు కొందామన్నా కల్తీయే ఉంటోందని, చివరకు పసి పిల్లలు తాగే పాలను కూడా దుర్మార్గులు కల్తీ చేస్తున్నారని, సింథటిక్ పాలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని, కారంలో రంపపు పొట్టు కలుపుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం సాయంత్రం ఆహార పదార్థాల కల్తీ, రైతు సమన్వయ సమితి, డీలర్ల ఖాళీల అంశాలపై ఆయన మాట్లాడారు. ముంబయి మార్కెట్లో విజయ నెయ్యికి చాలా డిమాండ్ ఉందని, చివరకు విజయ పాల ఉత్పత్తులను కూడా దుర్మార్గులు కల్తీ చేయకుండా వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్తీలేని పళ్లు, కూరగాయలు ప్రజలకు అందాలంటే ఒక నూతన వేదిక రావాలని సీఎం ఆకాంక్షించారు. రేషన్ డీలర్లు, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కల్తీ లేని స్వచ్ఛమైన ఆహార పదార్థాలు అందజేస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, TTD
టీటీడీ పాలకమండలి: ఏపీ నుంచి ఎనిమిది మంది, తెలంగాణ నుంచి ఏడుగురు
ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల జాబితాను బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిందని, మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన జాబితాతో ఉత్తర్వులు జారీచేసిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి ఏపీ ప్రభుత్వం స్థానం కల్పించింది. దిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి ప్రభుత్వం పాలకమండలిలో చోటు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి వీ ప్రశాంతి, యూవీ రమణమూర్తి, గొల్ల బాబూరావు, మల్లికార్జున్‌రెడ్డి, కే పార్థసారథి, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనిత, చిప్పగారి ప్రసాద్‌కుమార్‌లకు; తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వర్‌రావు, డీ దామోదర్‌రావు, బీ పార్థసారథిరెడ్డి, జీ వెంకట భాస్కరరావు, మూరంషెట్టి రాములు, కే శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డిలకు స్థానం లభించింది.
తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తవరపు, కుమారగురు, దిల్లీ నుంచి ఎంఎస్ శివశంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేశ్ శర్మ, కర్నాటక నుంచి రమేశ్‌శెట్టి, సంపత్ రవినారాయణ, సుధా నారాయణమూర్తిలకు అవకాశం దక్కింది.
ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి (ఎండోమెంట్), దేవాదాయశాఖ కమిషనర్, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఉంటారు.

ఫొటో సోర్స్, TWITTER/@trsharish
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లపై 900 కేసులు: హరీశ్‌రావు
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 95,345 పోస్టులను మంజూరు చేసిందని, ఏర్పడిన ఖాళీలతో కలిపి 1,49,382 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్లు జారీ చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారని నమస్తే తెలంగాణ రాసింది.
వీటిలో ఇప్పటికే 1,17,714 పోస్టుల భర్తీ పూర్తయిందని హరీశ్ చెప్పారు. మరో 31,660 పోస్టుల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై 900 కేసులు వేశారని ఆయన తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ- టీఎస్‌పీఎస్సీ ద్వారా 26,481, డీఎస్సీ ద్వారా 10,978, పోలీసు నియామక బోర్డు ద్వారా 31,972, టీఆర్టీ- 2,932, ఆర్టీసీ- 4,768, సింగరేణి- 12,500, ఎలక్ట్రిసిటీ- 22,637, జెన్‌కో, ట్రాన్స్‌కో ద్వారా 5096 పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కోడెల శివప్రసాద్ ఆత్మహత్య
- గుజరాత్ 2002 అల్లర్ల ముఖచిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా? వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు.. మీపై ప్రభావం పడుతుందా?
- అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








