You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్ అంటే నిన్నటి వరకూ పార్టీలో హడల్... ఇప్పుడది సడలిపోతోందా...? - ప్రెస్‌రివ్యూ
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంటే నిన్నమొన్నటి వరకు పార్టీలో అందరికీ హడల్. కానీ, ఇప్పుడది సడలిపోతున్నదనే అభిప్రాయాలు 'గులాబీ' గూటి నుంచే వ్యక్తమవుతున్నాయంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఒక కథనం ప్రచురించింది.
''లోక్‌సభ ఎన్నికల ఫలితాల ముందువరకు చాపకింద నీరులా ఉన్న అసమ్మతి సెగలు.. క్రమంగా తెరపైకి వస్తున్నాయి. అధినేతపై విధేయత చాటుకోవడం మినహా.. ఎన్నడూ ఎదురుచెప్పని గళాలు కూడా ఇప్పుడు అసంతృప్తి స్వరాలను పలికిస్తున్నాయి. కేసీఆర్ నిర్ణయాలు, వ్యవహారశైలిని తప్పుబడుతున్నాయి. వీటిని అధినేతపై తగ్గుతున్న భయం, భక్తికి సంకేతాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. టీఆర్‌ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చాక దాదాపు నాలుగున్నరేళ్లపాటు సీఎం కేసీఆర్‌కు పార్టీలో, ప్రభుత్వంలోనూ ఎదురులేదు.
బంగారు తెలంగాణ సాధన పేరుతో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో కొందరికి మంత్రి పదవులు, కీలక బాధ్యతలు అప్పగించినా.. తొలినుంచీ పార్టీలో ఉండి రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారి నుంచి చడీచప్పుడు లేదు. వారంతా అంతర్గతంగా మథనపడ్డారే తప్ప.. నోరుతెరిచి మాట్లాడటానికి సాహసించలేదు. కానీ ఇప్పుడు అసమ్మతి మొదలైంది'' అంటూ ఆ కథనంలో విశ్లేషించారు.
''పార్టీ నేతలే కొందరు కుట్ర పన్ని తమను ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటివారు బాహాటంగానే వ్యాఖ్యానించారు. గెలిచిన నేతల్లో కూడా కొందరు.. తమను ఓడించడానికి చివరిదాకా ప్రయత్నాలు జరిగాయని పార్టీ వేదికలపైనే కుండబద్దలు కొట్టారు.
మంత్రి ఈటల రాజేందర్‌ను అధిష్ఠాన శిబిరం ఉద్దేశపూర్వకంగా టెన్షన్‌కు గురి చేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ మధ్య సీఎం కేసీఆర్ తన వద్ద జరిగిన సమావేశాల వివరాలు లీక్ చేశారనే కారణంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్నారని వార్తలు కొన్ని మీడియాల్లో వచ్చాయి. దీనిని టీఆర్‌ఎస్ నేతలెవరూ ఖండించలేదు. ఇది ఈటల రాజేందర్ సన్నిహితులను ఆవేదనకు గురిచేసింది.
మంత్రి ఈటల రాజేందర్ తనదైలిలో ఆవేదనాగ్రహం వెలిబుచ్చారు. అయితే, 'గులాబీ జెండా ఓనర్లు.. కిరాయిదార్లు' అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ అధిష్ఠానాన్ని ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారం జరగడం వల్ల స్పందనలు కూడా ఆ రీతిలోనే బయటికి వస్తున్నాయి.
''ఇన్నాళ్లూ రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా లేదు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొంటామనే విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఈ పరిణామం సీఎం కేసీఆర్‌పై, అసంతృప్తిగా ఉన్నవారికి సంతోషం కలిగిస్తోంది. ఇది కూడా టీఆర్‌ఎస్ నేతల్లో తెగింపునకు కారణం'' అని పార్టీ ముఖ్యుడొకరు విశ్లేషించారు.
కేబినెట్ విస్తరణలో చోటు దక్కలేదన్న కారణంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఇప్పటికీ టీఆర్‌ఎస్ నేతలకు అందుబాటులోకి రాకుండా పోవడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చేలా ఉంది.
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు రెండు నెలలపాటు సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టకపోవడం ఆశావహులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అదే సమయంలో తన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. గతేడాది డిసెంబరు 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడితే.. 13న సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా వెంటనే జరగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న పది మందితో కేబినెట్ తొలి విస్తరణ చేపట్టేవరకు సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్ అలీతోనే ప్రభుత్వాన్ని నెట్టుకురావడం పార్టీలో చాలా మందికి నచ్చలేదు.
హరీశ్ రావుకు ప్రాధాన్యం తగ్గించారన్న ఆగ్రహం చాలామందిలో ఉంది. 'తాజాగా విస్తరణలో హరీశ్‌రావును కేబినెట్‌లోకి తీసుకొని, ఆర్థిక శాఖను కట్టబెట్టినప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయనపై సానుభూతి వెల్లువెత్తింది. పార్టీలో అసంతృప్తి రాజుకోవడానికి ప్రధాన కారణాల్లో హరీశ్‌రావుకు జరిగిన అవమానం కూడా ఒకటి' అని టీఆర్‌ఎస్ ముఖ్యుడొకరు విశ్లేషించారు.
లోక్‌సభ ఎన్నికల్లో 'సారు.. కారు.. పదహారు' నినాదంతోపాటు సీఎం కేసీఆర్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదనే ప్రశ్నతో టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజల ముందుకు వెళ్లాయి. కానీ, ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా రాష్ట్ర ఓటర్లు బీజేపీని నాలుగు, కాంగ్రెస్‌ను మూడు స్థానాల్లో గెలిపించి.. టీఆర్‌ఎస్‌ను తొమ్మిది స్థానాలకే పరిమితం చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్‌లో, ఆయన కుటుంబ సన్నిహితుడు బి.వినోద్‌కుమార్ కరీంనగర్‌లో ఓడిపోవడం టీఆర్‌ఎ్‌సకు శరాఘాతంగా మారింది. ఇది కవిత, వినోద్‌ల ఓటమి కాదని, సీఎం కేసీఆర్ పరాజయమంటూ పార్టీలో సన్నాయి నొక్కులు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్ విషయంలో పార్టీ అధిష్ఠానం వ్యవహరించిన తీరు కూడా అసమ్మతికి ఆజ్యం పోసిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.
ఎరువుల కోసం విశాఖ, గంగవరం పోర్టులకు తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం విశాఖ, గంగవరం పోర్టులను ఉన్నతాధికారుల బృందంతో కలిసి సందర్శించారని నమస్తే తెలంగాణ కథనం వెల్లడించింది.
''తెలంగాణకు సత్వరం ఎరువుల సరఫరా నిమిత్తం మంత్రి నిరంజన్ రెడ్డి విశాఖపట్నంలోని పోర్టులను సందర్శించారు.
వారంలో రాష్ర్టానికి అన్ని పోర్టుల నుంచి 20,387 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుంది. విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరగనుంది.
యూరియా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణాకు సంపూర్ణంగా సహకరిస్తామన్న గంగవరం పోర్టు సీఈవో నండూరి సాంబశివరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
గంగవరం పోర్టులో మంత్రి బృందం యూరియా నౌకను సందర్శించింద''ని ఆ కథనంలో తెలిపారు.
నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి
కృష్ణా, గోదావరి, వంశధార వరద జలాలను ఒడిసిపట్టి బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లలోగా పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని 'సాక్షి' పత్రిక కథనం వెల్లడించింది.
''జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఏ ఏడాది పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టును పరిశీలించినా స్కామ్‌లే కనిపిస్తున్నాయని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని నిర్మూలించాలని ఆదేశించారు.
ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలవారీగా అధ్యయనం చేసి నీటి లభ్యత ఉంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన కొత్త ప్రాజెక్టుల పనులు, 25 శాతం లోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపట్టాలని సీఎం సూచించార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.
చంద్రబాబు వాహనాన్ని తెలంగాణ సరిహద్దులకు తరలించిన ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశ్రాంతి తీసుకునే వాహనాన్ని(కారవాన్) ఏపీ పోలీసులు బుధవారం సాయంత్రం తెలంగాణ సరిహద్దుల్లో వదిలేసి వెళ్లిపోయారంటూ 'ఈనాడు' కథనం ప్రచురించింది.
''ఏపీలో చలో ఆత్మకూరు కార్యక్రమానికి బుధవారం సాయంత్రం చంద్రబాబు హాజరవుతారని భావించి ముందస్తుగా ఆయన కారవాన్‌ను టీడీపీ శ్రేణులు హైదరాబాద్ నుంచి ఆత్మకూరు తీసుకొచ్చారు. అక్కడ ఏపీ పోలీసులు ఆ వాహనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని డ్రైవరు మినహా మిగతావారిని దించేశారు.
కొందరు పోలీసులు వాహనాన్ని బలవంతంగా అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిలో వాడపల్లి సరిహద్దు దాటించారు. మిర్యాలగూడ-నల్గొండ రహదారి రహదారి మధ్యలో వాహనాన్ని ఆపి వెళ్లిపోయారు.
వాహనం లోపలికి వెళ్లే తాళాలను వెంట తీసుకెళ్లగా, వాహనాన్ని నడిపే తాళాలను మాత్రమే డ్రైవరుకు ఇచ్చారు.
అయోమయానికి గురయిన డ్రైవర్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఫోన్లో సమాచారమిచ్చారు. అక్కడివారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌కు సమాచారమిచ్చారు. వాహనాన్ని ఆయన మిర్యాలగూడలోని తన ఇంటివద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ పంపించారు.
ఇవి కూడా చదవండి:
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)