'చలో ఆత్మకూరు'పై పోటాపోటీ ఆందోళనలకు టీడీపీ, వైసీపీల పిలుపు - ప్రెస్ రివ్యూ

గుంటూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. పల్నాడులో ఎక్కడికక్కడ, గుంటూరులోని టీడీపీ కార్యాలయం పరిసరాల్లోనూ, ఆ పార్టీ నిర్వహిస్తున్న 'వైకాపా బాధితుల పునరావాస శిబిరం' వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారని 'ఈనాడు' కథనం తెలిపింది.

'టీడీపీ నాయకుల్ని బైండోవర్‌ చేశారు. కొందరిని హౌన్‌ అరెస్టు చేశారు. "సేవ్‌ డెమోక్రసీ.... సేవ్‌ పల్నాడు' పేరుతో టీడీపీ బుధవారం 'చలో ఆత్మకూరు' కార్యక్రమం తలపెట్టింది. దానికి పోటీగా వైసీపీ బుధవారమే 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి సిద్ధమైంది. రెండు పార్టీలు పోటాపోటీగా పల్నాడు వెళ్లేందుకు సిద్ధమవడం, మంగళవారం తెదేపా, వైకాపా నేతలు విలేకరుల సమావేశాలు పెట్టి పరస్సర ఆరోపణలు చేసుకోవడం, పోలీసు ఉన్నతాధికారులను కలవడంతో వాతావరణం వేడెక్కింది.

మంగళవారం ఉదయమే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు తాజా పరిస్థితులపై పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, బాధితుల డిమాండ్లపై చర్చించారు. మరోవైపు అదనపు ఎస్పీ, గుంటూరు ఆర్డీవో టీడీపీ నిర్వహిస్తున్న బాధితుల పునరావాస శిబిరానికి వచ్చి పలుమార్లు పార్టీ నేతలతో చర్చించారు.

డీజీపీ స్థాయి అధికారి వచ్చి రాష్ట్రంలోని వైసీపీ బాధితులందరి సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో సమస్య కొలిక్కి రాలేదు. మంగళవారం సాయంత్రానికి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పునరావాస శిబిరంతో పాటు, టీడీపీ కార్యాలయం పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. శిబిరంలోని వారిని బలవంతంగా వారి గ్రామాలకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మంగళవారం రాత్రి గుంటూరులోని వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని పరిశీలించారు.

మరోవైపు 'చలో ఆత్మకూరు' పర్యటనకు అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు గుంటూరు రేంజి ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిశారు. టీడీపీ బాధితులతో కలిసి తామూ ఆత్మకూరు వెళ్తామని వారు చెప్పారు. అయితే, పల్నాడులో 144 సెక్షన్ ఉన్నందున అనుమతి ఇవ్వలేమని ఐజీ వారికి చెప్పారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో 'హత్యలు'.. ఏం జరుగుతోంది?

నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు జరిగాయంటూ 'సాక్షి' పత్రిక తన కథనంలో తెలిపింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చే రకరకాల టాస్కుల్లో భాగంగా మంగళవారం ''ఇంట్లోని కొంతమందిని దెయ్యాల పాత్రలు వేయించిన బిగ్‌బాస్‌ మిగతావారిని హత్య (ఫన్నీగా) చేసి దెయ్యాల పాత్రల్లోకి మార్చాలనే టాస్క్‌ ఇచ్చాడు. తొలుత వితికా, బాబా, హిమజ, రాహుల్‌, శిల్పాలు దెయ్యాల పాత్రలు పోషిస్తారని తెలిపాడు. ఈ దెయ్యాలు మనుషులను విసిగిస్తూ ఉండాలని చివరకు హత్య చేయాల్సి ఉంటుందని సూచించాడు' అని ఆ కథనంలో తెలిపారు.

''ఈ క్రమంలో శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టాలని, వరుణ్‌కు మూడుసార్లు ముద్దుపెట్టాలని, బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఘోస్ట్‌ అని రాయాలని, మహేష్‌ చేత ఐదుసార్లు షర్ట్‌ విప్పేలా చేయాలని, పునర్నవిని స్విమ్మింగ్‌పూల్‌లో పడేయాలని, రవి చేత డ్యాన్సులు చేయించాలని, శివజ్యోతిని ఏడ్పించాలనే టాస్క్‌లను ఇచ్చాడు.

దీంతో దెయ్యాల పాత్రధారులు బిగ్‌బాస్‌ హౌస్‌ను గందరగోళంగా మార్చారు. అందర్నీ ఏడిపిస్తూ, విసిగిస్తూ మనుషులను వేధించారు. ఈ క్రమంలో వరుణ్‌ సందేశ్‌కు వితికా మూడుసార్లు ముద్దుపెట్టింది. అనంతరం బాత్రూం అద్దాలపై వరుణ్‌ ఈజ్‌ ఏ ఘోస్ట్‌ అని రాయడంతో.. వరుణ్‌ హత్యకు గురైనట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో వరుణ్‌ దెయ్యంగా, వితికా మనిషిగా మారింది. మరోవైపు శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టింది. దీంతో శ్రీముఖి సైతం హత్యకు గురైనట్లు ప్రకటించాడు. వితికా, శిల్పా, బాబా భాస్కర్‌లు కలిసి పునర్నవిని స్విమ్మింగ్‌ పూల్‌లో పడేశారు'' అంటూ బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లో భాగంగా జరిగిన పరిణామాలను ఆ కథనంలో వివరించారు.

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్: చింతామోహన్

''తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర ఎన్నికల అనంతరం దీనికి ముహూర్తం ఖరారు చేసింది'' అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ చెప్పారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక తన వార్తాకథనంలో తెలిపింది.

''చింతా మోహన్ మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ను రద్దు చేసి తేనెతుట్టె వంటి సున్నితమైన అంశాన్ని కదిపారన్నారు'' అని ఆ కథనంలో తెలిపారు.

అసంతృప్తులను బుజ్జగించే పనిలో కేటీఆర్.. ఇంకా చల్లారని నాయిని

టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను చల్లార్చేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారని.. అసంతృప్తుల్లో కొందరిని పిలిపించుకుని, మరికొందరికి ఫోన్లు చేసి బుజ్జగించారని 'వెలుగు' పత్రిక తన కథనంలో తెలిపింది.

''మంత్రివర్గంలో చోటు దక్కలేదంటూ కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా ఎదుట అసంతృప్తి వ్యక్తంచేశారు. అది మీడియాలో ప్రధానంగా ప్రసారమైంది. దీంతో పార్టీలో పట్టు తప్పుతోందని భావించిన సీఎం కేసీఆర్ అసంతృప్త నేతలతో మాట్లాడాలని కేటీఆర్‌ను ఆదేశించినట్లు తెలిసింది.

కేటీఆర్ పలువురు నేతలకు ఫోన్లు చేసి మాట్లాడారని, ఫోన్లో అందుబాటులోకి రానివారిని తన సన్నిహితులను పంపించి ప్రగతి భవన్‌కు పిలిచి మాట్లాడారని సమాచారం. ఈ నేపథ్యంలో అసంతృప్తులు వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.

మంత్రి పదవి రాకపోవడంపై తమకు అసంతృప్తేమీ లేదని బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణారెడ్డి ప్రెస్ నోట్లు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కూడా తన వ్యాఖ్యలకు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. బీపీ ఎక్కువై తొలి రోజు అసెంబ్లీకి రాలేదని జోగు రామన్న చెప్పారు. జూపల్లి తాను నిఖార్సయిన టీఆరెస్ నాయకుడినన్నారు. అయితే నాయిని నర్సింహారెడ్డి మాత్రం ఇంకా నోరు విప్పలేదు. సీఎం కేసీఆరే స్వయంగా ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది'' అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)