You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబు: ముందు నాపై కేసు పెట్టమనండి - ప్రెస్ రివ్యూ
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెల 11న 'చలో ఆత్మకూరు'కు తరలిరావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదని ఈ పర్యటన ద్వారా చాటుదామని చంద్రబాబు అన్నారు. పోలీసులు పెట్టే ప్రతి అక్రమ కేసుకు సమాధానం చెప్పేలా దీన్ని నిర్వహిద్దామన్నారు.
పార్టీ నేతలతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తలపై దాడుల గురించి మానవ హక్కుల సంఘానికి తెలపడంతో పాటు ప్రైవేటు కేసులు నమోదు చేద్దామన్నారు.
'వీళ్ల ఆటలు సాగనిచ్చేది లేదు. ఇష్టానుసారం కొడతామంటే పడేందుకు సిద్ధంగా లేం. ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి, నేనూ చూస్తా. అందరికంటే ముందు నేనుంటా... ముందు నామీద కేసు పెట్టమనండి చూద్దాం' అని చంద్రబాబు సవాలు చేశారు. బాబాయిని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
''కేసీఆర్ మంత్రి వర్గంలో పెద్దకులపోళ్లే ఎక్కువ''
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో అగ్రకులాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ఆరుగురిలో నలుగురు ఓసీలు ఉండగా, ఒకరు ఎస్టీ, మరొకరు బీసీలకు చెందినవారున్నారు.
మొత్తంగా 18 మందితో కూడిన కేబినెట్‌లో పది మంది ఓసీలు (రెడ్లు ఆరుగురు, వెలమలు నలుగురు, కమ్మ ఒకరు) ఉండగా, బీసీలు నలుగురు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
రెడ్ల నుంచి ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉండగా, తాజా విస్తరణలో సబితా ఇంద్రారెడ్డికి చోటు కల్పించారు.
అలాగే వెలమ నుంచి ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు కేబినెట్‌లో కొనసాగుతుండగా విస్తరణలో హరీశ్‌రావు, కేటీఆర్‌లకు అవకాశం కల్పించారు.
టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పడిన ప్రభుత్వంలో కమ్మ వర్గానికి కేబినెట్‌లో చోటుదక్కలేదు. ప్రస్తుత కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కి మంత్రిగా అవకాశం వచ్చింది.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఓసీ జనాభా 8 శాతం ఉండగా 61 శాతం పదవులు ఆ వర్గాల వారికే దక్కాయి.
ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 400 కోట్లు: రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ
అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందిస్తామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనున్నట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్లను సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ నెల నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున ఈ మొత్తాన్ని ఇవ్వనుంది.
రేపటి నుంచి (మంగళవారం) అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు వెళ్తాయి. అనంతరం వెరిఫికేషన్ కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపుతారు. ఆ తర్వాత సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపజేయనున్నారు.
తెలంగాణలో బహిరంగ మలవిసర్జనకు పాల్పడిన వ్యక్తికి 'చెంబు రాజు' బిరుదు
తెలంగాణలోని మంచిర్యాలలో బహిరంగ మలవిసర్జనకు పాల్పడిన వ్యక్తికి 'చెంబు రాజు' బిరుదును ఇచ్చినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ శుక్రవారం మొదలైంది. దీనిలో భాగంగా బహిరంగ మలవిసర్జనతో పరిసరాలు పాడుచేసిన వారికి చెంబు రాజు అని బిరుదు ఇస్తారు. రూ.500 జరిమానా విధిస్తారు.
మందమర్రి మండలం మామిడిగట్టులో ఓ వ్యక్తి బహిరంగ మలవిసర్జనకు చెంబుతో వెళ్తుండగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే చర్యలు తీసుకున్నారు.
జరిమానా అనంతరం అతడికి బహిరంగ మలవిసర్జనతో పరిసరాల మీద పడే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఇవి కూడా చదవండి.
- రామ్ జెఠ్మలానీని వాజ్‌పేయి ఎందుకు రాజీనామా చేయమన్నారు
- వాజ్‌పేయి 'హిందూ హృదయ సామ్రాట్' మోదీకి మార్గం ఎలా సుగమం చేశారు?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను ఎలా చంపారు?
- చంద్రయాన్-2: ‘ల్యాండర్ విక్రమ్ ఆచూకీ దొరికింది’ - ఇస్రో ఛైర్మన్ కె శివన్
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రి సబిత ఇంద్రారెడ్డి.. క్యాబినెట్లోకి తిరిగొచ్చిన కేటీఆర్, హరీశ్ రావు
- చంద్రయాన్-2: చందమామకు 2.1 కిలోమీటర్ల దూరంలో అసలేం జరిగింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)