చంద్రయాన్ క్విజ్‌: జాబిలిపై ల్యాండర్ దిగడాన్ని మోదీతో కలిసి వీక్షించే అవకాశం - ప్రెస్ రివ్యూ

విద్యార్థులకు అంతరిక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 10న ఆన్‌లైన్‌లో ఓ క్విజ్ పోటీని నిర్వహస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించిందని ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది.

దేశవ్యాప్తంగా 8-10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులని ఇస్రో తెలిపింది. క్విజ్‌లో పాల్గొనాలనుకునేవారు క్విజ్.ఎంవైజీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

5 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుందని, దీనికి భారత దేశ విద్యార్థులు మాత్రమే అర్హులని ఇస్రో తెలిపింది. తక్కువ సమయంలో సరైన సమాధానాలిచ్చిన విద్యార్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరేసి విద్యార్థులను విజేతలుగా ఎంపికచేస్తారు.

వీరిని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి ఆహ్వానించి సెప్టెంబర్ 7న జాబిలిపై ల్యాండర్ దిగే దృశ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వీక్షించే అవకాశం కల్పిస్తారు.

తెలంగాణలో 'టార్గెట్ 60'

తెలంగాణ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతల పెంపుదలకు త్వరో 60 రోజుల ప్రణాళికను అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం కాలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వివిధ రూపాల్లో ఎన్నో వేల కోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రావడం లేదని అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగుచేసుకునే పద్ధతి రావాలని సీఎం ఆకాంక్షించారు.

టార్గెట్ 60లో భాగంగా పవర్ వీక్, హరితహారం నిర్వహించనున్నారు.

గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖది కీలక పాత్ర పోషించేందుకు ఆ శాఖను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామని చెప్పారు.

15 నుంచి ఇంటింటి సర్వే

సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వివరాలనూ పూర్తిగా సేకరించేందుకు కసరత్తు చేస్తోందని సాక్షి తెలిపింది.

గ్రామ వలంటీర్ల నియామకాలు పూర్తికాగానే, ఈ నెల 15 నుంచి ఆయా వలంటీర్ల పరిధిలోని 50 ఇళ్ల నుంచి ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఆగస్ట్ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.

మూడేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ప్రజా సాధికార సర్వే (పల్స్) వివరాలను వలంటీర్లకు అందచేయనున్నారు. ఎలాంటి సమాచారం సేకరించాలనే దానిపై అధికారులు సోమవారం నాటికి స్పష్టతనిస్తారు.

3 గంటల ఛార్జింగ్‌తో 150 కి.మీ. ప్రయాణం

ఏపీఎస్ఆర్టీసీ త్వరలో 1000 ఏసీ విద్యుత్ బస్సులు కొనేందుకు సిద్ధమవుతోందంటూ ఈనాడు పేర్కొంది.

విద్యుత్ బస్సుల వినియోగంపై అధ్యయనం చేయాలని విలీనంపై నియమించిన కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రస్తుతం ఉన్న ఏసీ బస్సుల్లో కిలోమీటర్ ప్రయాణానికి సంస్థకు రూ.20 వరకూ ఖర్చవుతోంది. అదే విద్యుత్ బస్సులను ప్రవేశపెడితే ఈ వ్యయం రూ.6కే పరిమితమవుతుందని అధికారులు చెబుతున్నారు. డీజిల్ ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఈ బస్సులను 3 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయని, వీటికోసం డిపోల పరిధిలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌లో 40 విద్యుత్ బస్సులను నడుపుతోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)