'తెలంగాణలో టీఆర్‌ఎ‌స్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే... కాంగ్రెస్ పార్టీ మునిగే పడవ': ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి -ప్రెస్ రివ్యూ

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందని, పార్టీ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారని సాక్షి రాసింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశం కనిపించడం లేదని, అది మునిగిపోయే పడవని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ నియంతృత్వ ధోరణులను అడ్డుకోవాలంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ తప్ప మరొక పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు.

శనివారం నల్లగొండ కలెక్టరేట్‌లో డిండి ప్రాజెక్టు నిర్వాసితులతో సమీక్ష సమావేశానికి హాజరైన సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా పార్టీని సమన్వయపరచలేక పోయారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయిందని, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే నాథుడే లేరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా ఉత్తమ్‌ మాత్రం అలా ఆలోచించలేకపోయారని విమర్శించారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను, నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదని, కేసీఆర్‌ను, ఆయన కుటుంబ పాలనను ఢీకొట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీ వంటి నేతకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

పీసీసీ సారథ్యాన్ని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ - ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని, అంతా అయిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరాలని తాను ఇంకా నిర్ణయించుకోలేదని, భవిష్యత్తులో ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితిపై నాయకత్వం ఆలోచన చేయాలని, డీకే అరుణ వంటి నాయకులు బీజేపీలోకి ఎందుకు వెళ్లిపోయారో సమీక్షించుకోవాలని సూచించారు.

కిడ్నాపులపై వదంతులు నమ్మొద్దు: తెలంగాణ డీజీపీ

కిడ్నాప్ గ్యాంగ్‌లు, నరహంతకముఠాలు తెలంగాణలో చొరబడ్డాయంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమని, అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠినచర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

"ఒడిశా నుంచి ఈ రోజే అందిన సమాచారం.. బిహార్ నుంచి ఝార్ఖండ్ మధ్యలో బిచ్చగాళ్ల వేషంలో 500 మంది బయల్దేరారు.. ఒంటరిగా దొరికినవాళ్లను చంపి కిడ్నీల దందాలకు సరఫరా చేస్తున్నారు. వీరిలో ఏడుగురు పట్టుబడ్డారు. వాళ్లను విచారిస్తే.. 500 మంది ముఠా ఉన్నట్టు ఒప్పుకున్నారు. ఎంతవీలైతే అంతమందికి ఈ మెసేజ్‌ను వాట్సాప్ ద్వారా చేరవేయగలరు" అనే ఒక మెసేజ్ శనివారం వాట్సప్‌లో వైరల్‌గా మారింది.

వాస్తవానికి ఇలాంటి ముఠాలేవీ లేవు. ఈ తప్పుడు మెసేజ్ కారణంగా పిచ్చివాళ్లు, బిచ్చగాళ్లపై అనుమానంతో దాడులుచేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వదంతులు వ్యాప్తిచేసేవారిపై పోలీస్‌శాఖ దృష్టిపెట్టింది.

ఏపీలో రేపు వైద్యసేవల బంద్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ ఓపీ సహా అన్ని రకాల సాధారణ వైద్యసేవల్ని నిలిపివేస్తున్నట్లు భారత వైద్యుల సంఘం(ఐఎమ్‌ఏ) రాష్ట్ర విభాగం ప్రకటించిందని ఈనాడు రాసింది.

దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను, ముఖ్యంగా కోల్‌కతాలో జరిగిన దాడిని తీవ్రంగా నిరసిస్తున్నామని ఈ విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.శ్రీహరిరావు, పి.ఫణిదర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను పరిష్కరించనందునే ఈ నిరసన పాటిస్తున్నట్లు వారు వివరించారు. అత్యవసర కేసుల్ని మాత్రమే చూస్తామని, ప్రజలు దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రైళ్లలో మసాజ్‌.. తూచ్‌

రైలు ప్రయాణికులకు మసాజ్‌ సేవలు అందించాలన్న ప్రతిపాదనను పశ్చిమ రైల్వే ఉపసంహరించుకుందని ఈనాడు తెలిపింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి బయల్దేరే రైళ్లలో ప్రయాణికులకు తల, మెడ, పాదాలకు మసాజ్‌ సేవలు అందిస్తామని ఇంతకుముందు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

పశ్చిమ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తెలియగానే దాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు శనివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఇచ్చే సూచనలను పశ్చిమ రైల్వే గౌరవిస్తుందని, వాటిలో సరైనవాటిని ఎప్పటికప్పుడు అమలు చేస్తుందని ఆ ప్రకటనలో చెప్పారు. బీజేపీ నేతల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.

ఇండోర్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ ముందుగా దీనిపై మండిపడ్డారు. మహిళల సమక్షంలో ఇలాంటివి చేయడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని ఆయన రైల్వేమంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాశారు.

లోక్‌సభ మాజీ స్పీకర్‌, ఇండోర్‌ మాజీ ఎంపీ సుమిత్రా మహాజన్‌ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనివల్ల రైల్లో ప్రయాణించే మహిళలు అసౌకర్యంగా భావిస్తారని ఆమె అన్నారు. వారి భద్రతకు కూడా ఇది ముప్పేనన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)