You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోబ్రాపోస్ట్ ఆపరేషన్: ‘డబ్బులిస్తే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ట్వీట్ చేస్తాం’ : బాలీవుడ్ సెలబ్రిటీలు - ప్రెస్‌రివ్యూ
సార్వత్రిక ఎన్నికల వేళ డబ్బులు తీసుకుని రాజకీయ పార్టీలకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తామని ఒప్పుకుని 36 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారని సాక్షి పేర్కొంది.
వార్తల వెబ్‌సైట్ కోబ్రాపోస్ట్ పక్కాగా ప్రణాళిక రచించి ఈ రహస్య ఆపరేషన్‌ను నిర్వహించగా, 36 మంది ప్రముఖుల గుట్టు రట్టయ్యింది. ఆ 36 మందిలో జాకీ ష్రాఫ్, సోనూ సూద్, వివేక్ ఒబెరాయ్, సన్నీ లియోనీ తదితర ప్రముఖులున్నారు.
విద్యా బాలన్, అర్షద్ వార్సీ, సౌమ్య టాండన్, రజా మురాద్ వంటి అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రం తమ అంతరాత్మకు వ్యతిరేకంగా తాము ఈ పనిచేయలేమంటూ పక్కకు తప్పుకున్నారు. వివరాలను కోబ్రాపోస్ట్ ఎడిటర్-ఇన్-చీఫ్ అనిరుద్ధ్ బహల్ మంగళవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కోబ్రాపోస్ట్ ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేసింది. అనిరుద్ధ చెప్పినదాని ప్రకారం.. కోబ్రాపోస్ట్ రిపోర్టర్లు ఒక ప్రజాసంబంధాల కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ ఆయా సెలబ్రిటీలను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు.
తమకు రాజకీయ పార్టీలతో ఒప్పందాలు ఉన్నాయనీ, ఆ పార్టీలకు ప్రచారం కల్పించేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తే డబ్బిస్తాం అంటూ సెలబ్రిటీలకు రిపోర్టర్లు చెప్పారు. పోస్ట్‌ల్లో ఉండాల్సిన సమాచారాన్ని తమ కంపెనీ సిబ్బంది పంపుతారనీ, ఆ సమాచారాన్ని సెలబ్రిటీలు తమ సొంత అభిప్రాయాలుగా తమ ఖాతాల్లో పోస్ట్ చేస్తే చాలు, డబ్బులిస్తామంటూ రిపోర్టర్లు ఆ 36 మందితో చెప్పారు.
అత్యాచార కేసులు, వంతెనలు కూలడం వంటి ప్రమాద ఘటనల్లో ప్రభుత్వాన్ని వెనకేసుకొసుకు రావడం కూడా ఈ పోస్ట్‌ల్లో ఉంటాయని స్పష్టంగా చెప్పారు. ఇదంతా తమకు సమ్మతమేననీ, పోస్ట్‌లు, ట్వీట్‌లు చేస్తామంటూ రిపోర్టర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఆ 36 మంది సెలబ్రిటీల్లో ఎక్కువగా మధ్యస్థాయి ప్రాచుర్యం కలిగిన నటీనటులు, గాయకులు, నృత్యకారులు తదితరులున్నారు. వారి పాపులారిటీని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్వీట్ లేదా పోస్ట్‌కు రూ. 2 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేశారు. మొత్తం 8 నెలల కాలంపాటు ఉండే ఒప్పందానికి రూ. 20 కోట్లు ఇవ్వాలని కూడా కొందరు కోరారు.
కోబ్రా పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం జాకీ ష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, సన్నీ లియోన్, అమీషా పటేల్, టిస్కా చోప్రా, రాఖీ సావంత్, సోనూ సూద్, కైలాష్ ఖేర్, బాబా సెహ్‌గల్, శ్రేయాస్ తల్పాడే, శక్తి కపూర్, పంకజ్ ధీర్, నిఖితిన్ ధీర్, పునీత్ ఇస్సార్, రాజ్‌పాల్ యాద వ్, మినిషా లాంబా, మహిమ చౌధరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కొయెనా మిత్ర, రాహుల్ భట్, దలేర్ మెహందీ, మికా, అభిజీత్ భట్టాచార్య, గణేష్ ఆచార్య, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్, విజయ్ ఈశ్వర్లాల్ పవార్ (వీఐసీ) తదితరులు పోస్ట్‌లు చేసేందుకు డబ్బులు తీసుకునే ఈ ఒప్పందానికి అంగీకరించారని సాక్షి వెల్లడించింది.
‘వైసీపీలో చేరికలకు కేసీఆర్ ప్రోత్సాహం’
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిలో నిరాశానిస్పృహలు పెరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
'తెలంగాణలోని ఆస్తులపై నేతలను బెదిరిస్తూ వైసీపీలో చేరికలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీ పడుతోంది. మన ప్రాజెక్టులను అడ్డుకునే వారితో జగన్ కుమ్మక్కవుతున్నారు. వీళ్ల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావు. తీవ్ర నష్టం కలుగుతుంది. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. కుట్రదారులకు గుణపాఠం చెప్పాలి. మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలి' అని పిలుపిచ్చారు.
మంగళవారం ఉదయం తన నివాసం నుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, బూత్ కన్వీనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే సహించేదిలేదని చంద్రబాబు అన్నారు. 'బీజేపీ రాజకీయాలే కశ్మీర్లో సంక్షోభానికి కారణం. పుల్వామా దాడిపై మమతా బెనర్జీ అనుమానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. మోదీ ఏ అరాచకానికైనా సమర్థుడు. గుజరాత్‌లో 2 వేల మంది నరమేధాన్ని మరువలే'మన్నారు.
నవ్యాంధ్రలో రైతులకు జరిగినంత మేలు దేశంలో ఎక్కడా జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 'రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి దఫాగా రూ.1,000 వేశాం. డబ్బు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అన్నదాతా సుఖీభవ పథకాన్ని రైతులంతా స్వాగతిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పసుపు-కుంకుమకు మించి అన్నదాతల ప్రజాదరణ ఉంది' అని చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
‘తెలంగాణ ట్రెండ్‌సెట్టర్’
అభివృద్ధిలో, ఆర్థిక నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందని పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.
దార్శనికుడైన ముఖ్యమంత్రి తీసుకొంటున్న నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధిలో ఆవిర్భావం నుంచి దూసుకుపోతున్నదన్నారు. ఏయేటికాయేడు సంపదను గణనీయంగా పెంచుకొంటూ పోతున్న తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణకోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు అద్భుతమన్నారు. ఆయా పథకాల గురించి విడివిడిగా ప్రస్తావించారు.
జూబ్లీహాల్‌లో మంగళవారం 15వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు ఆర్థిక సంఘం చైర్మన్, ఇతర సభ్యులు.. రాష్ట్రం తరపున ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, మంగళవారం ప్రమాణం చేసిన పదిమంది మంత్రులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మీడియాసమావేశంలో చైర్మన్ ఎన్‌కే సింగ్ మాట్లాడుతూ.. తమ సంఘం సభ్యులు మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి అన్ని విషయాలను తెలుసుకున్నారని, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, ఇతర పనులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంచి వాతావరణంలో పారదర్శకమైన రీతిలో చర్చించామన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వృద్ధిరేటులో గణనీయంగా పురోగతి సాధిస్తున్నదని ఆర్థిక సంఘం చైర్మన్ చెప్పారు. తెలంగాణ జీఎస్డీపీ రేటు దేశ సగటు కంటే 60% అధికంగా ఉన్నదని తెలిపారు. జీఎస్టీ పన్నుల రాబడిలో కూడా తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నదన్నారు. 14% పైగా రాబడి సాధించి దేశం లో అగ్రభాగాన నిలిచిందని, మొదటి నెల మినహా ఎప్పుడూ కేంద్రం నుంచి పరిహారం తీసుకోలేదన్నారు.
సులభ వాణిజ్య విధానంలో రెండోస్థానంలో తెలంగాణ కొనసాగుతున్నదని అభినందించారు. పెట్టుబడి వ్యయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు. భవిష్యత్‌లో ఉపయోగపడేలా ప్రాజెక్టులను చేపట్టి పెట్టుబడి వ్యయాన్ని 27 శాతానికి పెంచిందన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చే పద్ధతి.. పారిశ్రామిక పురోగతికి దోహదపడుతుందని చెప్పారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
మున్నాభాయ్ డిగ్రీ కాలేజ్‌లు
మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో ఆసుపత్రి లేకున్నా ఉన్నట్లు నాటకమాడడం తెరమీద రక్తికట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అంతకంటే ఎక్కువగా జీవించేస్తున్నాయని ఈనాడు ఒక కథనంలో వెల్లడించింది.
వందల మంది విద్యార్థులున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా అందులో ఒక్కరంటే ఒక్క విద్యార్థీ ఉండని కళాశాలలు బోలెడు. ఒక్క కంప్యూటర్ కూడా లేకుండానే కంప్యూటర్ కోర్సులు నడిపే కాలేజ్‌లు, అధ్యాపకులు లేకున్నా నూరు శాతం ఉత్తీర్ణత చూపే కళాశాలలు తక్కువేమీ కాదు. తనిఖీలు, పర్యవేక్షణలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం మానేయడంతో రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది.
గుంటూరు జిల్లాలోని కల్లూరులోనే డిగ్రీ కళాశాల రికార్డుల్లో కొనసాగుతున్నా నాలుగైదేళ్లుగా ఇక్కడ ఒక్క విద్యార్థీ చేరకపోవడం గమనార్హం. ఇలాగే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు కాగితాల్లోనే కొసాగుతున్నాయి. వీటిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చూపుతున్న నిర్వాహకులు బోధన రుసుముల పేరుతో ప్రజాధనాన్ని మింగేస్తున్నారు. కళాశాలల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించిన ఉన్నత విద్యామండలి అక్కడ కళాశాల ఉందా? అనే విషయాన్ని విస్మరిస్తోంది.
ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లోని విద్యార్థులను సైతం విద్యా సంస్థల్లో చదువుతున్నట్లు చూపుతున్నారు. కొన్ని యాజమాన్యాలు సీఏ కోచింగ్‌కు వచ్చే ఇంటర్ విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీరు తరగతులకు హాజరుకాకపోయినా వీరి పేరిట బోధన రుసుములు పొందడం, చివరిలో పరీక్షలు రాయించడం పరిపాటిగా మారింది.
కొన్ని కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కానీ తరగతులు నిర్వహించడం లేదు. రావాల్సిన అవసరం లేదని విద్యార్థులకే నేరుగా చెప్పేస్తున్నాయి. గుంటూరులోని కొల్లిపర కళాశాలకు వెళ్లిన 'ఈనాడు' ప్రతినిధులకు అక్కడ సిబ్బంది ఇదే మాట చెప్పడం కొసమెరుపు.
బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ నిర్వహిస్తున్న కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉండడం లేదు. తూతూమంత్రంగా కోర్సులు పూర్తి చేయడంతో విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడుతోంది.
ఉన్నత విద్యామండలి కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుమతిస్తోంది. ఆ తర్వాత వర్సిటీలు అనుబంధ గుర్తింపునిస్తున్నాయి. కానీ తనిఖీలు మాత్రం చేయడం లేదు. అదేమంటే తమకు సిబ్బంది కొరత ఉందని సమాధానం వస్తోంది. కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వాలంటే కమిటీ వేయడం, నివేదిక తెప్పించుకోవడం మినహా విద్యాబోధన ఎలా సాగుతుందో పట్టించుకోవడం లేదు.
కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రైవేటు వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. సంక్షేమ శాఖలు కళాశాలల నుంచి వచ్చే వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే బోధన రుసుములను చెల్లించేస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల పాలవుతోందని ఈనాడు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- భారత్‌లో సౌదీ యువరాజు: ఈ రెండు దేశాల మధ్య స్నేహానికి అడ్డుగా నిలిచిందెవరు
- ఇయర్ ఫోన్స్ చెవిలో ఎంతసేపు పెట్టుకోవాలి
- భారత గూఢచారిగా పాక్ ఆరోపిస్తున్న కుల్‌భూషణ్ యాదవ్ ఎవరు...
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- పుల్వామా దాడి: పాకిస్తాన్‌ను దారికి తెచ్చే ఆ ‘మాస్టర్ స్ట్రోక్’ను మోదీ కొడతారా
- వర్జినిటీ ట్రీ: ఆ చెట్టుకు కండోమ్స్ కట్టి పూజలు చేస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)