You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Sri Lanka Protests: నిరసన శిబిరాలపై అర్థరాత్రి విరుచుకుపడిన భద్రతా బలగాలు.. బీబీసీ జర్నలిస్టుపై దాడి
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారుల ప్రధాన శిబిరంపై భద్రతా బలగాలు దాడి చేశాయి. వారి గుడారాలను కూల్చివేశాయి.
వందలాది సైనికులు, పోలీసు కమాండోలు అధ్యక్ష కార్యాలయానికి వెలుపల ఉన్న నిరసనకారులపై దాడికి దిగారు. మరి కొని గంటల్లోనే నిరసనకారులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి ఉండగా, ఈ ఘటన జరిగింది.
బీబీసీ వీడియో జర్నలిస్టును కూడా సైనికులు కొట్టారు. ఒక సైనికుడు ఆయన ఫోన్ లాక్కుని, అందులో ఉన్న వీడియోలు డిలీట్ చేశారు.
రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ దాడి జరిగింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష గత వారం దేశాన్ని విడిచి పారిపోయారు. అంతకుముందు ప్రధానిగా వ్యవహరించిన విక్రమసింఘే గురువారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే, రణిల్ విక్రమసింఘేకు ప్రజల్లో అంత మంచి పేరు లేదని భావిస్తున్నారు. పైగా, నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రతిజ్ఞ పూనారు.
కాగా, విక్రమసింఘేకు ఒక అవకాశం ఇచ్చి చూస్తామని కొందరు నిరసనకారులు తెలిపారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొన్ని నెలలుగా అస్థిరత నెలకొంది.
రాజపక్ష ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవహారాలను తుంగలో తొక్కిందని, విక్రమసింఘేకు కూడా ఇందులో భాగం ఉందని చాలామంది భావిస్తున్నారు.
అయితే, విక్రమసింఘే పార్లమెంటు ఓటింగులో గెలిచిన మరుసటి రోజు పెద్దగా నిరసన ప్రదర్శనలు జరుగలేదు.
ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదా ప్రభుత్వ భవనాలను ఆక్రమించడానికి చేసే ఏ ప్రయత్నమైనా ప్రజాస్వామ్యం కాదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం క్రమంగా నిరసన ఉద్యమాన్ని అణిచివేస్తుందనే ఆందోళన నిరసనకారుల్లో కనిపిస్తోంది.
బీబీసీ జర్నలిస్టులపై దాడి
నిరసన శిబిరాలపై జరిగిన దాడి గురించి కొలొంబోలోని బీబీసీ జర్నలిస్టు అణ్బరసన్ ఎతిరాజన్ వివరించారు.
"కొలంబోలో అధ్యక్ష భవనానికి వెలుపల ఉన్న నిరసన శిబిరాలపై అర్థరాత్రి దాటిన తరువాత భద్రతా బలగాలు దాడి చేయవచ్చన్న వార్త తెలిసిన వెంటనే మేం అక్కడికి వెళ్లాం.
కొద్దిసేపటికే వందలాది సాయుధ సైనికులు, పోలీసు కమాండోలు ఇరువైపుల నుంచి నిరసన శిబిరాలపై దాడికి దిగారు. సైనికులు ముఖాలు కనిపించకుండా మాస్కులు తొడుక్కున్నారు.
వారు అక్కడకి రావడంపై నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, సైనికులు మరింత విజృంభించారు. నిరసనకారులను వెనక్కి నెట్టి వేశారు.
కొన్ని నిమిషాల్లోనే, సైనికులు గట్టిగా అరుస్తూ, నిరసన శిబిరాలపై దాడికి దిగారు. గుడారాలను కూల్చివేసి, అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.
అధ్యక్ష భవనం లోపలికి కూడ బలగాలు చొచ్చుకుని వెళ్లాయి. గతవారం శ్రీలంక పౌరులు ఈ భవనాన్ని ఆక్రమించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనాన్ని తిరిగి అప్పగిస్తామని నిరసనకారులు ముందే చెప్పారు. కానీ, అంతకుముందే బలగాలు దాడికి దిగాయి.
వారి వెనుకే మేం అధ్యక్ష భవనంలోకి వెళ్లాం. దారిలో ఉన్నవాటిని తొలగిస్తూ సైనికులు ముందుకు సాగారు.
నిరసనకారులను బయటకు నెట్టివేశారు. సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న శిబిరాల వైపుకు వారిని నెట్టారు. లోపలికి ఎవరూ రాకుండా స్టీల్ బ్యారికేడ్లు పెట్టారు.
మేం ఆ ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా, మామూలు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి నా సహోద్యోగిపై విరుచుకుపడ్డారు. సైనికులు కూడా చుట్టుముట్టారు. క్షణాల్లోనే నా కలీగ్‌ను కొట్టి, ఫోన్ లాక్కున్నారు. అందులో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసి ఫోన్ వెనక్కి ఇచ్చారు.
మేం జర్నలిస్టులమని, మా విధి నిర్వహిస్తున్నామని నేను ఆయనకు వివరించాను. కానీ, నా మాట వినిపించుకోలేదు.
నా సహోద్యోగిపై మళ్లీ దాడి చేశారు. ఈ ప్రవర్తనపై మేం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాం. మరో సహోద్యోగి మైక్ లాక్కుని విసిరేశారు.
మరో ఆర్మీ అధికారి కలగజేసుకుని మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లనిచ్చారు.
నా సహొద్యోగి భయంతో వణికిపోయారు. మెల్లగా నడుచుకుంటూ మా హోటెల్‌కు చేరుకోగలిగాం.
దాడిపై మిలటరీ, పోలీసుల స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ ఎవరూ మా కాల్ ఎత్తలేదు.
శ్రీలంకలో గత వారం ప్రకటించిన అత్యవసర పరిస్థితి ఇప్పటికీ అమలులో ఉంది."
అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత విక్రమసింఘే దేశంలో రాజకీయ సుస్థిరతను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా చేస్తే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో మళ్లీ చర్చలు ప్రారంభించవచ్చు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకోవడం, రాజపక్ష దేశాన్ని విడిపారిపోవడంతో ఈ చర్చలు నిలిచిపోయాయి. సుమారు 3 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ఐఎంఎఫ్ అందిస్తుందనే ప్రతిపాదన ఉంది.
శ్రీలంక గత కొద్ది నెలలుగా అట్టుడికిపోతోంది. దేశం పూర్తిగా దివాలా తీయడంతో నిత్యావసర వస్తువులు, ఇంధనం కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. దాంతో, ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
రాజపక్ష, విక్రమసింఘే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అధ్యక్ష భవనంలోకి పౌరులు చొరబడడంతో జూలై 13న రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. శ్రీలంక నుంచి మాల్దీవ్స్‌కు పారిపోయి, ఆపై సింగపూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి తన పదవికి రాజీనామా చేశారు.
విక్రమసింఘే రాజీనామా చేయడానికి అంగీకరించారు గానీ చేయలేదు. రాజపక్ష పారిపోగానే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
గత వారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు చేపట్టమని సైన్యాన్ని ఆదేశించారు. అలాగే, ఎమెర్జెన్సీని ఈ వారానికి కూడా పొడిగించారు.
గతంలో ఆరుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన విక్రమసింఘే అధ్యక్ష పదవికి కూడా తలపడ్డారు. గత రెండు ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడి ఓడిపోయారు.
ప్రస్తుతం ఆయన దేశాధ్యక్షుడిగా పార్లమెంటు ఓటింగులో ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగిసేవరకు అంటే 2024 నవంబర్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఇవి కూడా చదవండి:
- ద్రౌపది ముర్ము: క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు.. ఆదివాసీ నేత ప్రస్థానం
- యుక్రెయిన్ ప్రథమ మహిళ: ‘యుద్ధం వల్ల నా కొడుకు సైనికుడు అవుతానంటున్నాడు’
- గోధుమ, వరి, మొక్కజొన్న, టమోటా.. టన్నుల కొద్దీ విత్తనాలను చైనా అంతరిక్షంలో తీసుకెళ్లి ఏం చేస్తోంది?
- డిజిటల్ మీడియాపై కొత్త చట్టం...ఇందులో ఏముంది? దీనిపై ఎందుకింత చర్చ జరుగుతోంది?
- Bullion Market: బంగారంపై పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)