You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక: అధ్యక్ష భవనం సౌకర్యాలను ఆస్వాదిస్తోన్న నిరసనకారులు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శ్రీలంక అధ్యక్ష నివాసంలోని సౌకర్యాలను అనుభవించే అవకాశాన్ని శనివారం సాయంత్రం నుంచి ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.
అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష నివాసాన్ని శనివారం ముట్టడించిన నిరసనకారుల్లో చాలామంది రాత్రంతా అక్కడే గడిపారు.
ఆదివారం ఉదయం కూడా ప్రతీ గదిలోకి తిరుగుతూ అధ్యక్ష భవనాన్ని ఆస్వాదించారు.
అక్కడి క్షేత్ర పరిస్థితిని, ప్రత్యేక సమాచారాన్ని బీబీసీ తమిళ్ బృందానికి చెందిన రంజన్ అరుణ్ ప్రసాద్ అందించారు.
శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుని భవనాన్ని నిరసనకారులు ముట్టడించి అందులోకి ప్రవేశించారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ భవనంలోని గదులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ప్రజలు, ఇంకా (ఆదివారం కూడా) అక్కడే ఉన్నారు.
ప్రవేశ ద్వారం మీదుగా భవనంలోకి దూకిన మొదటి వ్యక్తిని హిల్స్ ప్రాంతానికి చెందిన తమిళ యువకుడిగా గుర్తించారు. తర్వాత అతనిని అనుసరిస్తూ మిగతా వారంతా భవనంలోకి వెళ్లారు.
తొలుత, అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు అక్కడి వస్తువులను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు.
కొలంబోలో ప్రస్తుతం జరుగుతోన్న నిరసనలను స్థానిక బౌద్ధ సన్యాసులు, క్రైస్తవ, ఇస్లామ్ మత పెద్దలు, యూనివర్సిటీ విద్యార్థులు నియంత్రిస్తున్నారు.
అధ్యక్ష భవనంలోని వస్తువులను ధ్వంసం చేయడాన్ని వారు ఖండించారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేయొద్దని హెచ్చరించారు.
అధ్యక్ష భవనంలోని వస్తువులను చూసి ఆనందించాలని ఆ తర్వాత బయటకు వెళ్లి ఇతరులకు అవకాశం కల్పించాలని మతపెద్దలు నిరసనకారులకు సూచించారు.
దీని తర్వాత, చాలామంది నిరసనకారులు భవనంలోని ప్రతీ రూమ్‌లోకి వెళ్లి చూశారు. కొంతమంది నిరసనకారులు, కిచెన్‌లోకి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నారు. కొంతమంది ఫ్రిజ్ నుంచి జ్యూస్‌లు, ఆల్కహాల్ వంటి పానీయాలను తీసుకొని తాగారు.
మరికొంతమంది అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉపయోగించే విశ్రాంతి గదిలోకి వెళ్లారు. ఆ గదిలో అమర్చి ఉన్న ఏసీ, ఇతర సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. కొందరు టాయిలెట్‌ను వాడుకున్నారు. దానికి సమీపంలోనే ఉన్న బాత్రూమ్ ఒక పెద్ద గదిలా ఉండటం చూసి వారు విస్తుపోయారు.
మరికొంతమంది నిరసనకారులు, అధ్యక్షుడు ఉపయోగించే గదిలోకి వెళ్లి అల్మారాలను తెరిచి చూశారు. అందులోని సూట్, ఇతర దుస్తులు వేసుకొని ఫొటోలు తీసుకున్నారు.
ఆ భవనంలోని ఒక అతిపెద్ద గదిలో జిమ్ ఉంది. కొంతమంది అక్కడికి వెళ్లి వ్యాయామం చేయడం ప్రారంభించారు.
మరో గదిలోని విలాసవంతమైన పరుపులపై దూకుతూ కొంతమంది కేరింతలు కొట్టారు. బెడ్‌పై దొర్లుతూ కొన్ని నిమిషాల పాటు అధ్యక్ష భవనంలో జీవితాన్ని ఆస్వాదించి బయటకు వెళ్లిపోయారు.
దీని పక్కనే భారీ స్విమ్మింగ్ పూల్ ఉంది. దీన్ని కేవలం అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యుల కోసమే ప్రత్యేకంగా నిర్మించారు.
వందలాది మంది ప్రజలు ఆ స్విమ్మింగ్‌పూల్ చుట్టూ గుమిగూడారు. కొంతమంది అందులో దూకి ఈత కొట్టారు.
ఇంతలో పెద్ద ఎత్తున ప్రజలు అధ్యక్ష భవనంలోకి రావడం మొదలైంది. దీంతో నిరసనకారులను నియంత్రించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రతినిధులు, ప్యాలెస్ ప్రధాన గేటును మూసి వేశారు. గుంపును నియంత్రించడం ప్రారంభించారు.
చిన్న గ్రూపులుగా నిరసనకారులను లోపలికి అనుమతించారు. అధ్యక్ష భవనంలోని విలాసవంతమైన సౌకర్యాలను చూసిన తర్వాత వారిని బయటకు పంపించారు.
శ్రీలంక అధ్యక్ష భవనంలోని స్ట్రీట్ కార్నర్ వరకు సాధారణ పౌరులు కూడా నడవడానికి వీల్లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, తీవ్రమైన నిరసనల కారణంగా శనివారం మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి.
దీంతో అధ్యక్ష భవనం ఎదుట మోహరించిన పోలీసులు, సైన్యం కూడా వెనుదిరిగి వెళ్లిపోయింది. అధ్యక్ష భవనం పరిసరాలు, సమీప వీధుల్లో జరుగుతోన్న ఘటనల్ని పోలీసులు చూస్తూ ఉండిపోయారు.
నిరసనల్లో పాల్గొన్న సాధారణ పౌరులు, అధ్యక్ష భవనంలోని విలాసవంతమైన వసతులను, సౌకర్యాలను ఆస్వాదించారు.
అధ్యక్ష భవనాన్ని సందర్శించి బయటకు వెళ్లిన చాలామంది నిరసనకారులు తమ అనుభవాలను ఇతరులతో ఆనందంగా పంచుకోవడం కనిపించింది.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది నిరసనకారులు చాలా ప్రాంతాల్లో టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది పాటలు పాడుతూ, డ్యాన్స్ చేశారు.
''గొటాబయ, రణిల్‌లను తొలిగించాం. ఇక శ్రీలంకలో కొత్త శకానికి ఇది నాంది'' అని అధ్యక్ష భవనం వద్ద నిరసనల్లో పాల్గొన్న ఫియోనా సిర్మానా అనే మహిళ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)