You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
శ్రీలంకలో అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష, ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె భవనాలను నిరసనకారులు ముట్టించిన అనంతరం పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రజలు తమకు సహకరించాలని శ్రీలంక త్రివిధ దళాధిపతి జనరల్ షవేంద్ర సిల్వా అభ్యర్థించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైన్యం చర్యలు తీసుకొంటోందని ఆయన చెప్పారు.
గోటాబయ అధికారిక నివాసాన్ని శనివారం మధ్యాహ్నం నిరసనకారులు ముట్టడించారు. మరోవైపు అదే రోజు రాత్రి ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె ప్రైవేటు నివాసానికీ నిప్పు పెట్టారు.
కొలంబోలోని పెట్రోలు బంకుల్లో చమురు సరఫరాను మళ్లీ పునరుద్ధరించినట్లు శ్రీలంక ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. మరోవైపు ట్రింకోమలీ టెర్మినల్‌ను కూడా 24 గంటల్లో తెరచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
శనివారం నాటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీలంక నాయకత్వానికి అమెరికా సూచించింది.
తగ్గిన బందోబస్తు
ప్రధాన కూడళ్లలో శనివారం విధులు నిర్వర్తించిన పోలీసులు, సైనిక సిబ్బంది తమ శిబిరాలు, స్టేషన్లకు తిరిగి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం చాలా తక్కువ మంది వీధుల్లో కనిపించారు.
శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులను శనివారం అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో అధ్యక్ష భవనం బయట గోడ దగ్గర నిరసనకారులు కనిపిస్తున్నారు. వారు లోపలకు రాకుండా మెషీన్ గన్లతో భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతూ కనిపిస్తున్నారు.
అయితే, కాల్పులు జరిపినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. గేటుపై నుంచి దూకి వారు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు.
మరోవైపు విక్రమసింఘె ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసుల అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.
రాజీనామా చేస్తానని గోటాబయ రాజపక్ష ప్రకటించడంతో కొలంబోలో వీధుల్లో కొంతమంది నిరసనకారులు సంబరాలు చేసుకుంటూ కనిపించారు. చాలామంది పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు
కర్ఫ్యూతోపాటు నిరసనకారులపై చర్యలతో శ్రీలంక మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు శ్రీలంక మానవ హక్కుల సంస్థ (ఎస్‌హెచ్ఆర్‌సీ) కూడా శనివారం సాయంత్రం స్పందిస్తూ.. కర్ఫ్యూ విధించడాన్ని తప్పుపట్టింది.
‘‘ప్రత్యక్షంగా చేయలేని వాటిని పరోక్షంగా చేయాలని చూడకండి’’అని ఎస్‌హెచ్ఆర్‌సీ వ్యాఖ్యానించింది. నిరసనకారుల ప్రదర్శనను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో కర్ఫ్యూ విధించడంపై ఈ వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు నిరసనకారులను నియంత్రించేటప్పుడు బలాన్ని ఉపయోగించొద్దని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ సూచించింది.
శ్రీలంక భద్రతా దళాల చర్యలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా తప్పుపట్టింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టడం ప్రజల హక్కని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- బ్రిటన్ ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించిన రిషి సునక్
- ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ఫోన్ కాల్‌తో చైనా ఎందుకు కలవరపడుతోంది?
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)