షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని ఇద్దరి భార్యల్లో ‘ఫస్ట్ లేడీ’ హోదా ఎవరికి దక్కనుంది

    • రచయిత, హమైరా కన్వల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్ విధులు ప్రారంభించారు. ఇస్లామాబాద్‌లోని ప్రధాని కార్యాలయానికి ఆయన తన నివాసం మార్చుకున్నారు. కానీ, ఇప్పటివరకు దేశానికి ప్రథమ మహిళ (ఫస్ట్ లేడీ) ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు.

పాకిస్తాన్‌లో అధ్యక్షుడి భార్యతోపాటు ప్రధాన మంత్రి భార్యనూ ప్రథమ మహిళగానే పిలుస్తారు.

ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకునే సమయంలో ఆడియెన్స్ గ్యాలరీలో ఆయన కుమారుడు హమ్జా, అన్నయ్య కుమార్తె మరియమ్ నవాజ్ కనిపించారు. కానీ, ఆయన భార్య ఎక్కడా కనిపించలేదు.

ఇంతకీ దేశానికి ప్రథమ మహిళ ఎవరు? అనే అంశంపై మీడియాలో చర్చ మొదలైంది. షాబాజ్‌కు మూడు పెళ్లిళ్లు కావడమే ఈ చర్చకు మూల కారణం. ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికీ ఆయనకు భార్యలుగా కొనసాగుతున్నారు.

నేషనల్ అంసెబ్లీ డైరెక్టరీలో తన చిరునామాగా మోడల్ టౌన్ లాహోర్‌లోని అడ్రస్‌ను షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. మేం ఆ చిరునామాను సంప్రదించినప్పుడు ‘‘ఫస్ట్ లేడీతోపాటు ఆ ప్రోటోకాల్‌కు సంబంధించి మాకు వివరాలు తెలియవు’’ అని అక్కడున్న సిబ్బంది చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించాలని వారు సూచించారు.

‘‘అయితే, ఇస్లామాబాద్‌లో రాజకీయ కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచి ఇక్కడ ఎవరూ ఉండటం లేదు’’ అని వారు వివరించారు.

ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు కూడా మాకు ఇలాంటి సమాధానమే వచ్చింది. ‘‘ఫస్ట్ లేడీ ఎవరో మాకు స్పష్టతలేదు’’అని వారు బదులిచ్చారు.

‘‘ఆమె ఇంకా రాలేదు’’

ఇదివరకటి ఫస్ట్ లేడీ స్క్వాడ్‌లో పనిచేసిన ఓ అధికారి ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం షాబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి కార్యాలయంలోనే ఉంటున్నారు. కానీ, ఆయన భార్యలు ఎవరూ ఇక్కడికి రాలేదు’’ అని చెప్పారు.

‘‘ప్రథమ మహిళ కోసం పనిచేసేందుకు ఇక్కడ ప్రత్యేక బృందం ఉంటుంది. ఆమెకు సంబంధించిన ప్రోటోకాల్‌తోపాటు ఆమె ఎక్కడకు వెళ్లినా భద్రత కల్పించేది ఈ బృందమే’’ అని ఆయన వివరించారు. ఈ బృందంలో మహిళలతోపాటు పురుషులు కూడా పనిచేస్తారు.

ఒక్కో ప్రధాన మంత్రి భార్య ఒక్కోలా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారని ఆ అధికారి వివరించారు. ఉదాహరణకు గత ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య చాలా కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు.

షాబాజ్ షరీఫ్ కుటుంబంతో మంచి సంబంధాలున్న జర్నలిస్టు, విశ్లేషకుడు సల్మాన్ ఘనీ మాట్లాడుతూ.. ‘‘షాబాజ్‌కు ముగ్గురు భార్యలున్నారు. అయితే, ఆయన రాజకీయ కార్యక్రమాల్లో వీరెవరూ పెద్దగా కనిపించడం లేదు’’ అని వివరించారు.

షాబాజ్ షరీఫ్ మొదటి భార్య పేరు నుష్రత్ షాబాజ్. ఆమెకు ముగ్గురు పిల్లలు. వీరిలో షమ్జా షరీఫ్ కూడా ఒకరు. పెళ్లికి ముందు షాబాజ్‌కు నుష్రత్ సమీప బంధువే. అయితే, ఆమె పెద్దగా షాబాజ్ కార్యక్రమాల్లో కనిపించరు. రాజకీయ లేదా సామాజిక కార్యక్రమాల్లో ఆమె పెద్దగా పాలుపంచుకోరు.

అయితే, ఆమె ఆస్తుల వివరాలను నామినేషన్ సమర్పించే సమయంలో ఎన్నికల కమిషన్‌కు షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.

షాబాజ్ కంటే నుష్రత్ ధనవంతురాలు

ఎన్నికల కమిషన్‌కు షాబాజ్ సమర్పించిన వివరాలతో పాకిస్తాన్ పత్రిక డాన్ 2018లో ఓ కథనం ప్రచురించింది. దీనిలో షాబాజ్ కంటే నుష్రత్ ధనవంతురాలని పేర్కొంది.

‘‘ఆమె ఆస్తుల్లో నూలు వడికే పరిశ్రమలు, పౌల్ట్రీ కర్మాగారాలు, ట్రేడింగ్ సంస్థలు, జౌలీ పరిశ్రమలు, డెయిరీలు, ప్లాస్టిక్ పరిశ్రమలు ఉన్నాయి’’అని కథనంలో పేర్కొన్నారు.

‘‘తమ కుటుంబంలోని మహిళలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం షరీఫ్ కుటుంబానికి పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. అయితే, అవసరమైనప్పుడు నవాజ్ షరీఫ్ మొదటి భార్య కుల్సూమ్ నవాజ్ ప్రజల ముందుకు వచ్చేవారు. నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడైనప్పుడు ఆయన కుమార్తె మరియమ్ నవాజ్ రాజకీయాల్లోకి వచ్చారు. వీరిద్దరూ రాజకీయాల్లోకి రాకపోయుంటే, ప్రస్తుతం షాబాజ్ ప్రధాన మంత్రి అయ్యుండేవారు కాదేమో. వీరి పార్టీ పీఎంఎల్ఎన్ కూడా సంక్షోభంలో కూరుకుపోయుండేది’’అని సల్మాన్ వ్యాఖ్యానించారు.

అయితే, ఇప్పుడు ప్రజా కార్యక్రమాల్లో షాబాజ్ కొడుకు మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన భార్యలు లేదా కుమార్తెలు ఎక్కడా కనిపించడం లేదు.

తహ్మీనా దుర్రానీ ఎవరు?

షాబాజ్ రెండో భార్య పేరు ఆలియా. ఆమెకు ఖదీజా అనే కుమార్తె ఉంది. అయితే, ఇప్పుడు ఆలియా, షాబాజ్ కలిసిలేరు.

షాబాజ్ మూడో భార్య పేరు తహ్మీనా దుర్రానీ. చార్సద్దాకు చెందిన ఆమె సామాజిక కార్యకర్త, రచయితగా ప్రజలకు సుపరిచతం.

ఆమె రాసిన ‘‘మై ఫ్యూడల్ లార్డ్’’ పుస్తకం మంచి ప్రజాదరణ పొందింది. ఇది ఆమె ఆత్మకథ. తన మొదటి వివాహం సంగతులతోపాటు తన అనుభవాలను దీనిలో ఆమె రాసుకొచ్చారు. ఈ పుస్తకం విషయంలో ఆమెకు విమర్శలు కూడా ఎదురయ్యాయి.

మరోవైపు అబ్దుల్ సత్తార్ ఈధీ జీవిత చరిత్ర ‘‘ఎ మిర్రర్ టు ద బ్లైండ్’’ను తహ్మీనా రాశారు. ఆమె రాసిన బ్లాస్ఫెమీ, హ్యాపీ థింగ్స్ ఇన్ సారో టైమ్స్ పుస్తకాలు కూడా మంచి ప్రజాదరణ పొందాయి.

19ఏళ్ల క్రితం షాబాజ్‌ను తహ్మీనా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడం బాగా తగ్గించారని సల్మాన్ చెప్పారు.

షాబాజ్ షరీఫ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా తహ్మీనా అంత క్రియాశీలంగా కనిపించలేదు. ఒకసారి ఆమె ట్విటర్ అకౌంట్‌ను చూస్తే ఆమె సామాజిక కార్యక్రమాల వివరాలు మాత్రమే కనపిస్తాయి. ఈధి ఫౌండేషన్‌ను ప్రోత్సహించే ట్వీట్లను ఆమె పెడుతుంటారు. కొన్నిసార్లు షాబాజ్ షరీఫ్‌కు అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతుంటారు. మరికొన్నిసార్లు షాబాజ్‌తో దిగిన ఫోటోను పోస్టు చేస్తుంటారు.

షాబాజ్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి ఆమె ఎలాంటి ట్వీట్లు చేయలేదు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు.

‘‘నేనే ఫస్ట్ లేడీని’’

అయితే, ఇటీవల యాంకర్ ముబాషిర్ లుఖ్మాన్‌కు తహ్మీన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తానే ఫస్ట్ లేడీ అని ఆమె పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత ఈధి ఫౌండషన్‌లో క్రియాశీల పాత్ర పోషించే బిల్ఖిస్ ఈధితో కలిసి దిగిన ఒక ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.

‘‘బిల్ఖిస్ నన్ను ఫస్ట్ లేడీ అని పిలిచినప్పుడు నాకు ఏదోలా అనిపించింది’’అని తహ్మీన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ‘‘నిజమే, ఏ ఫస్ట్ లేడీ.. బిల్ఖిస్ ఈధికి సాటికారు’’అని కూడా ఆమె రాసుకొచ్చారు.

అయితే, షాబాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు? అని యాంకర్ ముబాషిర్ ఆమెను ప్రశ్నించారు. ‘‘అంతమంది మధ్యకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. అవసరమైనప్పుడు నేను కచ్చితంగా అందుబాటులో ఉంటాను. నేను ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. షాబాజ్ భుజంపై ఎన్నో బాధ్యలున్నాయి. ఆయనపై బాధ్యలుంటే నాపై కూడా ఉన్నట్లే. మేం ప్రజలకు మంచి పనులు చేయాలి’’అని ఆమె అన్నారు.

‘‘గత పదేళ్లలో ఆయన చాలా మంచి పనులు చేశారు. ఆయనకు అసలు తీరిక ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆయనకు మంచి పనులు చేసే శక్తిని ఇవ్వాలని నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. పేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన పనిచేయాలి. ఆయనతోపాటు నేను కూడా నా వంతు కృషి చేస్తాను’’అని ఆమె వివరించారు.

మీరు ఎందుకు ప్రధాని నివాసంలో కాకుండా ఇక్కడ ఉంటున్నారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడి నుంచే నా జీవితం మొదలైంది. ఇక్కడ ఉంటే ఈధి ఫౌండేషన్‌కు వెంటనే వెళ్లొచ్చు. ఇక్కడ నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

‘‘నాకు ఈ ఇల్లు బాగా నచ్చతుంది. మీ ఫస్ట్ లేడీ ఒక మధ్య తరగతి ఇంట్లో ఉంటోందంటే మీరు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు’’అని తహ్మీనా వివరించారు.

పెళ్లి తర్వాత పేరు మారలేదు..

కొన్నేళ్ల క్రితం సుహైల్ వాడైచ్‌కు తహ్మీనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. పెళ్లి తర్వాత తన పేరును ఎందుకు మార్చుకోలేదనే ప్రశ్నపై ఆమె స్పందించారు.

‘‘నేను చేసిన పనికి ఈ పేరు గుర్తింపు తెచ్చింది. దీని కోసం నేను ఎంతో శ్రమించాను’’అని ఆమె చెప్పారు. షాబాజ్‌తో పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా ఎలాంటి మార్పులూ రాలేదని ఆమె వివరించారు.

ఈధి బ్రతికి ఉండేటప్పుడు ఆయన సేవా కార్యక్రమాల్లో తహ్మీనా పాలుపంచుకున్నారు. 2017లో ఆమె తహ్మీనా దుర్రానీ ఫౌండేషన్‌ను స్థాపించారు.

ప్రస్తుతం ఆమె బిల్ఖిస్ ఈధితో కలిసి పనిచేస్తున్నారు. గత శుక్రవారం బిల్ఖిస్ ఈధి కన్నుమూశారు.

లాహోర్‌లో తన నివాసాన్ని వదిలి తహ్మీనా ప్రధాని నివాసానికి వస్తారా? ఫస్ట్ లేడీగా ఆమె మన్ననలు పొందుతారా? అనేది రానున్న రాజుల్లో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)