You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముస్లిం జనాభాలో రెండవ అతిపెద్ద దేశమైన భారత్‌కు ఇంతవరకూ OIC లో సభ్యత్వం ఎందుకు లేదు? 1969లో ఏం జరిగింది?
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో ఇండోనేషియా తరువాత భారతదేశంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉంది. మూడవ స్థానంలో పాకిస్తాన్ ఉంది.
2015 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో 87.1 శాతం ముస్లింలు ఉండగా, భారతదేశంలో 14.9 శాతం ఉన్నారు.
అయితే, 2060 నాటికి భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగి మొదటి స్థానానికి చేరుకుంటుందని, పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంటుందని ప్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా వేసింది.
ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో 11.1 శాతం భారతదేశంలో ఉన్నారు. ఇండోనేషియాలో 12.6 శాతం, పాకిస్థాన్‌లో 10.5 శాతం ఉన్నారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) అనేది ఇస్లామిక్ దేశాల సంఘటిత సంస్థ. ఇందులో 57 సభ్య దేశాలు ఉన్నాయి.
ఓఐసీలో సౌదీ అరేబియా ఆధిపత్యం చలాయిస్తుంది. కానీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న మొదటి 10 దేశాల్లో సౌదీ అరేబియా లేదు. అయితే, ముస్లింలకు పవిత్ర స్థలాలైనా మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలో ఉండడంతో ఆ దేశం ప్రాముఖ్యం సంతరించుకుంది.
భారతదేశం ఓఐసీలో చేరడంపై పాకిస్తాన్ అభ్యంతరాలు
ముస్లిం జనాభాలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ ఓఐసీలో చేరలేదు.
2006 జనవరి 24న సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ భారతదేశాన్ని సందర్శించారు.
ఆ సందర్భంగా, భారతదేశానికి ఓఐసీలో పరిశీలకుల హోదా (అబ్సర్వర్ స్టేటస్) దక్కాలని, భారత్ తరుపున పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
కాగా, పాకిస్తాన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓఐసీలో పరిశీలకుల హోదా కోరుకునే ఏదేశానికైనా అందులోని సభ్య దేశాలతో వివాదాలు ఉండకూడదని పేర్కొంది.
ఓఐసీతో స్నేహపూర్వక సంబంధాలు వీగిపోయాయి
మొరాకో రాజధాని రబాత్‌లో జెరూసలెం అల్-అక్సా మసీదుపై 1969లో నిర్వహించిన ఇస్లామిక్ సమ్మిట్ కాంఫరెన్స్ తరువాత నుంచీ ఓఐసీ, భారత్ మధ్య సంబంధాలు సన్నగిల్లాయి.
సౌదీ అరేబియా రాజు ఫైసల్ భారతదేశాన్ని ఈ సదస్సుకు ఆహ్వానించారు. ఇది ముస్లిం దేశాలకు మాత్రమే సంబంధించినది కాదని, ప్రపంచంలోని ముస్లింలందరికీ సంబంధించినదని ఆయన పేర్కొన్నారు.
అప్పట్లో భారతదేశానికి జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతిగా ఉన్నారు. భారత ప్రతినిధిమండలి తొలుత ఈ సదస్సులోని సమావేశంలో పాల్గొంది.
కానీ, ఇది పాకిస్తాన్‌కు నచ్చలేదు. దాంతో, సదస్సులోని మిగతా సెషన్‌ల నుంచీ భారత్‌ను తప్పించింది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ యాహ్యా ఖాన్ భారత్‌ను బహిష్కరించారు.
అప్పటి నుంచీ ఓఐసీ, భారత్ మధ్య సంబంధాలు సన్నగిల్లాయి.
కశ్మీర్ విషయంలో ఓఐసీ పాకిస్తాన్‌కు మద్దతుగా ప్రకటనలిస్తుంది. ఇది భారత్‌కు ఎప్పుడూ సమ్మతం కాదు.
1948, 1949 ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని ఓఐసీ చెబుతుంది.
ఓఐసీ చార్టర్ ప్రకారం, ఆ సంస్థ లక్ష్యాలను ప్రోత్సహించే ముస్లిం దేశాలు మాత్రమే అందులో సభ్యులుగా ఉండడానికి అర్హులు.
అయితే, కొన్ని ముస్లిమేతర దేశాలకు అందులో అబ్జర్వర్ స్టేటస్ దక్కిది. కొన్నింటికి పూర్తి సభ్యతం కూడా దక్కింది. 1998లో థాయిలాండ్, 2005లో రష్యా ఓఐసీలో అబ్సర్వర్‌లుగా చేరాయి.
"సభ్య దేశాలను, అబ్జర్వర్‌లను తీసుకునేటప్పుడు ఓఐసీ తన చార్టర్‌ను పక్కకు పెడుతుంది. రాజ్యాంగబద్ధంగా ముస్లిం దేశాలు అయితేనే ఓఐసీ సభ్యతం పొందాలన్నది నియమం. కానీ, టర్కీ రాజ్యాంగపరంగా లౌకిక దేశం. దానికి ఓఐసీలో సభ్యత్వం ఉంది. టర్కీ దౌత్యవేత్త ఓఐసీ జనరల్ సెక్రటరీ కూడా అయ్యారు. ఆఫ్రికాలోని అనేక దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలు కావు. అవి కూడా ఓఐసీలో సభ్యత్వం పొందాయి" అని పలు గల్ఫ్ దేశాలకు భారత రాయబారిగా వ్యవహరించిన తల్మీజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.
భారతదేశానికి ఓఐసీలో అబ్సర్వర్ స్టేటస్ మాత్రమే కాదు, పూర్తి సభ్యత్వం పొందే అర్హత ఉందని భారత మాజీ దౌత్యవేత్త, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 2006లో అన్నారు.
"ముస్లిం మెజారిటీ దేశం కావడం షరతేం కాదు. ఇండోనేషియా తరువాత భారత్‌లోనే అధిక ముస్లిం జనాభా ఉన్నారు" అని ఆయన పేర్కొన్నారు.
అయితే, 2016లో హమీద అన్సారీ భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మరోమారు ఓఐసీ గురించి మాట్లాడారు.
"ఓఐసీ దాని ప్రాసంగికతను కోల్పోయిందని" అన్నారు.
"నేను సౌదీ అరేబియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నప్పుడు, ఓఐసీపై వ్యాఖ్యలకు స్పందించవచ్చని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు" అని తల్మీజ్ అహ్మద్ చెప్పారు.
"జస్వంత్ సింగ్ విధానం సరైనది. మా అంతర్గత వ్యవహారాలలో ఓఐసీపై వ్యాఖ్యలకు స్పందిస్తే దాని ప్రాముఖ్యం పెంచినట్టవుతుంది. ఓఐసీ ఒక పనికిమాలిన సంస్థ. దాని మీద దృష్టి పెట్టక్కర్లేదు. సౌదీ అండ చూసుకుని పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుంది. ఓఐసీలో పాకిస్తాన్ ఎజెండా సాగుతుంది. భారతదేశానికి ఒక హోదా ఉంది. ఓఐసీ వేదికపై పాకిస్తాన్‌తో వాదనలకు దిగాల్సిన అవసరం లేదు. ఓఐసీ ప్రకటనలపై మేం సౌదీకి ఫిర్యాదు చేసినప్పుడు, ఆ సంస్థ ప్రకటనలను అనుసరించక్కర్లేదు, అది మా జాతీయ విధానం కాదని సౌదీ స్పష్టం చేసింది" అని ఆయన అన్నారు.
ఓఐసీ, మోదీ ప్రభుత్వం
మోదీ ప్రభుత్వం ఐఓసీకి జవాబు ఇవ్వడం ద్వారా తనదైన సంప్రదాయ రాజకీయానికి ఆజ్యం పోసిందని తల్మీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"చూడండి.. ముస్లిం దేశాలన్నీ భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. మేం ముఖంమీద గుద్దినట్లు జవాబు ఇచ్చాం.. అని చెప్పుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ జవాబును అందరూ వినేలా చేయాలనుకుంటోంది. ఇదంతా అజెండాలో భాగం. ఓఐసీ చేసే ఎలాంటి వ్యాఖ్యలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అంతర్గత వ్యవహారాలపై ఓఐసీ చేసే వ్యాఖ్యలకు స్పందిచకూడదని’ జస్వంత్ సింగ్ చెప్పేవారు. కానీ, మోదీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది" అని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో చెలరేగుతున్న హిజాబ్ వివాదం, హరిద్వార్‌లో ధర్మ సంసద్ ప్రసంగాల గురించి ఓఐసీ ఫిబ్రవరి 14న వ్యాఖ్యానించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరుసటి రోజే దీనిపై స్పందించింది. భారతదేశ ప్రతిష్టకు ఓఐసీ భంగం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.
"భారతదేశం ఏ ప్రతిష్ట గురించి మాట్లాడుతోంది? ఓఐసీకి ఎప్పుడూ ఎలాంటి ప్రతిష్టా లేదు. పాకిస్తాన్‌తో తప్ప మిగిలిన ఓఐసీ సభ్య దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి" అని తల్మీజ్ అహ్మద్ అన్నారు.
హిజాబ్ వివాదం, ధర్మ సంసద్‌లపై ఓఐసీ ఏమంది?
"భారతదేశంలో ముస్లింలపై మారణ హోమం తలపెట్టాలని హరిద్వారలో హిందుత్వ వాదులు పిలుపునివ్వడం, సోషల్ మీడియాలో ముస్లిం మహిళలపై వేధింపులు విచారకరం. కర్ణాటకలో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడపై నిషేధం కూడా ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల కమీషన్ ఈ అంశాలలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం" అని ఓఐసీ పేర్కొంది.
దీనిపై స్పందిస్తూ, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఫిబ్రవరి 15న ఒక ప్రకటనల విడుదల చేశారు.
"భారతదేశానికి సంబంధించిన విషయాల్లో ఓఐసీ జనరల్ సెక్రటరీ నుంచి తప్పుదోవ పట్టించే మరొక ప్రకటన వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగం, యంత్రాగం, ప్రజాస్వామ్యం, ప్రభుత్వ విధానాలను అనుసరంచి సమస్యల పరిష్కారం జరుగుతుంది. ఓఐసీలో భారతదేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే స్వార్థపరుల హవా కొనసాగుతోంది. దీనివల్ల ఆ సంస్థ సొంత ప్రతిష్టను భంగపరుచుకుంటోంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర జబ్బు ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- ఈ దోశ పూర్తిగా తింటే రూ. 71,000 మీవే
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
- ‘నదీ జలాల్లో పారాసెటమాల్, నికోటిన్, కెఫీన్, డయాబెటిస్ మందుల ఆనవాళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)