You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర సమస్య ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
బప్పి లహిరి, 69 ఏళ్ల వయస్సులో ముంబైలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఆయనకు గాయకునిగా, స్వరకర్తగా మంచి గుర్తింపు ఉంది. బప్పి లహిరి గత ఏడాది కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయనను డిశ్చార్జి చేశారు.
ఇటీవల నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆయన సోమవారం ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు, వైద్యులను ఇంటికి పిలిపించారు.
అనంతరం ఆయన్ను జుహులోని క్రిటి కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. పలు ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
''బప్పి లహిరి గత నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. సోమవారం డిశ్చార్జి అయ్యారు. మంగళవారం రాత్రి మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. గత ఏడాదిగా ఆయన ఓఎస్ఏ (Obstructive sleep apnea) వ్యాధితో బాధపడుతున్నారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. కానీ ఓఎస్‌ఏ కారణంగానే రాత్రి 11:45 నిమిషాలకు ఆయన మృతి చెందారు'' అని వార్తా సంస్థ పీటీఐతో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దీపక్ నమ్‌జోషి చెప్పారు.
ఓఎస్ఏ అంటే ఏమిటి?
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు చెందిన బ్రిటిష్ లంగ్ ఫౌండేషన్ (బీఎల్ఎఫ్) ప్రకారం... ఓఎస్ఏ అంటే నిద్రపోతున్నప్పుడు సంభవించే శ్వాస సమస్య. ఈ సమస్య ఎవరికైనా రావొచ్చు. పెద్దవాళ్లు, చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
అబ్‌స్ట్రక్టీవ్ స్లీప్ ఆప్నియా అర్థం ఏంటి?
అబ్‌స్ట్రక్టీవ్: అంటే శ్వాసనాళికలో పూడిక ఏర్పడటం
స్లీప్: నిద్ర సమయంలో వచ్చే సమస్య
ఆప్నియా: కొంత సమయం వరకు శ్వాస ఆడకపోవడం
ఓఎస్‌ఏకు గురైతే ఏం జరుగుతుంది?
బీఎల్ఎఫ్ ప్రకారం, మనం నిద్రపోతున్నప్పుడు మన గొంతు కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయి. గాలి నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది.
కానీ ఓఎస్‌ఏకు గురైనప్పుడు గొంతునాళం పూర్తిగా పూడుకుపోతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లలేదు. ఈస్థితిలో కొంతసమయం పాటు శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది.
ఈ స్థితి 10 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉంటే దాన్ని 'ఏప్నియా'గా పరిగణిస్తారు.
ఇలా జరిగినప్పుడు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి.
దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ వ్యాధి బారిన పడిన వారికి కొంత సమయం పాటు శ్వాస ప్రక్రియ నిలిచిపోతుంది. వెంటనే శ్వాస ప్రక్రియ మళ్లీ జరిగేలా మెదడు చూస్తుంది.
శ్వాసలో ఇబ్బంది ఏర్పడినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోనేందుకు ప్రయత్నించడం లేదా అటు ఇటు కదలడం వల్ల మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వ్యక్తి నిద్రలోకి జారుకుంటారు. కాసేపటి తర్వాత మళ్లీ ఇదే సమస్య మొదలవుతుంది.
కొంతమంది ఈ సమస్య తలెత్తగానే లేచి కూర్చుంటారు. కానీ మరికొంతమంది ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక ఆందోళన చెందుతారు.
ఒకవేళ ఈ వ్యాధి ముదిరితే, ఒకే రాత్రిలో వందలసార్లు ఇలా శ్వాస సమస్య ఎదురవుతుంది.
దీనికారణంగా నిద్రకు తరచుగా అంతరాయం కలుగుతుంది. పగటి వేళంతా ఆ వ్యక్తికి మగతగా ఉంటుంది.
దీనికి చికిత్స పొందకపోతే, వ్యక్తి ప్రాణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది.
ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువ?
బ్రిటీష్ లంగ్ ఫౌండేషన్ ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఓఎస్ఏ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- మధ్య వయస్సులో ఉన్న మగవారికి
- మెనోపాజ్ స్థితిని ఎదుర్కొన్న మహిళలకు
- ప్రెగ్నెన్సీ చివరి దశల్లో ఉన్నవారికి
- అధిక బరువు లేదా ఒబేసిటీ ఉంటే
- మీ గొంతు పరిమాణం పెద్దదిగా ఉంటే
- డౌన్ సిండ్రోమ్ వంటి కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది.
- టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి
- గుండె జబ్బులు ఉన్నవారికి
- సిగరెట్లు, మద్యపానం, నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురి కావొచ్చు.
ఓఎస్‌ఏ లక్షణాలు ఏంటి?
బీఎఫ్ఏ ప్రకారం ఈ వ్యాధి లక్షణాలు కొన్ని నిద్రిస్తున్న సమయంలో కనిపిస్తాయి. మనం మేల్కొన్నప్పుడు కూడా మరికొన్ని లక్షణాలను గుర్తించవచ్చు.
నిద్రలో కనిపించే లక్షణాలు
- బిగ్గరగా గురకపెట్టడం
- శ్వాస ఆడకపోవడం
- ఇబ్బందిగా లేదా అతివేగంగా శ్వాస తీసుకోవడం
- తరచుగా వణకడం
- రాత్రివేళల్లో చాలాసార్లు మేల్కోవడం
మేల్కొన్న స్థితిలో కనిపించే లక్షణాలు
- మగతగా ఉండటం, చురుగ్గా లేకపోవడం
- నిద్రలేచే సమయంలో తలనొప్పి
- ఏకాగ్రత కోల్పోవడం
- జ్ఞాపకశక్తి కోల్పోవడం
- చిరాకుగా ఉండటం
- అవయవాల మధ్య సమన్వయం లేకపోవడం
- సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం
డిస్కోకు ప్రాముఖ్యం కల్పించిన బప్పీ లహిరి
భారత్‌లో డిస్కోకు ప్రాముఖ్యం కల్పించిన గాయకుల్లో ఒకరిగా బప్పి లహిరికి గుర్తింపు ఉంది. ఆయన స్వరపరిచిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్, షరాబీ పాటలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి. బప్పి చివరగా 2020లో విడుదలైన టైగర్ ష్రాఫ్ నటించిన 'బాగీ 3' సినిమాలోని భంకాస్ అనే పాటను ఆలపించారు.
బప్పి లహిరిని ప్రజలు ముద్దుగా 'బప్పీ దా' అని పిలుచుకుంటారు. బంగారు అభరణాలంటే ఆయనకు మహా ఇష్టం. తన ఆహార్యంలో వాటిపై ఆయన ఇష్టం కనిపించేది.
ఆయన స్వరపరిచిన పాటల్లో డిస్కో డ్యాన్సర్, షరాబీ, అడ్వెంచర్ ఆఫ్ టార్జాన్, డ్యాన్స్- డ్యాన్స్, సత్యమేవ్ జయతే, కమాండో, ఆజ్ కే షహన్‌షా, థానేదార్, నంబరీ ఆద్మీ, షోలా ఔర్ షబ్నమ్ ముఖ్యమైనవి. జిమ్మీ-జిమ్మీ, ఆజా-ఆజా గీతాలు ఇప్పటికీ చాలా ఇష్టంగా వింటుంటారు.
బప్పి లహిరి ప్రయాణం
బప్పి లహిరి అసలు పేరు అలోకేశ్ లహిరి. లతా మంగేష్కర్ పాడిన పాటకు తబలా వాయించడం ద్వారా నాలుగేళ్ల వయస్సులోనే ఫేమస్ అయిన అలోకేశ్‌ను అందరూ ప్రేమగా బప్పీ అని పిలవడం మొదలుపెట్టారు.
అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా 'బప్పీ దా' పేరుతోనే ప్రసిద్ధి చెందారు. 80వ దశకంలో ఆయన కట్టిన ట్యూన్‌లకు ఊగిపోయిన అభిమానులు ఆయనను 'డిస్కో కింగ్'ను చేశారు. బాలీవుడ్‌లో సంగీతాన్ని డిజిటలైజ్ చేసిన సంగీత కళాకారుల్లో బప్పీ ప్రధాన పాత్ర పోషించారు.
''నాకు చాలా అవార్డులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు గ్రామీ అవార్డును గెలుపొందలేకపోయాను. ఐదుసార్లు గ్రామీ అవార్డు కోసం పోటీపడ్డాను. ఈసారి 'ఇండియన్ మెలోడీ' అనే మ్యూజిక్ ఆల్బంలో సూఫీ, జానపదం, ఇతర భారతీయ సంగీత శైలికి చెందిన పాటలను కూడా చేర్చాను'' అని 2016లో బీబీసీతో మాట్లాడుతూ బప్పి లహిరి అన్నారు.
హాలీవుడ్‌లో కూడా చాలాసార్లు ఆయన సంగీతం వినిపించింది. 1981లో విడుదలైన 'జ్యోతి' సినిమాలోని 'కలియాన్ క చమన్' అనే పాట అమెరికాలోని టాప్- 40 గీతాల్లో భాగమైపోయింది.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ చెప్పినట్లు యోగి పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారా, వారి జీవితం మెరుగుపడిందా?
- యుక్రెయిన్ సంక్షోభం: బలగాలు వెనక్కి వస్తున్నాయన్న రష్యా
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- స్నేహను కాపాడేందుకు రైలు కిందికి దూకిన మొహమ్మద్ మహబూబ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)