యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ మాస్కో పర్యటన: పాక్- రష్యాల మధ్య సరికొత్త స్నేహ బంధానికి ఆంతర్యమేమిటి? భారత్‌పై చూపే ప్రభావమేమిటి?

    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ రెండు రోజుల రష్యా పర్యటన నిమిత్తం మాస్కోకు వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ఇమ్రాన్ ఈ పర్యటన చేపట్టినట్లు చెప్తున్నారు.

పాకిస్తాన్ నేత రష్యాను సందర్శించటం గత 23 ఏళ్లలో ఇదే తొలిసారి. ప్రస్తుతం అంతర్జాతీయంగానూ, ప్రాంతీయంగానూ నెలకొన్న వ్యూహాత్మక భౌగోళిక వాతావరణంలో ఇమ్రాన్ మాస్కో పర్యటనను కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు.

ఈ పర్యటన ద్వారా పాకిస్తాన్‌కు రాగల ప్రయోజనం ఏమిటి? భారత్‌తో రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం మీద ఇమ్రాన్ మాస్కో పర్యటన ఎలా ప్రభావం చూపబోతోంది? బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ విశ్లేషిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ పర్యటనలో ఆర్థిక, వాణిజ్య అజెండా ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పర్యటన ద్వారా వచ్చే రాజకీయ సందేశం ఇంకా బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనూ, ఆ తర్వాతా అమెరికా శిబిరం వైపు మొగ్గే పాకిస్తాన్ చారిత్రక వైఖరిలో మార్పును ఈ పర్యటన ప్రతిబింబిస్తోంది.

కష్టాల్లో ఉన్న తన ఆర్థికవ్యవస్థకు మద్దతివ్వటం కోసం.. పాకిస్తాన్ వాణిజ్య ఇంధన కారిడార్‌గా తన సామర్థ్యాన్ని పెంచుకోవటానికి తన సంబంధాలను విస్తరించుకోవాలని, ముఖ్యంగా ప్రాంతీయ శక్తులతో సంబంధాలు పెంచుకోవాలని కోరుకుంటోంది.

అయితే.. యుక్రెయిన్ విషయంలో రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య పరిస్థితులు విషమిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటిస్తుండటం గమనార్హం.

ఇది.. పాకిస్తాన్ రష్యా వైపు మొగ్గుతోందని, అమెరికా వ్యతిరేక, పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిలో భాగస్వామి అవుతోందని సంకేతాలు ఇవ్వగలదని పరిశీలకులు అంటున్నారు. పాకిస్తాన్‌కు యుక్రెయిన్‌తోనూ సత్సంబంధాలున్నాయి. ఈ పర్యటన వల్ల ఆ దేశంతో పాక్ సంబంధాలు దెబ్బతినవచ్చు.

రష్యా పర్యటన గురించి ప్రకటించే ముందు పాకిస్తాన్ తన మిత్రులతో మాట్లాడి, వారిని విశ్వాసంలోకి తీసుకుని ఉంటుందని ఇస్లామాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో రష్యా నిపుణుడు తైమూర్ ఖాన్ భావిస్తున్నారు.

‘‘అయినప్పటికీ ఈ సమయం వింతగా ఉంది. రష్యా వనరులు, దృష్టి అంతా యుక్రెయిన్ సంక్షోభం మీద కేంద్రీకృతమై ఉంది. రష్యా పర్యటనకు ఇది సరైన సమయం కాదు. పాకిస్తాన్ కోరుకుంటున్న విధంగా మీడియా దృష్టిని ఈ పర్యటన ఆకర్షించదు. అసలు.. పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని విస్తృతం చేస్తోందని, ఏదో ఒక శిబిరంలో భాగస్వామిని కాబోనని చాటటం ఈ పర్యటన ఉద్దేశమయితే.. ఈ తరుణంలో పర్యటించటం తప్పుడు సంకేతాలిచ్చే అవకాశముంది’’ అన్నారాయన.

భారత కోణం

అలాగే.. రష్యా, పాక్‌ల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలు.. భారత్, రష్యాల మధ్యనున్న ‘‘ప్రత్యేకమైన, విశిష్ట’’ సైనిక, ఆర్థిక భాగస్వామ్యం మీద చూపే ప్రభావం ఏమీ ఉండదు.

ప్రపంచంలో రెండో అతి పెద్ద ఓపెన్ మార్కెట్ భారతదేశమని, ఈ దేశంతో సంబంధాలను ప్రతి దేశమూ కోరుకుంటుందని తైమూర్ ఖాన్ పేర్కొన్నారు.

‘‘పాకిస్తాన్, రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. భారత్‌తో రష్యా సంబంధాలపై ప్రభావం చూపవు. దక్షిణాసియా ఆగర్భశత్రువులైన పాకిస్తాన్, భారత్‌లతో తన సంబంధాలను రష్యా వేర్వేరుగానే ఉంచుతుంది. భారత్‌తో తన సంబంధాలను దెబ్బతీయగల ఎటువంటి ఒప్పందాన్నీ రష్యా ఎన్నడూ పాకిస్తాన్‌తో చేసుకోబోదు’’ అని అన్నారాయన.

రష్యాతో భారత్, పాకిస్తాన్ సంబంధాలను పోల్చలేమంటారు తైమూర్ ఖాన్. తేడా చాలా ఉంది. రష్యాలోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రష్యా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2020-21లో 800 కోట్ల డాలర్లకు పైగా ఉంది.

ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 3000 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని కూడా భారత్, రష్యాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటించినపుడు ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాల్లో 28 ఒప్పందాలు చేసుకున్నారు. భారత సైన్యం కోసం 6,00,000 రష్యన్ అసాల్ట్ రైఫిళ్ల తయారీ కూడా అందులో ఒకటి.

పాకిస్తాన్‌తో తన సంబంధాలు భారత్-రష్యా భాగస్వామ్యం మీద ప్రభావం చూపబోవని భారత్‌కు రష్యా భరోసా ఇచ్చింది. ఇండియా కూడా దీనిని అర్థం చేసుకుంటుంది. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పర్యటనకు వ్యతిరేకంగా భారత్ నుంచి వ్యాఖ్యలు వచ్చే అవకాశముంది. అది రష్యా మీద ఒత్తిడి కొనసాగించటానికి దోహదపడుతుంది.

అంతర్జాతీయ నేపథ్యం

భారత్‌తో తన భాగస్వామ్యానికి రష్యా అంతగా విలువ ఇస్తున్నట్లయితే.. భారత్‌కు ఆగ్రహం తెప్పించేలా.. ఆ దేశానికి బద్ధ శత్రువైన పాకిస్తాన్‌తో సన్నిహితమయ్యే రిస్కును రష్యా ఎందుకు తీసుకుంటోంది?

దీనిని అర్థం చేసుకోవటానికి మారుతున్న పరిస్థితులను గమనించాలని రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ హసన్ అస్కారి రిజ్వీ చెప్తున్నారు. ‘‘రష్యా ముందుచూపును ప్రదర్శిస్తోంది’’ అంటారాయన.

‘‘ఇండియా, రష్యాలు రెండూ తమ అవకాశాలను విస్తరించుకుంటున్నాయి. 2000 దశకం ఆరంభంలో భారత్ ఒకవైపు అమెరికాతోనూ మరోవైపు యూరప్‌తోనూ సంబంధాలు కలుపుకుంది. ఇప్పుడు రష్యా అదే పని చేస్తోంది. తన ఆర్థిక, రాజకీయ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని భాగస్వామ్యాలను నెలకొల్పుకోవాలని రష్యా కోరుకుంటోంది’’ అని డాక్టర్ రిజ్వీ చెప్పారు.

‘‘ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. సోవియట్ పతనం తర్వాత రష్యా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ప్రపంచంలో అగ్ర రాజ్యంగా ఎదగటానికి సిద్ధంగా ఉందా దేశం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని నిలువరించటానికి అమెరికా, ఇండియాలు వ్యూహాత్మక భాగస్వాములు అయినపుడు.. తాను పాకిస్తాన్ వైపు కొంత మొగ్గటం న్యాయమేనని రష్యా భావిస్తోంది’’ అని విశ్లేషించారాయన.

‘‘పాకిస్తాన్ సైతం ఇక తాను ఒకే శిబిరానికి పరిమితమై ఉండజాలనని గుర్తించింది. తన విదేశాంగ విధానాన్ని విస్తరించుకోవాల్సిన అవసరం పాక్‌కు ఉంది. కనీసం ప్రాంతీయ స్థాయిలోనైనా కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోవాల్సిన అవసరముంది. అమెరికాతో తన చారిత్రక, బహుళ సంబంధాలకు పాకిస్తాన్‌ ఇప్పటికీ విలువ ఇస్తోంది. కానీ తన ప్రయోజనాలన్నిటినీ ఇక ఏమాత్రం ఒకే చోట ఉంచటం సాధ్యంకాదు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకున్న పాక్.. ఇప్పుడు రష్యా అవకాశాలను పరిశీలిస్తోంది’’ అని డాక్టర్ రిజ్వీ వివరించారు.

అలాగే అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య పెరిగిన ఒత్తిడి, అవిశ్వాసాల వల్ల ఒక ఖాళీ ఏర్పడిందని.. దానిని భర్తీ చేయటానికి చైనాతో సంబంధాలు నెలకొల్పుకోగా, ఇప్పుడు రష్యా కూడా ఆ ఖాళీలోకి ప్రవేశిస్తోందని డాక్టర్ రిజ్వీ పేర్కొన్నారు.

‘‘ఇప్పటివరకూ రష్యా, పాకిస్తాన్‌ల మధ్య చిన్నపాటి విశ్వాస నిర్మాణ చర్యలు మినహా.. సహకార సంబంధాలు పెరగటానికి గణనీయమైన పరిణామాలేవీ సంభవించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద పరిణామం జరగవచ్చు’’ అన్నారాయన.

వాణిజ్య సంబంధాలు

పాకిస్తాన్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు ఈ పర్యటనలో ఒక ప్రధానాంశంగా ఉన్నట్లు కనిపిస్తోందని తైమూర్ ఖాన్ పేర్కొన్నారు.

కరాచీ నుంచి పంజాబ్‌లోని కాసుర్ వరకూ 1,100 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ ప్రతిపాదిత పైప్‌లైన్‌ను ఇంతకుముందు ఉత్తర-దక్షిణ పైప్‌లైన్ అని పిలిచేవారు. దీనిద్వారా ఏటా 12.4 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేయాలనేది ప్రణాళిక.

ఇందులో 74 శాతం వాటా పాకిస్తాన్‌కు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 230 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా.

పాకిస్తాన్‌కు ఇంధన లోటు ఉంది. ముఖ్యంగా చలికాలాల్లో దేశమంతటా గ్యాస్ కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఈ ఇంధన సమస్యను పరిష్కరించటానికి ఈ పైప్‌లైన్ ప్రాజెక్ట్ చాలా సాయపడుతుంది. రష్యాకు సంబంధించినంత వరకూ దీనివల్ల తక్షణమే, ప్రత్యక్షంగా భారీ లాభాలేవీ రావని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రష్యా పాలుపంచుకోవటం వ్యాపార ప్రయోజనాల కన్నా వ్యూహాత్మక ప్రయోజనాల కోసమేనని చెప్తున్నారు.

అయితే.. పాకిస్తాన్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం.. అమెరికాతో లేదా చైనాతో పాకిస్తాన్ ఆర్థిక సహకారం స్థాయిలో ఎన్నడూ ఉండబోదని డాక్టర్ రిజ్వీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ సహకారం పెరగటానికి చాలా అవకాశముందని.. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటన ఆ దిశగా ముందుకు సాగటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

రాజకీయ, రక్షణ కోణం

పాకిస్తాన్ తనకు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఆర్థిక భాగస్వామ్యం కోసం చూస్తోంటే.. రష్యా మాత్రం పాక్‌తో రక్షణ సంబంధాలను అభివృద్ధి చేసుకోవటం మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది.

పాకిస్తాన్ మీద ఏకపక్షంగా విధించిన ఆయుధ సరఫరా నిషేధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ 2014లో ఎత్తివేయటంతో.. ఇరు దేశాల మధ్య మళ్లీ సహకారం మొదలైందని తైమూర్ ఖాన్ చెప్పారు. దీంతో మాజీ ప్రత్యర్థులైన పాక్, రష్యాలు రక్షణ సహకారం ఒప్పందం చేసుకున్నాయి. తద్వారా రష్యా తను తయారు చేసే ఎంఐ-35ఎం యుద్ధ హెలికాప్టర్లు నాలుగింటిని పాకిస్తాన్‌కు విక్రయించటానికి వీలు కలిగింది.

అప్పటి నుంచీ రక్షణ సహకారం బలోపేతమవుతూ విస్తరించింది కూడా. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సారథ్యంలోని సంకీర్ణం వైదొలగటం కూడా.. ప్రచ్ఛన్నయుద్ధ కాలపు ప్రత్యర్థులను మరింత దగ్గర చేసింది.

అఫ్గానిస్తాన్ భవిష్యత్తు గురించి రష్యా, పాకిస్తాన్‌లకు ఒకే రకమైన అభిప్రాయాలున్నాయని తైమూర్ ఖాన్ భావిస్తున్నారు. అప్గాన్‌లో మిలిటెంట్ల ఉనికి కొనసాగటం వల్ల ఈ రెండు దేశాలూ సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. విదేశీ శక్తులు కాబూల్ వీడి వెళ్లాలని రెండు దేశాలూ కోరుకుంటున్నాయి.

పాక్, రష్యాలను దగ్గరకు తెస్తున్న మరో వ్యూహాత్మక కోణం.. చైనా, రష్యాల మధ్య వికసిస్తున్న సంబంధాలని తైమూర్ ఖాన్ చెప్పారు.

బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం తర్వాత రష్యా, చైనాలు తమ సంయుక్త ప్రకటనలో కొత్త స్నేహాన్ని ప్రదర్శించాయి. వారు ఊహించిన విధంగా ఆ స్నేహ బంధాన్ని పెంపొందించుకున్నట్లయితే.. ప్రపంచ రాజకీయాల్లోకి ఓ కొత్త కోణం వస్తుంది. చైనా, రష్యాలను సన్నిహితం చేయటంలో పాకిస్తాన్ వారధిగా పాత్ర పోషించవచ్చునని తైమూర్ ఖాన్ భావిస్తున్నారు.

2018లో రష్యా-పాకిస్తాన్ జాయింట్ మిలటరీ కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేయటం వల్ల.. పాక్ సైనికాధికారులు రష్యా సైనిక బలగాల నుంచి శిక్షణ పొందటానికి తొలిసారిగా తలుపులు తెరుచుకున్నాయి. ఇరు దేశాలు పలు మార్లు సంయుక్త తీవ్రవాద వ్యతిరేక విన్యాసాలు నిర్వహించాయి. అందులో పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్‌కు చెందిన ఒక దళం పాలుపంచుకుంటోంది.

రష్యా విదేశీ నిఘా సంస్థ అధిపతి కూడా.. కొన్ని నెలల కిందట ప్రాంతీయ నిఘా అధిపతుల సమావేశంలో పాల్గొనటానికి పాకిస్తాన్‌ వచ్చారు.

ఇక.. ఇస్లామోఫోబియా మీద పుతిన్ వైఖరితో.. పాకిస్తాన్‌లో ఆయన పాపులర్ నాయకుడయ్యారు. పుతిన్ గత డిసెంబర్‌లో మాస్కోలో వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్తను అవమానించటం కళాత్మక భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని, మత స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించటమవుతుందని చెప్పినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపింది.

ఆ ప్రకటన అనంతరం పాకిస్తాన్‌లో పుతిన్ పట్ల సదభిప్రాయం గణనీయంగా పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య అవగాహన పెంపొందటానికి ఈ సదభిప్రాయం మార్గం పరుస్తుందని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)