You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీసీ సర్కార్: బ్రిటన్‌ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- రచయిత, జాన్ జుబ్రిసికి
- హోదా, రచయిత
అది 1956, ఏప్రిల్ 9. హఠాత్తుగా అనేక వందలాది మంది ప్రేక్షకులు తాము అప్పుడే తమ టెలివిజన్ స్ర్కీన్‌పై ఒక హత్యను లైవ్‌లో చూసినట్లు బీబీసీకి ఫోన్లు చేశారు. బీబీసీ పనోరమా కార్యక్రమంలో, ఎంతో నిగూఢంగా కనిపించే ఒక ఇంద్రజాలికుడు, 17 ఏళ్ల బాలికను బల్ల మీద పడుకోబెట్టి, రంపంతో ఆమెను అడ్డంగా కోశాడు.
అయితే ఆ ప్రదర్శనలో ఏదో తప్పు జరిగినట్లు అనిపించింది. ఆ ఇంద్రజాలికుడు ఆమెను తిరిగి లేపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ప్రతిస్పందించలేదు. ఆమె తలపై ఆయన ఒక నల్లని వస్త్రాన్ని కప్పినపుడు, ప్రజెంటర్ కెమెరా ముందుకు వచ్చి ప్రదర్శన ముగిసినట్లు తెలిపారు.
దీంతో వెంటనే బీబీసీ కార్యాలయానికి ఫోన్లు వెల్లువెత్తాయి.
పాశ్చాత్య ఇంద్రజాల రంగంపైకి రావడానికి సర్కార్‌కు చాలా కష్టమైంది. ఆయన తన ప్రదర్శన కోసం లండన్‌లోని డ్యూక్ ఆఫ్ యార్క్ థియేటర్‌ను మూడు వారాల పాటు బుక్ చేసుకున్నారు. కానీ బుకింగులు మాత్రం పలుచగా ఉన్నాయి.
''యువతి అడ్డంగా కోసివేత'', ''సర్కార్ చర్యతో నిశ్చేష్టులైన ప్రేక్షకులు'' అని ఆ మరుసటి రోజు ఆ వార్త పతాక శీర్షికల్లో వచ్చింది. అంతే.. ఆ సీజన్ మొత్తం షోలకు థియేటర్‌లో సీట్లన్నీ అమ్ముడుపోయాయి.
సర్కార్ ఇంద్రజాలాన్ని దగ్గర నుంచి గమనించే వారికి ఆయన టైమింగ్‌లో మాస్టర్ అని తెలుసు. తన సహాయకురాలు దీప్తి డే ను రంపంతో కోయడంలో అద్భుతమైన ఆయన హస్తలాఘవం కనిపిస్తుంది.
ప్రతుల్ చంద్ర సర్కార్ 1913, ఫిబ్రవరి 23న బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని తంగైల్ జిల్లా అశోక్‌పూర్‌లో జన్మించారు. గణితంలో ఆయనకు అద్భుతమైన ప్రావీణ్యం ఉండేది. మొదట ఆయన క్లబ్బులు, సర్కస్‌లు, థియేటర్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు.
బెంగాల్‌లోని కొన్ని నగరాలలో తప్ప, బయట పెద్దగా తెలీని సర్కార్ తనను తాను 'ప్రపంచంలోనే అతి గొప్ప ఇంద్రజాలికుడు' అని పిలుచుకోవడం ప్రారంభించారు. ఆ ఉపాయం ఫలించింది. దాంతో ఆయనకు భారతదేశం నలుమూలల నుంచి ఆహ్వానాలు అందాయి.
అయితే అంతర్జాతీయ రంగంలోకి ప్రవేశం మాత్రం ఆయనకంత సులభంగా దొరకలేదు. పాశ్చాత్య ఇంద్రజాలికులతో పోలిస్తే భారతదేశానికి చెందిన వారిని మొరటు, నైపుణ్యం లేని వాళ్లని భావించేవాళ్లు.
1950లో షికాగోలో ఒక ప్రదర్శన ఇవ్వాలని ఆయనకు ఆహ్వానం అందింది.
అరేబియన్ నైట్స్ కథల్లోని పాత్ర తరహాలో ఆయన షెర్మన్ హోటల్ కన్వెన్షన్ హాలులోకి ప్రవేశించే సరికి ఫొటోగ్రాఫర్లు ఆయనను చుట్టుముట్టారు. కానీ కళ్లకు వస్త్రాన్ని కట్టుకుని, నల్లటి బోర్డుపై రాసిన దాన్ని చదివే ప్రదర్శన నిరాశాజనకంగా ముగిసింది.
సర్కార్ తన కెరీర్‌లో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. తనను తాను 'ప్రపంచంలోనే ప్రముఖ ఇంద్రజాలికుడు' అని పిలుచుకోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు.
అయితే ఆయన ప్రచార వ్యూహం చాలా పకడ్బందీగా ఉండేది. మేజిక్ పత్రికలు, వార్తాపత్రికలలో రంగులరంగుల చిత్రాలు, పోస్టర్లతో ఆయన ప్రదర్శనలపై మంచి సమీక్షలు వచ్చేవి. అయినా ఆయనను పాశ్చాత్యులు బయటివాడిగానే చూసేవారు.
1955లో కాలనాగ్ అనే మారుపేరు కలిగిన హెల్మట్ ఎవాల్డ్ స్ర్కైబర్ అనే ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ తన విద్యలను కాపీ కొట్టాడని ఆరోపించాడు. అతను అడాల్ఫ్ హిట్లర్‌కు చాలా ఇష్టుడు. అయితే ఈ సారి మాత్రం మిగతా ఇంద్రజాలికులు సర్కార్ వెనక నిలబడ్డారు.
సర్కార్‌ను చాలా మంది 1955 నవంబర్‌లో పారిస్‌లో ప్రదర్శించిన 'ద మేజిక్ ఆఫ్ ఇండియా' ప్రదర్శన కారణంగా గుర్తు పెట్టుకుంటారు. ఆ కాలంలో మిగతా ఇంద్రజాలికులకన్నా ఎక్కువ మంది సిబ్బంది, ఎక్కువ వైవిధ్యం, ఎక్కువ పరికరాలతో పర్యటించే సర్కార్ పాశ్చాత్య ప్రేక్షకులను అబ్బురపరిచారు.
సర్కార్ ప్రదర్శన జరిగే హాళ్ల ముందు భాగాన్ని తాజ్ మహల్‌లా తీర్చిదిద్దేవారు. ఏనుగులు బొమ్మలు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఆహ్వానం పలికేవి. అనేక రకాల దుస్తులతో, అత్యాధునిక దీపాలతో, ప్రొడక్షన్ సిబ్బందితో ఆయన ప్రదర్శనలు అతి వేగంగా సాగిపోయేవి.
సర్కార్ కెరీర్‌లో నిస్సందేహంగా మార్పు తెచ్చింది పనోరమా కార్యక్రమం. నిజానికి నాడు టీవీ ఇంకా శైశవ దశలోనే ఉన్నా దాని శక్తిని ఉపయోగించుకోవడంలో సర్కార్ విజయవంతమయ్యారు. దానిని అంత సమర్థంగా ఉపయోగించుకున్న ఇంద్రజాలికుడు మరొకరు లేరు.
తన తళుకుబెళుకులు, స్టేజ్ ఎఫెక్ట్స్‌తో సర్కార్ మిగతా ఇంద్రజాలికులకు అందనంత ఎత్తుకు వెళ్లారు. భారతీయ ఇంద్రజాలాన్ని ఆయన అంతకు ముందు ఎవ్వరూ తీసుకెళ్లనంత ఎత్తుకు తీసుకెళ్ళారు. ఆయన ప్రదర్శనల ముందు ఆయన ప్రత్యర్థుల ఇంద్రజాలం వెలవెలబోయేది.
1970లో సర్కార్ తన డాక్టర్ల సలహాలను పెడచెవిన పెట్టి, 4 నెలల ఇంద్రజాల ప్రదర్శన కోసం జపాన్‌కు వెళ్లారు. 1971 జనవరిలో షిబెట్సు నగరంలో ఆయన గుండెపోటుతో మరణించారు.
ప్రముఖ ఇంద్రజాల చరిత్రకారుడు డేవిడ్ ప్రైజ్ అన్నట్లు, సరిగ్గా పాశ్చాత్య దేశాలకు ధీటైన ఇంద్రజాలికుడు అవసరమైన సమయంలో ఆయన తెరపైకి వచ్చారు.
(జాన్ జుబ్రిసికి రచన 'ఎంపైర్ ఆఫ్ ఎంటర్‌టెయిన్‌మెంట్: ద స్టోరీ ఆఫ్ ఇండియన్ మేజిక్', ప్రచురణ - హర్స్ట్ (బ్రిటన్), ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (అమెరికా), స్ర్కైబ్ (ఆస్ట్రేలియా). భారతదేశంలో ఈ పుస్తకాన్ని పికాడర్ సంస్థ 'జాదూవాలాస్, జగ్లర్స్ అండ్ జిన్స్ : ఎ మేజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా' పేరిట ప్రచురించింది.)
ఇవి కూడా చదవండి:
- భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘
- కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- మనం ఉన్నది 2018లో కాదు... 1940 లేదా 2075!
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- అవునా.. 1975కు ముందువారితో పోలిస్తే మన తెలివి తక్కువేనా?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- ఈ తెలుగు చాయ్‌వాలాకు నరేంద్ర మోదీ ‘సెల్యూట్’ చేశారు.. ఇంతకూ ఎవరాయన?
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)