You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వ్లాదిమిర్ పుతిన్ మొహమ్మద్ ప్రవక్త గురించి ఏమన్నారు? పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు అంత సంతోషం ఎందుకు?
మొహమ్మద్ ప్రవక్తపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు.
ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా ఈ సందేశాన్ని ముస్లిమేతర నేతలకు చేరేవరకు వ్యాప్తి చేయాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
రష్యా వార్త సంస్థ టాస్ ప్రకారం, డిసెంబర్ 23న జరిగిన వార్షిక విలేఖరుల సమావేశంలో మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడుతూ... ప్రవక్తను అగౌరవపరచడం, భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదని పుతిన్ అన్నారు.
''ప్రవక్తను అవమానించడం అంటే మత స్వేచ్ఛను ఉల్లంఘించడం, ఇస్లాంను అనుసరించే వారి పవిత్ర భావాలను గాయపరచడమేనని'' పుతిన్ అన్నారు.
పుతిన్ ఏమన్నారు?
గురువారం జరిగిన వార్షిక విలేఖరుల సమావేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని ఇతరుల మనోభావాలను గాయపర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. భావప్రకటన స్వేచ్ఛకు, ఇతరుల స్వేచ్ఛను హరించడానికి మధ్యలో ఉండే బేధాన్ని ఎలా గుర్తించాలి'? అని అడిగిన ప్రశ్నకు మొహమ్మద్ ప్రవక్తను ఉదాహరణగా తీసుకొని పుతిన్ తన అభిప్రాయాన్ని వివరించారు.
''మొహమ్మద్ ప్రవక్తను అవమానించడం అంటే ఏంటి? అది సృజనాత్మక స్వేచ్ఛనా? అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదని నేను నమ్ముతున్నా. వ్యక్తుల విశ్వాసాన్ని అవమానించే ప్రయత్నంగా నేను దాన్ని భావిస్తున్నా'' అని పుతిన్ వ్యాఖ్యానించారు.
''మీరు ప్రజల నమ్మకాలను, విశ్వాసాలను అవమానిస్తే, పారిస్‌లో జరిగినట్లు అది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రజలను గౌరవించడం ద్వారా స్వేచ్ఛ లభిస్తుంది. స్వేచ్ఛ అనేది దానంతట అదే వస్తుంది'' అని ఆయన చెప్పారు. పారిస్‌లోని ఒక వార్తా పత్రిక సభ్యులను దుండగులు చంపివేసిన ఘటనను ఆయన ఉదాహరణగా చెప్పారు.
నాజీ జర్మన్ ఆర్మీ చిత్రాలను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు. జర్మన్ ఆర్మీ లేదా హిట్లర్ ఫొటోలను వెబ్‌సైట్‌లో ఉంచడం భావ ప్రకటన స్వేచ్ఛకు సమానం కాదని అన్నారు.
''భావ ప్రకటన స్వేచ్ఛ, కళాకారుల స్వేచ్ఛ, సాధారణ స్వేచ్ఛలను మనం కాపాడాలి. స్వేచ్ఛ అనేది లేకుండా మనం ముందుకు సాగలేం. ఫ్రీడం లేని మన భవిష్యత్ అంధకారమయంగా ఉంటుంది'' అని చెప్పారు.
'ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్'కు కూడా పరిమితులు ఉన్నాయని, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని ఆయన అన్నారు.
''రష్యా అనేది బహుళ జాతుల, మతాల దేశమని... ఇక్కడ ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకుంటారని, చాలా దేశాల్లో ఇలాంటి వాతావరణం తక్కువగా ఉంటుందని'' ఆయన వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు..
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా పుతిన్ వ్యాఖ్యలను స్వాగతించారు.
''అధ్యక్షుడు పుతిన్ మాటలను నేను స్వాగతిస్తున్నా. పవిత్రమైన మొహమ్మద్ ప్రవక్తను అవమానించడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదనే నా ఉద్దేశాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి, ఈ సందేశం ముస్లిమేతర దేశాల నేతలను చేరేవరకు ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం నేతలు కృషి చేయాలి'' అని ఆయన ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ కూడా పుతిన్ వ్యాఖ్యలను సమర్థించారు.
పుతిన్ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ స్వాగతిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
''మా పవిత్ర మొహమ్మద్ ప్రవక్తను అవమానించడం నిజానికి మతస్వేచ్ఛ ఉల్లంఘన కిందకు వస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది చాలా దూరంగా ఉండే అంశం'' అని ఆయన రాసుకొచ్చారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను కించపరుస్తూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని పుతిన్ అన్నారు. దీనికి ఉదాహరణగా పారిస్‌లో జరిగిన ఘటనను పేర్కొన్నారు.
పారిస్‌లో ఏం జరిగింది?
'చార్లీ హెబ్డో' అనే ఒక కార్టూన్ మ్యాగజైన్ 2015లో మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన కార్టూన్లను ప్రచురించింది. ముస్లిం ప్రపంచమంతా ఆ కార్టూన్‌ను ఖండించింది.
దీని తర్వాత, 2015 జనవరి 7న ఆ మ్యాగజీన్ కార్యాలయంపై దాడులు జరిగాయి. అందులో 12 మంది మరణించారు.
ఈ దాడులు చేసిన వారికి సహకరించిన 14 మందిపై 2020 సెప్టెంబర్‌లో విచారణ జరిగింది. ఆ సమయంలో మరణించిన తమ సిబ్బంది జ్ఞాపకార్థం, సంస్థ యాజమాన్యం ఆ కార్టూన్లను మళ్లీ ప్రచురించింది.
ఒక నెల తర్వాత, ఫ్రాన్స్‌లోని ఒక చరిత్ర ఉపాధ్యాయుడు ఆ కార్టూన్లను తరగతి గదిలో ప్రదర్శించారు. దీంతో ఆయనను హత్య చేశారు. ఉపాధ్యాయుని సంతాప సభలో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ... కార్టూన్లను వేసే స్వేచ్ఛను ఫ్రాన్స్ నిలిపేయదని అన్నారు.
ముస్లిం సంప్రదాయవాదులు, ఫ్రాన్స్ భవిష్యత్‌ను దోచుకోవాలని చూస్తున్నారంటూ వారికి వ్యతిరేకంగా ఆయన తరచుగా ప్రకటనలు చేశారు.
ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఒక భవనంపై కూడా ఆ కార్టూన్‌ను ప్రదర్శించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడి చర్యలను, ఆయన వ్యాఖ్యలను మొత్తం ముస్లిం ప్రపంచం ఖండించింది.
''ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ సమయంలో గాయాలను మాన్పించడానికి కృషిచేయాలి. అంతేగానీ తీవ్రవాదులకు చోటు ఇవ్వకూడదు. కానీ ఆయన దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మతోన్మాదానికి దారి తీస్తుంది'' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
పాకిస్తాన్‌లో కూడా ఈ ఘటన ప్రభావం ఎక్కువగానే పడింది. ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా 'తెహ్రీక్-ఎ-లబ్బెక్ పాకిస్తాన్' అనే సంస్థ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
పాకిస్తాన్‌లో ఫ్రాన్స్ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని, ఫ్రెంచ్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రదర్శనల సందర్భంగా ఆందోళకారులు, పోలీసులకు మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- హిమాన్షు బాడీషేమింగ్.. ‘అమిత్ షా గురించి, మోదీ కుటుంబం గురించి ఇలాగే మాట్లాడొచ్చా?’ - కేటీఆర్ ఆగ్రహం
- క్రిస్మస్ 2021: ఒమిక్రాన్ భయంతో తగ్గిన వేడుకలు.. మార్కెట్లలో కొనసాగుతున్న షాపింగ్ రద్దీ
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?
- కోవిడ్ -19తో మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా... ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా?
- చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?
- శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)