హఫీజ్ సయీద్ ఇంటి దగ్గర బాంబు పేలుడులో భారత హస్తం ఉందని ఆరోపించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ - Newsreel

లాహోర్‌లోని జమాత్-ఉద్-దవా అధినేత హఫీజ్ సయీద్ ఇంటి దగ్గర జూన్ 23న పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా ముగ్గురు మరణించారు.

ఈ పేలుడు వెనక భారత హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది.

ఈ దాడి వెనక భారత్ ఉందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ ఆరోపించారు.

‘‘ఈ దాడితో భారత్‌‌కు సంబంధం ఉందని చెప్పే ఆధారాలు దొరికాయి. ఈ దాడి కుట్రదారు ఒక భారతీయుడు’’ అని ఆయన చెప్పారు.

ఈ దాడితో భారత గూఢచర్య సంస్థ ‘‘రా’’కు సంబంధముందని యూసుఫ్ వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్‌పైనే ఆరోపణలు చేశారు.

ఈ దాడిని 'భారత్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య'గా ఆయన అభివర్ణించారు.

‘‘దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలను దేశానికి తెలియజేయాలని నేనే సూచించాను. పంజాబ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక విభాగం, నిఘా సంస్థలు, పోలీసులు కలిసి చాలా వేగంగా దర్యాప్తు చేపట్టారు. సమన్వయంతో ముందుకు వెళ్లారు’’అని ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్ చేశారు.

‘‘వీరంతా సమన్వయంతో పనిచేయడం వల్ల దాడి వెనుక ఉన్న కుట్రదారులకు అంతర్జాతీయ సంబంధాలున్నాయని తెలిసింది. పాక్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదంతో ఈ దాడికి సంబంధముంది. ఈ దాడికి కుట్ర, ఆర్థిక సాయం వెనుక భారత్‌తో సంబంధాలున్నాయి. ఇలాంటి చర్యలపై అంతర్జాతీయ సమాజం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై భారత్ ఇంకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)