పాకిస్తాన్‌: పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోందా

    • రచయిత, తన్వీర్ మాలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండున్నరేళ్ల పాలనలో తాను 20 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని తీర్చానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

పాకిస్తాన్ 20 బిలియన్ల రుణాలను తిరిగి చెల్లించింది గానీ, ఇమ్రాన్ ఖాన్ పాలనలో మొత్తం విదేశీ రుణం అత్యధిక స్థాయికి చేరుకుంది. దీనికి కారణం ఉన్న అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేయడమేనని ఆర్థికవేత్తలు అంటున్నారు.

పాకిస్తాన్ మొత్తం అప్పు ఎంత?

ప్రస్తుతం పాకిస్తాన్ విదేశీ రుణాలు 115 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గణాంకాల ప్రకారం.. 2020 డిసెంబర్ 31 నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పు 115.756 బిలియన్ డాలర్లు.

అంతకు ముందు సరిగ్గా ఏడాది క్రితం అంటే 2019 డిసెంబర్ 31 నాటికి పాకిస్తాన్ విదేశీ రుణాలు 110.719 బిలియన్ డాలర్లు. అంటే ఒక ఏడాదిలో అప్పులు 5 బిలియన్ డాలర్లు పెరిగాయి.

అయితే, స్టేట్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు కేవలం ప్రభుత్వ రుణాలు కాదని, దేశం మొత్తం రుణాలను సూచిస్తున్నాయని పాకిస్తాన్ ఆర్థిక శాఖ డెబిట్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రెహ్మాన్ వడాయిచ్ చెప్పారు.

ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలతో పాటూ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు, ప్రైవేటు రంగ సంస్థలు తీసుకున్న విదేశీ రుణాలు కూడా ఉన్నాయని అన్నారు.

ప్రభుత్వ విదేశీ రుణాలు 80 బిలియన్ డాలర్లు మాత్రమే. ప్రభుత్వం దేశం బయట నుంచి, లోపలి నుంచి కూడా రుణాలు తీసుకుంటుంది. బయటి నుంచి తీసుకున్న రుణాలు మూడింట ఒక వంతు కాగా, అంతర్గత రుణాలు రెండొంతులు ఉన్నాయి. పాకిస్తాన్ దేశ జీడీపీలో అప్పులు 30 శాతం ఉన్నాయని వడాయిచ్ వివరించారు.

గత ప్రభుత్వాలు ఎంతెంత విదేశీ రుణాలు చెల్లించాయి?

తన రెండున్నరేళ్ల పదవీ కాలంలో మొత్తం 20 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు.

"పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాలనలోని మొదటి రెండున్నర సంవత్సరాల కాలంలో 9.953 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించారు. అదే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాలనలోని మొదటి రెండున్నర సంవత్సరాలలో 6.454 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని చెల్లించారు" అని డార్సన్ సెక్యూరిటీస్ పరిశోధన విభాగాధిపతి యూసుఫ్ సయీద్ తెలిపారు.

వీటన్నిటినీ పోల్చి చూస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వమే అత్యధిక విదేశీ రుణాలు చెల్లించినట్లు తెలుస్తోందని వడాయిచ్ అన్నారు.

అయితే, రుణాలను, చెల్లింపులను ఆర్థిక కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

"తిరిగి చెల్లిస్తున్న రుణాలలో 90 శాతం అసలు ఉంటుంది. వడ్డీ చాలా స్వల్పంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా 2 నుంచి 3 శాతం ఉంటుంది. వీటిని తిరిగి చెల్లించవలసిన కాల పరిమితి కూడా ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ రుణాల చెల్లింపు వ్యవధి సగటున ఏడు సంవత్సరాలు.

ప్రతీ సంవత్సరం పాకిస్తాన్‌కు ఉన్న అప్పుల్లో ఎనిమిది లేదా పది బిలియన్ డాలర్లు మెచ్యూర్ అవుతాయి. వీటిని చెల్లించడానికి కొత్త రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ వ్యయం కోసం కొంత అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సుమారు ఐదు బిలియన్ డాలర్లు ఉంటుంది" అని వడాయిచ్ వివరించారు.

"ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 20 బిలియన్ డాలర్ల అప్పు చెల్లించిందంటే దాన్ని అనుమానించక్కర్లేదు. అయితే, ఈ రుణాలను సొంత వనరుల ద్వారా తీర్చిందా లేక మళ్లీ అప్పు చేసి తీర్చిందా అన్నది చూడాలి. ప్రతీసారీ, ఉన్న అప్పులను తీర్చడానికి మళ్లీ అప్పు తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూడా అదే చేసింది. దీనివలన విదేశీ రుణం నిత్యం పెరుగుతూనే ఉంది" అని ఆర్థికవేత్త కేసర్ బెంగాలీ అభిప్రాయపడ్డారు.

విదేశీ రుణాలు తీసుకోవడం ఎంత అవసరం?

బడ్జెట్ వ్యయాలను పూరించేందుకు విదేశాల నుంచి, స్వదేశీ వ్యవస్థల నుంచి కూడా ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడం పరిపాటి. అనేక దేశాల ప్రభుత్వాలు ఇదే వ్యూహాన్ని అవలంబిస్తాయని వడాయిచ్ అన్నారు.

"పాకిస్తాన్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు రుణాలు తీసుకోవడం తప్పేమీ కాదు. దాన్ని ప్రతికూలంగా చూడకూడదు. అయితే, తీసుకున్న రుణాలను ఎలా ఖర్చు పెడుతున్నాయన్నదే ముఖ్యం. ఈ రుణాలను ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి పరచడానికి, ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని పెంచడానికి ఉపయోగిస్తే అది మంచి విధానం అవుతుంది. అప్పు అనేది రెండంచుల కత్తి. దేశానికి ప్రయోజనం కలిగించే విధంగా ఉపయోగొంచొచ్చు లేదా నష్టాలనూ కొనితెచ్చుకోవచ్చు. ఇది వారి వారి ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది" అని వడాయిచ్ అభిప్రాయపడ్డారు.

"పాకిస్తాన్ తన ఆదాయ వనరులను పెంచుకోడానికి రుణాలు తీసుకోవడంలో ఏ సమస్యా లేదు. 1960, 70లలో పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద మొత్తాలలో రుణాలు తీసుకుని భారీ ప్రోజెక్టులు చేపట్టింది. ఆనకట్టలు నిర్మించింది. ఇలాంటి వాటికి అప్పు తీసుకోవడం తప్పేమీ కాదు" అని కేసర్ బెంగాలీ తెలిపారు.

రుణాలపై ఆధారపడడాన్ని ఎలా తగ్గించొచ్చు?

"రుణ భారాన్ని తగ్గించుకోవాలంటే దేశ ఆదాయాన్ని పెంచాలి. ఆ క్రమంలో పన్నులు పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం చేకూరుతుంది. రెవెన్యూ పెరగకపోవడమే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్న సమస్య" అని వడాయిచ్ అన్నారు.

కేసర్ బెంగాలీ ఇందుకు కొంత భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

"పన్నులు పెంచడం కాకుండా, దేశ ప్రస్తుత ఆదాయన్ని పెంచాలని ఆయన అన్నారు. అభివృద్ధికి దోహదం చేయని ఖర్చులను తగ్గించే విధానాన్ని అవలంబించాలి. సివిల్, మిలటరీ రంగాల్లో ఖర్చులు తగ్గించాలి. ఉదాహరణకు కేంద్ర స్థాయిలో 40 డివిజన్లను 20కి తగ్గించుకోవచ్చు. 18వ సవరణ తరువాత, రాష్ట్రాలకు బదిలీ చేసిన విభాగాలను కొత్త పేర్లుతో కేంద్ర స్థాయిలోనే పర్యవేక్షించే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వాలు ముగింపు పలకాలి. అలాగే, రక్షణ రంగంలో యుద్ధేతర ఖర్చులను తగ్గించుకోవాలి. ఇవి చేస్తే ఒక సంవత్సరంలో ఒక కోటి రూపాయల ఖర్చును ఆదా చేసుకోవచ్చు. తద్వారా విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించొచ్చు" అని కేసర్ బెంగాలీ అభిప్రాయపడ్డారుపాకిస్తాన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)