భారత్‌కు మద్దతు ఇస్తాం, కలిసి పనిచేస్తాం: చైనా

బ్రిక్స్ సమావేశం నిర్వహించడంలో భారత్‌కు సహకరిస్తామని చైనా తెలిపింది. భారత్, చైనాల మధ్య సరిహద్దుల విషయంలో పదవ రౌండ్ చర్చల తరువాత చైనా ఈ ప్రకటన చేసింది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి. పాంగాంగ్ సరస్సు వద్ద తమ సైన్యాలను ఉపసంహరించుకున్నాయి.

కానీ, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరని ప్రాంతాలు మరి కొన్ని ఉన్నాయి.

ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఇండియా అధ్యక్షత వహించనుంది. ఈ సమావేశాన్ని భారత్‌లోనే నిర్వహిస్తారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం, ఇటీవల రేగిన ఘర్షణలు బ్రిక్స్ సమావేశాన్ని ప్రభావితం చేస్తాయా?

ఈ ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ జవాబిస్తూ.. "బ్రిక్స్‌కు చైనా ప్రాముఖ్యతనిస్తుంది. మేము బ్రిక్స్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి, సంఘీభావాన్ని, సహకారాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబటి ఉన్నాం. ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించే దిశలో భారత్‌కు మేము మద్దతు ఇస్తాం. అలాగే, వివిధ రంగాలలో కమ్యూనికేషన్, కో-ఆపరేషన్‌లను బలోపేతం చేసేందుకు మిగతా సభ్య దేశాలతో కలిసి పని చేస్తాం" అని తెలిపారు.

ప్రపంచాభివృద్ధి దిశగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ.."ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల పరంగా బ్రిక్స్‌కు, 'బ్రిక్స్ ప్లస్' విధానానికీ మా సహాకారాన్ని అందిస్తూనే ఉంటాం. కోవిడ్- 19ను జయించేందుకు, ప్రపంచ ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించడానికి, పాలన, విధానాలను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సమాజానికి మేము పూర్తి సహాయ సహకారాలను అందిస్తాం" అని చైనా ప్రతినిధి తెలిపారు.

అయితే, ఈ సందర్భంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుతాయా లేదా అనేది ఇంకా తెలీదు.

అలాగే, ఈ సమావేశం వర్చువల్‌గా ఉంటుందా లేక బ్రిక్స్ నాయకులంతా ముఖాముఖి కలుస్తారా అనేది కూడా అస్పష్టమే.

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం తేదీలను భారత్ ఇంకా ప్రకటించలేదు.

గత బ్రిక్స్ సమావేశాల్లో కూడా మోదీ, జిన్‌పింగ్ కలిశారు

గత ఏడాది భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకున్న తరువాత, నవంబర్‌లో బ్రిక్స్ వర్చువల్ సమావేశం జరిగింది. కానీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగలేదు.

2014 జూలైలో బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగిన కొద్ది రోజుల్లోనే.. సెప్టెంబర్‌లో చైనా సైనిక దళాలు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) దగ్గర చుమార్ ప్రాంతంలో చొరబడ్డాయి. అదే నెలలో షీ జిన్‌పింగ్ భారత పర్యటనకు వచ్చారు.

అనంతరం 2016లో గోవాలో జరిగిన బ్రిక్స్ సభ్య దేశాల సమావేశంలో పాల్గొనేందుకు షీ జిన్‌పింగ్ ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకుల మధ్య వాణిజ్య, రక్షణ రంగాలపై చర్చలు జరిగాయి.

ఆ తరువాత, 2017లో డోక్లాంలో రెండు దేశాల మధ్య 70 రోజులకు పైగా కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి మోదీ హాజరయ్యారు. ఇద్దరి మధ్య రెండు అనధికారిక సమావేశాలు కూడా జరిగాయి. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ముగియడానికి ఈ సమావేశాల టైమింగ్ కూడా ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

నిరుడు ఎల్ఏసీ వద్ద తీవ్ర సంక్షోభం ఏర్పడింది. 1975 తరువాత మొదటిసారి సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. డోక్లాం లాగానే ఈ సంక్షోభం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో కొనసాగింది.

ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం వెనక్కి మరలిపోయింది. కానీ మిగతా ప్రాంతాల్లో ఇంకా సైనిక దళాలు మోహరించి ఉన్నాయి.

ఇరు దేశాల మధ్య పదవ రౌండ్ చర్చల అనంతరం, రెండు దేశాల రక్షణ శాఖలూ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

"పాంగాంగ్ సరస్సు వద్ద సైన్యాన్ని ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. దీంతో ఎల్ఏసీ పశ్చిమ సెక్టార్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం సులభమవుతుంది. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం సాధించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటన లక్ష్యాలేంటి?

"ఇరు దేశాల మధ్య సంబంధాలు సరైన దిశలో పయనిస్తున్నాయని నిరూపించడానికి ఇదొక మంచి అవకాశం" అని చెంగ్డూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధిపతి లాంగ్ షింగ్చుం 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'‌తో చెప్పారు. ఇది చైనా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది.

"ఇండియాలో కోవిడ్-19ను అధిగమించగలిగితే బ్రిక్స్ సమావేశాన్ని ఇండియాలో నేరుగా నిర్వహించవచ్చు. ఇరు దేశాల అధ్యక్షులు ముఖాముఖి కలుసుకుని చర్చించడం సత్ఫలితాలనిస్తుంది. ఇది ఆ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది" అని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సరిహద్దు వివాదం త్వరగానే సమసిపోతుందని భావించవచ్చు.

"అలా జరగకపోతే ఇరు దేశాల మధ్య చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడదని" లాంగ్ షింగ్చుం అభిప్రాయపడ్డారు.

"అంతర్జాతీయ వ్యవహారాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచే దిశలో సమిష్టిగా కృషి చేసేందుకు బ్రిక్స్ ఒక మంచి వేదిక" అని ఆయన అన్నారు.

వివిధ అంశాల్లో వివాదాలు ఉన్నప్పటికీ బ్రిక్స్ విషయంలో చైనా నిబద్ధతలో మార్పు లేదని షింగ్చుం అభిప్రాయపడ్డారు.

బ్రిక్స్ అంటే ఏంటి?

బీఆర్ఐసీఎస్ (BRICS) అనేది అభివృద్ధి చెందుతున్న ఐదు ప్రపంచ దేశాల కూటమి.

బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఇందులోని సభ్య దేశాలు. ఈ ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థల దృష్ట్యా ఈ కూటమి ఏర్పడింది.

ప్రపంచ జనాభాలో 44 శాతం బ్రిక్స్ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జీడీపీలో 30 శాతం, వాణిజ్యంలో 18 శాతం బ్రిక్స్ దేశాల నుంచే వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)