You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తర కొరియా ప్రదర్శించిన భారీ క్షిపణి సత్తా ఏంటి? దాని వల్ల అమెరికాకు ముప్పు ఉందా?
ఉత్తర కొరియా ఓ కొత్త ఖండాంతర క్షిపణిని ఆవిష్కరించింది. అది అత్యంత భారీ పరిమాణంలో ఉండటం చూసి.. ఆ దేశ ఆయుధ భాండాగారం గురించి బాగా తెలిసిన విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. అసలింతకీ ఆ క్షిపణి ఏమిటి? అది అమెరికాకు, ప్రపంచానికి ఎందుకు ముప్పు అవుతుంది? అనేది రక్షణ రంగ నిపుణులు మెలిస్సా హానామ్ వివరిస్తున్నారు.
ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశం అసామాన్య సైనిక కవాతును నిర్వహించింది.
అందరూ అంచనా వేసినట్లుగానే ఉత్తర కొరియా కళాకారుల అద్భుత విన్యాసాలు కనిపించాయి. దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనూహ్యంగా భావోద్వేగంతో ప్రసంగించారు. ఆయన తమ దేశం ఎదుర్కొంటున్న సంఘర్షణల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
అన్నిటికీ మించి.. ఉత్తర కొరియా తన దేశానికి చెందిన అతి పొడవైన ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను కూడా బహిర్గత పరిచింది.
ఆ క్షిపణి గురించి మనకు తెలసిన మూడు ముఖ్యాంశాలివీ...
కిమ్ ప్రకటించిన 'వ్యూహాత్మక ఆయుధం'
2020 జనవరి 1న కిమ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో.. కేవలం అభివృద్ధి చెందిన దేశాల వద్ద మాత్రమే ఉన్న అత్యాధునిక ఆయుధాల వ్యవస్థను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తోందని ప్రకటించారు.
'వ్యూహాత్మక' - అంటే అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన నిర్దిష్టంగా చెప్పారు.
''భవిష్యత్తులో ఉత్తర కొరియా - అమెరికా సంబంధాల పరిష్కారం విషయంలో అమెరికా ఎంత జాప్యం చేస్తే.. అంచనాలకు అందనంతగా పెరుగుతున్న ఉత్తర కొరియా మహోన్నత శక్తి ముందు ఆ దేశం అంతగా నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొంటుంది'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఖండాంతర క్షిపణే కిమ్ చెప్పిన ఆ వ్యూహాత్మక ఆయుధం. ఇది అమెరికాను లక్షంగా చేసుకుంటోంది. ట్రంప్ ప్రభుత్వంతో కొరియా చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ ఆయుధాన్ని ప్రదర్శించారు.
అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థకు కొత్త ముప్పు
ఉత్తర కొరియా దగ్గర ఇప్పటికే విజయవంతంగా పరీక్షించిన రెండు ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఒకటి.. హాసాంగ్-14ను 2017లో రెండు సార్లు ప్రయోగించారు. దీని లక్ష్య పరిది 10,000 కిలోమీటర్లు. ఇది అణ్వస్త్రాన్ని తీసుకుని కొరియా నుంచి పశ్చిమ యూరప్ మొత్తాన్నీ, అమెరికా సగం భూభాగాన్ని తాకగలదు.
2017లోనే పరీక్షించిన హాసాంగ్-15 క్షిపణికి 13,000 కిలోమీటర్లు లక్ష్య పరిధి ఉంది. అంటే.. అమెరికా భూభాగం మీద ఎక్కడికైనా ఇది అణ్వస్త్రాన్ని ప్రయోగించగలదు.
ఇక కొత్తగా ప్రదర్శించిన ఖండాంతర క్షిపణిని ఇంకా పరీక్షించాల్సి ఉంది. ఇది రెండంచెల లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్. హాసాంగ్-15 కన్నా చాలా ఎక్కువ పొడవు, లావు ఉన్న క్షిపణి ఇది.
ఈ క్షిపణిలోని ఇంజన్ల గురించి వెల్లడించటమో, దీనిని పరీక్షించటమో చేసే వరకూ.. దీని ఖచ్చితమైన లక్ష్య పరిధి ఎంత అనేది మనకు తెలిసే అవకాశం లేదు.
అయితే, దీని డిజైన్‌ను బట్టి ఉత్తర కొరియా ఉద్దేశాలేమిటో స్పష్టమవుతున్నాయి: వారు తమ క్షిపణుల లక్ష్యాన్ని ఇంకేమాత్రం పెంచాల్సిన అవసరం లేదు.
దానికిబదులుగా.. ఒకే క్షిపణితో బహుళ అణ్వస్త్రాలను ప్రయోగించటం మీద వారు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఇక్కట్లలో ఉన్న అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలకు ఇది మరో దెబ్బ అవుతుంది. ఎందుకంటే.. దాడికి వస్తున్న ఒక్కో వార్‌హెడ్‌ను నిర్వీర్యం చేయటానికి బహుళ ఇంటర్సెప్టర్లను లాంచ్ చేయాల్సి ఉంటుంది.
అధునాతన అణ్వస్త్రాలు గల దేశాలకు.. స్వతంత్రంగా పునఃప్రవేశించే వాహకనౌకలు (ఎంఐఆర్‌వీలు) ఉన్నాయి. అటువంటి వాటిని తామూ అభివృద్ధి చేయాలని ఉత్తర కొరియా ప్రయత్నిస్తోంది.
అత్యవసర ప్రమాద హెచ్చరిక
ఉత్తర కొరియా ప్రదర్శించిన భారీ ఖండాంతర క్షిపణి డిజైన్‌కు సంబంధించే పలు ప్రశ్నలున్నాయి. అంటే.. దానిని ఎప్పుడు పరీక్షిస్తారు, ఎప్పుడు మోహరిస్తారు అనేది ఇంకా అనిశ్చితమే. కానీ ఆ క్షిపణిని మోసుకెళ్తున్న ట్రక్ తక్షణ ఆందోళన కారకం.
అణ్వస్త్ర యుద్ధంలో ఉత్తర కొరియాకు సామర్థ్యానికి గల ప్రధాన అవరోధాల్లో ఒకటి.. ఆ దేశం దగ్గర ఉన్న లాంచర్ల సంఖ్య. ఎందుకంటే.. ఎన్ని లాంచర్లు ఉంటే అన్ని మిస్సైళ్లను మాత్రమే ప్రయోగించగలరు.
ఉత్తర కొరియా అత్యధికంగా 12 మిసైళ్లు లాంచ్ చేయగలదని అమెరికా అంచనా. ఆ దేశం దగ్గర ఆరు లాంచర్లు ఉన్నాయని.. ఒక్కో దాని నుంచి ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన తర్వాత అమెరికా ప్రతిస్పందించే లోగా వాటిని సిద్ధం చేసి మళ్లీ ఒక్కో క్షిపణిని ప్రయోగించగలరనే లెక్కతో ఈ ఇంచనాకు వచ్చారు.
ఉత్తర కొరియా 2010లో చైనా నుంచి డబ్ల్యూఎస్51200 హెవీ-డ్యూటీ ట్రక్కులు ఆరింటిని అక్రమంగా దిగుమతి చేసుకుని.. వాటిని హైడ్రాలిక్స్ సాయంతో ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్లు (టీఈఎల్) గా మార్చుకుంది. తమ ఖండాంతర క్షిపణులను రవాణా చేయటానికి, నిలబెట్టటానికి, లాంచ్ చేయటానికి ఈ టీఈఎల్‌లనే వాడుతోంది.
అయితే, తాజా పరేడ్‌లో ఆరింటికన్నా ఎక్కువ ట్రక్కులు కనిపించాయి. ఈ కొత్త ట్రక్కులను భారీగా మార్చివేశారు.
అంటే ఆంక్షలు, ఎగుమతి నియంత్రణలూ ఉన్నా కూడా ఉత్తర కొరియా హెవీ-డ్యూటీ లాంచర్లకు అవసరమైన విడిభాగాలను తెచ్చుకోగలుగుతోందని స్పష్టమవుతోంది. అంతేకాదు, దేశీయంగా లాంచర్లను మార్చివేయగలిగేలా, అసలు తామే మిసైల్ లాంచర్లను ఉత్పత్తి చేయగలిగే విధంగా ఉత్తర కొరియా తన తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకుందని కూడా తేలుతోంది.
అత్యంత క్లిష్టమైన ఈ సంవత్సరంలో ఉత్తర కొరియా కొత్తగా ఓ భారీ ఖండాంతర క్షిపణిని తయారుచేసి ప్రదర్శించటం.. తమ దేశాన్ని, తమ నాయకుడిని, తమ ప్రజల సాంకేతిక సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రపంచానికి సందేశం ఇవ్వటమే.
ఓపెన్ న్యూక్లియర్ నెట్‌వర్క్ డిప్యూటీ డైరెక్టర్ మెలిస్సా హానామ్ సామూహిక జనహనన ఆయుధాల నిపుణురాలు
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)