అజర్‌బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్‌బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా

రెండు దేశాల మధ్య యుద్ధ విరమణ సమయాన్ని అజర్‌బైజాన్ తమ సైన్యాన్ని సన్నద్ధం చేసేందుకు ఉపయోగించిందని నగార్నో-కరాబక్ విదేశీ వ్యవహారాలశాఖ ఆరోపించింది.

రష్యా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఇప్పుడు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అజర్‌బైజాన్, అర్మేనియాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి.

శాంతి పునరుద్ధరణకు అంతర్జాతీయ సమాజం ఎదుట ఉన్న ఏకైక మార్గం తమకు స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఇవ్వడమేనని నగార్నో-కరాబక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో చెప్పింది.

ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో అజర్‌బైజాన్‌లో భాగంగా చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్న ఎక్కువ జనాభా అర్మేనియాకు చెందినవారే.

అక్కడి పాలనలోనూ అర్మేనియా ఆధిపత్యం ఉంది. వారు అజేరీ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలూ ఉండకూడదని కోరుకుంటున్నారు.

యుద్ధ విరమణ ఒప్పందం విఫలమైందా

మాస్కోలో చర్చల సమయంలో మానవతా దృష్టితో తాత్కాలిక యుద్ధ విరమణ ప్రకటించామని, అది మృతదేహాలను మార్చుకోవడం వరకే ఉంటుందని అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రి జెహూన్ బాయ్రామోవ్ చెప్పారు.

రాజధాని బాకూలో మాట్లాడిన ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమ దేశానికి అనుకూలంగా లేవని, తమ నియంత్రణలో ఎక్కువ భూభాగం ఉంటుందని భావించామని అన్నారు.

యుద్ధ విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డారని అజర్బైజాన్, అర్మేనియా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

దీంతో యుద్ధ విరమణ ఒప్పందానికి ఉన్న ప్రాధాన్యంపై ప్రశ్నలు వస్తున్నాయి.

టర్కీ మద్దతు ప్రకటన

నగార్నో-కరాబక్ వివాదాస్పద ప్రాంతం పూర్తిగా అజర్‌బైజాన్ నియంత్రణలోకి వచ్చేవరకూ ఈ యుద్ధంలో ఆ దేశానికి తాము మద్దతు ఇస్తూనే ఉంటామని టర్కీ ప్రకటించింది.

“అజర్‌బైజాన్ సైన్యం సాహసాన్ని చూపించింది. తమ నియంత్రణలోని ప్రాంతాలను కాపాడుకోవడంలో వారు భారీ విజయం సాధించారు.

అర్మేనియా తాను ఆక్రమించిన భూభాగాన్ని అప్పగించాలి. అర్మేనియా ఇలా చేస్తున్నంతవరకూ మేం, మా అజేరీ సోదరులకు అండగా నిలుస్తాం” అని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ హాండిల్లో చెప్పింది.

యుద్ధ విరమణ ఉల్లంఘన ఆరోపణ

అర్మేనియా యుద్ధ విరమణను ఉల్లఘించిందని అజర్బైజాన్ శనివారం ఆరోపించింది.

నగార్నో-కరాబక్ వివాదాస్పద ప్రాంతంపై ఆధిపత్యం కోసం రెండు వారాల నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్ యుద్ధం చేస్తున్నాయి. రష్యా మధ్యవర్తిత్వంతో శనివారం రెండు దేశాలూ యుద్ధ విరమణను ప్రకటించాయి.

కానీ, అజర్బైజాన్ వైపు నుంచి యుద్ధ విరమణ ప్రకటన వచ్చిన కాసేపట్లోనే ఈ ఆరోపణలు వెలుగుచూశాయి.

"అర్మేనియా బాహాటంగా యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రెండు వేర్వేరు దిశల నుంచి వారి సైన్యం దాడులు చేసింది. తెర్తర్, అగదామ్ ప్రాంతాల్లో శత్రువులు కాల్పులు జరిపార"ని అజర్బైజాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అయితే, అర్మేనియా వైపు నుంచి కూడా అజర్బైజాన్ మీద ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

యుద్ధ విరమణ అమలైన తర్వాత కారాఖంబెయిలీ ప్రాంతంలో అజర్బైజాన్ సైనికులు దాడి చేశారని అర్మేనియా రక్షణ శాఖ చెప్పింది.

"కరబఖ్‌లో భద్రతా బలగాలు శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాయ"ని అర్మేనియా రక్షణ శాఖ మీడియా కార్యదర్శి షుషైన్ స్టీఫెన్‌యాన్ చెప్పారు.

అర్మేనియా రక్షణ శాఖ నివేదిక ప్రకారం యుద్ధ సమయంలో నగార్నో-కరాబఖ్‌కు చెందిన మరో 28 మంది అజర్బైజాన్ సైన్యంతో జరిగిన కాల్పుల్లో చనిపోయారు. వీరితో కలిపి ఈ యుద్ధంలో మొత్తం మృతుల సంఖ్య 404కి పెరిగింది.

డ్రోన్ దాడుల వీడియో

అజర్బైజాన్ రక్షణ శాఖ తమ సాయుధ వాహనంపై వైమానిక దాడి జరిగినట్లు ఒక డ్రోన్ వీడియో విడుదల చేసింది. దానిని యుద్ధ విరమణ ఉల్లంఘనగా చెప్పింది. అయితే, ఈ వీడియోను ఎప్పుడు రికార్డ్ చేశారనేది స్పష్టంగా తెలీడం లేదు.

యుద్ధ విరమణకు ముందు అర్మేనియా సైనిక సాధనాలపై అజర్బైజాన్ డ్రోన్లతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.

అంతకు ముందు అజర్బైజాన్, అర్మేనియా విదేశాంగ మంత్రుల మధ్య మాస్కోలో శాంతి చర్చల తర్వాత శనివారం మధ్యాహ్నం నుంచి ఘర్షణ జరిగే ప్రాంతంలో యుద్ధ విరమణకు అంగీకారం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం యుద్ధ బందీలు, మృతుల శవాలను మార్చుకోవడానికి ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఘర్షణకు శాంతి పూర్వక పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించడానికి కూడా సమ్మతించాయి.

నగార్నో-కరాబక్ గురించి కొన్ని విషయాలు

  • ఇది 4400 చదరపు కిలోమీటర్లు పర్వత ప్రాంతం.
  • ఇక్కడ క్రిస్టియన్ అర్మేనియన్లు, టర్కీ ముస్లింలు నివసిస్తున్నారు. అజర్బైజాన్‌లో భాగమైన ఇది సోవియట్ యూనియన్ రద్దుకు ముందు స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా మారింది.
  • అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతాన్ని అజర్‌బైజాన్‌లో భాగంగా గుర్తిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువగా అర్మేనియన్లే ఉంటున్నారు.
  • అర్మేనియాతో సహా ఐక్యరాజ్యసమితిలోని ఏ సభ్య దేశమూ ఈ ప్రాంతం స్వయం ప్రతిపత్తికి గుర్తింపు ఇవ్వలేదు.
  • 1980వ దశకం చివరి నుంచి 1990 వ దశకం వరకూ జరిగిన యుద్ధంలో 30 వేల మందికి పైగా చనిపోయారు. ఆ సమయంలో వేర్పాటువాద శక్తులు ఇక్కడ కొన్ని ప్రాంతాలను ఆక్రమించాయి.
  • 1994లో ఇక్కడ యుద్ధ విరమణ జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
  • టర్కీ బాహాటంగా అజర్బైజాన్‌కు మద్దతు ఇస్తోంది.
  • ఇక్కడ రష్యాకు చెందిన ఒక సైనిక స్థావరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)