మరణించారనుకున్న దేశాధ్యక్షుడు మళ్లీ ప్రత్యక్షం

తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బెర్దీముఖమెదోవ్ మళ్లీ కనిపించారు. నెల రోజుల కిందట చనిపోయినట్లుగా భావిస్తున్న ఆయన మళ్లీ కనిపించడంతో ఆయన మరణ వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

ఇరుగుపొరుగు దేశాల నేతలతో కలిసి నిర్వహించిన 'కాస్పియన్ ఆర్థిక వేదిక' సదస్సులో సోమవారం ఆయన కనిపించడంతో మరణ వార్తలన్నీ వదంతులేనని తేలింది.

బెర్ీముఖమెదోవ్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ చనిపోయారంటూ గత నెల రోజులుగా రష్యా ప్రాంత మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమైంది.

అదంతా అవాస్తవమంటూ తుర్క్‌మెనిస్తాన్ మీడియా కథనాలు ప్రసారం చేసినా అవేమీ ఈ వదంతుల ముందు నిలవలేదు.

ఆయన సెలవులో ఉన్నారంటూ అందుకు సంబంధించిన వీడియోలనూ తుర్క్‌మెనిస్తాన్ మీడియా ప్రసారం చేసినా కూడా అది తాజాదే అని స్వతంత్ర మీడియా ఏదీ రుజువు చేయకపోవడంతో.. ఆయన మరణించారన్న వదంతులే ఎక్కువగా ప్రచారమయ్యాయి.

అయితే, సోమవారం ఆయన కాస్పియన్ సముద్ర తీర నగరం అవాజాలో ఇతర దేశాల అధినేతలతో కలిసి సదస్సుకు రావడంతో వదంతులన్నీ అవాస్తవాలని తేలిపోయింది.

దీంతో.. ఆయన బతికే ఉన్నారనడానికి ఆధారంగా.. రష్యా, అజర్‌బైజాన్, కజక్‌స్తాన్, ఇరాన్ నేతలతో ఆయన ''మొట్టమొదటి కాస్పియన్ ఆర్థిక వేదిక శుభాకాంక్షలు'' అంటూ ఆయన మాట్లాడుతున్న వీడియోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి.

మరణించారన్న ప్రచారం ఎక్కడ మొదలైంది

తుర్క్‌మెనిస్తాన్‌లో బెర్దీముఖమెదోవ్ పాలనను వ్యతిరేకిస్తున్న ఓ దేశానికి చెందిన చిన్న మీడియా సంస్థ నెల రోజుల కిందట మొట్టమొదట ఈ వార్తను ప్రసారం చేసింది.

ఆ వార్త ఆధారంగా రష్యాలోని ప్రధాన మీడియా సంస్థలు సహా అందరూ కథనాలు ప్రసారం చేశారు. దీంతో సోవియట్ దేశాలంతటా ఈ వార్త దావానలంలా వ్యాపించింది.

తుర్క్‌మెనిస్తాన్ ప్రభుత్వ చానల్ వతన్ హబర్లరీ ఈ వదంతులను ఖండిస్తూ అధ్యక్షుడు గుర్రపు స్వారీ చేస్తున్న దృశ్యాలు, కారు నడుపుతున్న దృశ్యాలను ప్రసారం చేసినా వాటినెవరూ నమ్మలేదు.

తుర్క్‌మెనిస్తాన్‌లో మీడియా స్వేచ్ఛ లేదని.. ఉత్తరకొరియా కంటే కూడా ఇక్కడ పరిస్థితులు దారుణమని చెబుతుంటారని.. ''అలాంటి పరిస్థితుల్లో నిజనిర్ధారణ కష్టం'' అని అక్కడి బీబీసీ ప్రతినిధి అబ్దుజలీల్ అబ్దురసులోవ్ చెప్పారు.

ఆయన స్టైలే సెపరేటు

గుర్బాంగులీ బెర్దీముఖమెదోవ్ 2006లో అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. విపరీతమైన హడావుడి, డాబుసరి వ్యవహారాలు, తెచ్చిపెట్టుకున్న ధీరత్వ ప్రదర్శనలకు ఆయన పెట్టింది పేరు.

టీ తాగే అలవాటుపై, మూలికా వైద్యంపై పుస్తకాలు రాశారాయన. గుర్రపు స్వారీ అంటే ఇష్టపడే ఆయన గుర్రాల గురించి వర్ణిస్తూ ర్యాప్ సాంగ్స్ కూడా రాశారు. 2013లో ఓసారి గుర్రంపై నుంచి పడ్డారు కూడా.

బెర్దీముఖమెదోవ్ పాలనను సుఖసంతోషాలతో సాగుతున్న స్వర్ణయుగంగా అక్కడి అధికారిక మీడియా చెప్పుకొంటుంది.

అంతేకానీ ఈ మీడియా సంస్థలు దేశంలో తీవ్రస్థాయిలో ఉన్న ఆహార కొరత.. అధ్యక్షుడిని విమర్శించేవారంతా అదృశ్యం కావడంపై మాత్రం ఎలాంటి కథనాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)