గల్వాన్‌ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’

సోమవారంనాడు జరిగిన ఘర్షణ సందర్భంగా బందీలుగా పట్టుబడ్డ 10మంది భారతీయ సైనికులను చైనా విడుదల చేసినట్లు భారత మీడియా సంస్థలు వెల్లడించాయి.

విడుదలైన వారిలో ఒక లెఫ్టినెంట్‌, ముగ్గురు మేజర్‌లు కూడా ఉన్నట్లు ఇండియన్‌ ఆర్మీ వర్గాలు తమకు తెలిపినట్లు 'ది హిందూ' పత్రిక రాసింది. కానీ భారత ప్రభుత్వం ఈ వార్తను ధృవీకరించలేదు. అసలు తమ సైనికులు మిస్సయినట్లు కూడా ఇంత వరకు సైన్యం ప్రకటించలేదు.

గల్వాన్‌ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20మంది భారతీయ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో తమవైపు జరిగిన ప్రాణనష్టాన్ని చైనా ఇంత వరకు ప్రకటించలేదు. మరోవైపు ఈ ఘర్షణలో 76మంది భారతీయ సైనికులు తీవ్రంగా గాయపడ్డారని కూడా తెలుస్తోంది. మీరు చొరబడ్డారంటే మీరు ఆక్రమణకు దిగారంటూ ఇరుదేశాల ప్రతినిధులు వాదించుకుంటున్నారు.

రెండు దేశాల మధ్య సరిహద్దులు సరిహద్దులు సరిగా లేకపోవడంతో ఈ ఘర్షణలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ పరిణామాలు ఈ ప్రాంతపు నైసర్గిక స్వరూపంలో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.

బుధవారంనాడు రెండు దేశాల మధ్య జరిగిన చర్చల తర్వాత భారతీయ సైనికులను విడుదల చేయాలని నిర్ణయించారని 'ఇండియా టుడే' సీనియర్ ఎడిటర్‌ శివ్‌ అరూర్ ట్విటర్‌లో వెల్లడించారు.

'గల్వాన్ లోయ ఘర్షణల్లో చైనా సైనికులు ఉపయోగించిన ముళ్ల గద ఇదే...'

గల్వాన్ నది లోయ తమ భూభాగమంటూ చైనా చేసిన ప్రకటనలను భారత్ తోసిపుచ్చింది.

చైనా వాదన అతిశయోశక్తిగా ఉందని, తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

జూన్ 15 రాత్రి భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘర్షణలో భారత సైనికులపై దాడి చేసేందుకు చైనా సైనికులు వాడిన ఆయుధంగా చెబుతూ ఓ ఫొటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో దీన్ని ప్రస్తావిస్తూ, చైనా తీరుపై భారత్‌లో చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇనుప రాడ్‌కు అన్ని వైపులా మేకులతో ఉన్న ఆ ఆయుధం ఫొటోను భారత్-చైనా సరిహద్దు వద్ద సేవలందిస్తున్న ఓ సీనియర్ సైనిక అధికారి బీబీసీకి కూడా ఇచ్చారు. అయితే, రెండు దేశాల సైన్యాలు మాత్రం ఈ ఆయుధం గురించి ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.

రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా ఈ ఫొటోను మొదటగా ట్విటర్‌లో పెట్టారు.

మరోవైపు ఈ ఘర్షణ విషయమై భారత్, చైనా ఒకదాన్ని మరొకటి తప్పుపట్టుకున్నాయి.

చైనా సైన్యం వైపు జరిగిన నష్టం గురించి ఆ దేశం సమాచారమేమీ వెల్లడించలేదు. 40 మందికిపైగా చైనా సైనికులు మరణించినట్లు భారత మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు ఇంకా కొంత మంది భారత సైనికుల ఆచూకీ కూడా లభించలేదని ప్రచారమవుతోంది.

గల్వాన్ లోయ ప్రాంతంపై చైనాదే సార్వభౌమత్వమని ఆ దేశం బుధవారం ఓ ప్రకటన చేసింది.

ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్‌లో సంభాషించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. పూర్తి పరిస్థితిపై బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని అంగీకరించుకున్నట్లు తెలిపారు.

‘‘ఆమోదయోగ్యం కాని, అతిశయోక్తైన ప్రకటనలు చేయడం ఈ అంగీకారానికి పూర్తి విరుద్ధం’’ అని శ్రీవాస్తవ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.

ఇరు దేశాల విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ తర్వాత భారత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

వ్యూహాత్మకంగా ప్రధానమైన గల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖకు భారత్ వైపున చైనా ఓ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రయత్నించిందని ఇందులో పేర్కొంది.

ముందే అనుకుని, ప్రణాళికతో ఈ చర్య చేపట్టి ఈ హింసకు, మరణాలకు నేరుగా చైనానే కారణమైందని, ‘తప్పు సరిదిద్దుకునే చర్యలు’ తీసుకోవాలని ఆ దేశాన్ని అభ్యర్థించామని తెలిపింది.

‘‘చైనా మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సమగ్ర విచారణ ప్రారంభించాలని భారత్‌ను అభ్యర్థిస్తోంది. మళ్లీ ఇలాంటివి జరగకుండా, రెచ్చగొట్టే చర్యలు ఆపాలని కోరుతోంది’’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వ్యాఖ్యానించినట్లు చైనా ప్రకటన విడుదల చేసింది.

గల్వాన్ లోయ లద్ధాఖ్‌లో ఉంది. ఇక్కడ ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఎల్‌ఏసీ పశ్చిమ సెక్టార్‌లో, అక్సాయ్ చిన్‌కు సమీపంలో ఈ ప్రాంతం ఉంది.

అక్సాయ్ చిన్ ఇప్పుడు చైనా నియంత్రణలో ఉంది. అయితే, ఇది తమ భూభాగమని భారత్ వాదిస్తోంది.

14వేల అడుగుల ఎత్తున్న కొండ ప్రాంతంలో సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, కొందరు సైనికులు వేగంగా ప్రవహించే గల్వాన్ నదిలోకి పడిపోయారని వార్తలు వచ్చాయి.

ఈ వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో గత 45 ఏళ్లలో సైనికుల ఘర్షణలో ప్రాణాలు పోవడం ఇదే మొదటి సారి.

కర్రలు, బ్యాట్లతో సైనికులు తలపడ్డారని, కాల్పులు జరగలేదని వార్తలు వచ్చాయి.

అయితే, సరిహద్దుల్లో మందుగుండు ఆయుధాలు లేకుండా భారత్, చైనా సైనికులు తలపడటం ఇదేమీ మొదటిసారి కాదు. ఎల్ఏసీ వెంబడి ఇదివరకు కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)